మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-city - Oct 31, 2020 , 02:22:50

అర్చకుల సంక్షేమమే లక్ష్యం

అర్చకుల సంక్షేమమే లక్ష్యం

వరంగల్‌ చౌరస్తా, అక్టోబర్‌ 30 : రాష్ట్రంలోని అర్చకుల సంక్షేమమే లక్ష్యమని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్‌ మట్టెవాడ భోగేశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన సమితి ద్వితీయ వార్షికోత్సవ మహాసభకు 33 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, ఉపేంద్రశర్మ మాట్లాడారు. 2015లో 577 జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,625 మంది అర్చకులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినా దేవాదాయ శాఖ అధికారులు స్పందించడం లేదని అన్నారు. ప్రస్తుతం సుమారు మూడు వేల మందికి మాత్రమే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్ధతి ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారని, మిగిలిన వారికి మొండి చెయ్యి చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులను ఏకంచేసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల అర్చకులకు జీవో నంబర్‌ 179, 249 ప్రకారం ఆలయ పరిధిని పెంచాలని, రూ. 6వేల వేతనం అందించాలని, ధూపదీప నైవేద్యం పథకం అమలు చేస్తున్న ఆలయాల అర్చకులకు రూ.10 వేల వేతనం అందించాలని ప్రభుత్నాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 3,640 దేవాలయాలకు ధూపదీప, నైవేద్యం అమలు చేస్తూ ప్రతి సంవత్సరం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. అనంతరం తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నూతన అధ్యక్షుడిగా కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గంగు ఉపేంద్రశర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చిన్నం మోహన్‌, ప్రధాన కార్యదర్శిగా బేతి కేశవ, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏనుగుల అనిల్‌శర్మ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌ సంజీవరావును ఎన్నుకున్నారు.