శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 31, 2020 , 02:22:48

యువతకు పోలీస్‌ ట్రైనింగ్‌

యువతకు పోలీస్‌ ట్రైనింగ్‌

ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ 

ఉమ్మడి జిల్లాలో మూడు సెంటర్లు ఏర్పాటు

వరంగల్‌ అర్బన్‌లో నేడు ఫిజికల్‌ టెస్ట్‌లు 

సుబేదారి, అక్టోబర్‌ 30 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు నౌకరీ దొరకాలంటే మామూలు విషయం కాదు. రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకున్నా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. అందులో పోలీసు నౌకరీ అంటే ఇంకా కష్టం. దీనికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌, ప్రిపరేషన్‌ రెండూ ఉంటేనే పోలీసు ఉద్యోగం సాధ్యం. అయితే, ఎలాగైనా పోలీసు కావాలనుకునే కసి ఉన్న యువతకు రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ చక్కటి అవకాశం కల్పిస్తోంది. వారికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి 3300 మందికి శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్‌ అర్బన్‌, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఉచిత శిక్షణలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమివ్వనున్నారు. 

పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఫిజికల్‌ టెస్ట్‌ అనేది అ త్యంత ముఖ్యమైనది. ఎత్తు, శారీరక దృఢత్వం, పరుగుపం దెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌ తదితర పరీక్షల్లో రాణించాల్సి ఉంటుంది. ఇందుకోసం  నిరుద్యోగులకు ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించిన వారు, అలాగే, సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ ఉచిత కోచింగ్‌ తీసుకోవచ్చు. ఇందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 96 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా ఇంటర్మీయెట్‌ విద్యాశాఖ అధికారి గోపాల్‌ తెలిపారు.  

శిక్షణ ఇలా..: ముందుగా పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీలో తొలివిడుతగా నిర్వహించే ప్రిలిమినరీ టెస్ట్‌ సిలబస్‌పై అభ్యర్థులకు స్థానిక కోచింగ్‌ సెంటర్‌ హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు ఫిజికల్‌ టెస్టులైన పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, హైజంప్‌లో రాణించడానికి ట్రైనర్‌తో గ్రౌండ్‌లో శిక్షణ ఇస్తారు. అనంతరం ఫైనల్‌ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్‌పై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ కోచింగ్‌ మొత్తం  నాలుగు నెలలు ఉంటుంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఫిజికల్‌ టెస్ట్‌లు, ఆ తర్వాత క్లాస్‌లు ఉంటాయి.

నేడు అభ్యర్థుల ఎంపిక : ఉచిత శిక్షణ కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి 96 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 74 మంది అబ్బాయిలు, 22 మంది అ మ్మాయిలు ఉన్నారు. వీరికి శనివారం హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతిని కొలిచి ఎంపిక చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.