బుధవారం 25 నవంబర్ 2020
Warangal-city - Nov 01, 2020 , 01:51:56

తనువెల్లా తపన

తనువెల్లా తపన

పర్యటన ఆద్యంతం ముఖ్యమంత్రి కేసీఆర్‌లో రైతు బాగు కోసమే కనిపించిన ఆరాటం

సభలో ఉద్వేగ భరితంగా ప్రసంగం 

రైతుల అకౌంట్లలో నిల్వ ఉంటేనే బంగారు తెలంగాణ 

కేసీఆర్‌ బతికున్నంతకాలం రైతుబంధు

వేదికలు నిర్మించినందుకు రైతుగా గర్వపడుతున్నా

రాజ్యాన్ని జయించినంత సంతోషంగా ఉంది

కొడకండ్ల రైతు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొడకండ్ల వేదికగా భూమి పుత్రుడు సీఎం కేసీఆర్‌ కొడకంట్ల పర్యటన ఆద్యంతం ఆయనలో రైతుల బాగు కోసం తపనే కనిపించింది. జనగామ జిల్లా కొడకండ్లలో శనివారం రైతు వేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి, అనంతరం సభలో చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా.. అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. పెట్టుబడి ఖర్చులకు అవసరమైన మేరకు రైతుల బ్యాంకు అకౌంట్లలో నిల్వ ఉంటేనే బంగారు తెలంగాణ సాకారమైనట్లని.. రైతులు సొంతంగా పెట్టుబడి సమకూర్చుకునే దాకా తాను నిద్రపోనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతు బంధు ఉంటుందని, రైతుల బాగు కోసం రైతు వేదికలు ఉపయోగపడుతాయని చెప్పారు. పల్లెలు పట్టుకొమ్మలుగా మారాలని ఆకాక్షించారు. రైతు వేదికలను నిర్మించడం రైతు బిడ్డగా, రైతుగా గర్వపడుతున్నానన్నారు. వేదికను ప్రారంభించాక రాజ్యాన్ని జయించినంత సంతోషంగా ఉందని చెప్పారు. రైతులు ఒక దగ్గర కూర్చోవాలంటే జాగ లేదని.. సాగును లాభసాటిగా మార్చేందుకు అవసరమైన వాటిని తెలుసుకునేందుకు రైతు వేదికలు కేంద్రాలుగా ఉంటాయన్నారు. రైతు వేదికలను అన్నదాతల శక్తి కేంద్రాలుగా అభివర్ణించారు. రైతులు సంఘటితమైతే విప్లవం సృష్టించవచ్చని మరీమరీ నొక్కిచెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 

కరువును చూసి ఏడ్చిన..

బచ్చన్నపేట : సభలో సీఎం కేసీఆర్‌ మరోమారు బచ్చన్నపేటను గుర్తు చేశారు. ‘ఉద్యమ సమయంల బచ్చన్నపేట మండ ల కేంద్రం నుంచి పోతూపోతూ జీపును ఆపి సెంటర్‌లో మాట్లాడిన.. చాలా ఆశ్చర్యానికి గురైన.. ఏందయ్యా ఒక్క యువకుడు కనపడుతలేడు.. అందరు ముసలోల్లే కన్పిస్తుండ్రనడిగితే.. కరువుతో బతుకపోయిండ్రన్నరు.. వరుసగ ఏడో సంవత్సరం కరువచ్చి.. మంచినీళ్లు లేవు.. మూడునాలుగు కిలోమీటర్లు బండిమీద పోయి తెచ్చుకుంటున్నం.. నాలుగైదు రోజులకోనాడు స్నానం చేస్తున్నమని చెప్తాంటె కండ్ల నిండ ఏడ్చిన’ అని నాటి మాటలు గుర్తు చేసుకుంటూ కేసీఆర్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. రైతుల కోసం తాను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా ఇతర సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూనే భవిష్యత్‌లో రైతు వేదికల ప్రయోజనాన్ని కూలంకషంగా వివరించారు. పలు సందర్భాల్లో పథకాలతో ప్రజలకు కలుగుతున్న లబ్ధిపై సభికులను అడిగి తెలుసుకున్నారు. మున్ముందు వేదికలతో సాధించే ప్రగతిని వివరిస్తుండగా రైతుల్లో నూతనోత్సాహం కనిపించింది. 

రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని 

చూసి సంబురం

పాలకుర్తి రూరల్‌/కొడకండ్ల : కొడకండ్లలో నిర్మించిన రైతు వేదిక, ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని చూసి సీఎం కేసీఆర్‌ సంబురపడ్డారు. రైతు వేదిక ఎదురుగా ఉన్న రైతు ఎడ్లబండి విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రైతుల పాలిట దేవాలయమైన రైతు వేదికను ప్రారంభిస్తుంటే సీఎం కేసీఆర్‌లో చెప్పలేనంత సంతోషం, భావోద్వేగం కనిపించింది. ఇవి కేవలం రైతు వేదికలు కావు.. రైతుల సంఘటితానికి నిలయాలని స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించినప్పుడు కలిగిన సంతోషాన్ని నిండు సభలో పంచుకున్నారు.  గుట్ట మీద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని చూస్తే ఎక్కడ లేనంత ఆనందం కలిగిందన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్‌లు, అధికారుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. 

సర్పంచ్‌కు సత్కారం  

రైతు వేదిక సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌కు కొడకండ్ల సర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌ నాగలి బహూకరించి సత్కరించబోయారు. అయితే ముఖ్యమంత్రి ఆ నాగలిని సర్పంచ్‌కే తిరిగిచ్చారు. రైతు రాజ్యం రావాలన్నదే తన లక్ష్యం, అభిలాష అంటూ అతడికి శాలువా కప్పారు. ‘పల్లె ప్రకృతి వనం చాలా బాగుంది.. శభాష్‌ మధుసూదన్‌' అంటూ ప్రశంసించారు.