శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 30, 2020 , 02:24:23

ధరణి వచ్చే.. ధైర్యమిచ్చే..

ధరణి వచ్చే.. ధైర్యమిచ్చే..

  •  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  సేవలు ప్రారంభం
  • పారదర్శక సేవలకు శ్రీకారం
  • తహసీల్దార్‌ కార్యాలయాల్లో పండుగ వాతావరణం
  • పోర్టల్‌పై సర్వత్రా హర్షాతిరేకం
  •  అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సామాన్యుడి కేంద్రంగా భూపరిపాలనకు బీజం పడింది. పారదర్శకంగా, సులభంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి పోర్టల్‌' సేవలు ఉమ్మడి జిల్లాలోని 75 మండలాల్లో మొదలయ్యాయి. తహసీల్దార్‌ ఆఫీసులన్నీ జాయింట్‌ రిజిస్ట్రార్‌ సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగానే అన్ని మండలాల్లోని ఆఫీసుల్లోనూ లాంఛనంగా మొదలుపెట్టారు. తహసీల్దార్‌ కార్యాలయాలను పూలతో అలంకరించారు. పోర్టల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వీట్లు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్‌ సేవలకు అనుగుణంగా ఆఫీసుల్లో ప్రత్యేక ఆవరణ కేటాయించారు. గతంలో ఉన్న ఆఫీసులు ఇప్పుడు సరికొత్తగా మారాయి. ధరణి అందుబాటులోకి రావడంతో ఏండ్లుగా సొంత భూముల రక్షణ కోసం పడే తిప్పలకు ముగింపు పలికినట్లయిందని రైతులు ధీమాగా చెబుతున్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టే పాచి నిబంధనలకు పాతర పడిందని అంటున్నారు. భూముల విషయంలో ధీమా కలిగితే.. తమ దృష్టి అంతా ఇక పంటల సాగుపైనే ఉంటుందని చెబుతున్నారు. సాగునీటి వసతి పెరుగడంతో గ్రామాల్లో భూములు ఇప్పుడు ఆస్తిగా మారాయి. ఇది అనుకూల పరిణామమైనా పాత చట్టాల్లోని లొసుగులతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సొంత భూమి ఒక్కసారిగా పరాయి వ్యక్తుల పేరిట మారిపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల గోస చెప్పలేని విధంగా ఉండేది. ఇలాంటి కష్టాలకు ముగింపు పలికేలా సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం పకడ్బందీ అమలు కోసం ‘ధరణి’ పోర్టల్‌ను తెచ్చారు. భూముల సమగ్ర సమచారంతోపాటు అవినీతికి, అధికారుల విచక్షణపై ఆధారపడే పరిస్థితికి ముగింపు పలికేలా ‘ధరణి’ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘ధరణి’ రాకపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక భూ సమస్యలకు ఈ పోర్టల్‌ ద్వారా చరమగీతం పాడినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. 


ఇక రందే ఉండదు..

పొద్దుందాక చేన్ల పనికాన్నే ఉండేది. ఈ పనంత ఎవడు ఇడిసి పెట్టిపోవాలె అని అసమర్థత ఉండేది. ఏదైన భూమి పట్టాల విషయంలో తెలుసుకోవాలని ఆఫీస్‌కు పోతె ఆ రోజంత పని సున్నా అయ్యేది. ఇక నుంచి ఆ రందే ఉండదనిపిస్తాంది. భూ హక్కుల విషయంలో ఎవరికి వారు ఎప్పటికప్పుడు చూసుకునేందుకు తీసుకొచ్చిన ధరణి సైట్‌ ఎంతగానో ఉపయోగపడుతది. క్షణాల్లో భూమి అమ్మకాలు కొనుగోలు జరుగుతే సమయం చాలా ఆదా అయితది. రైతు గోడు గూర్చి తెలిసిన సీఎం కేసీఆర్‌ సల్లంగ ఉండాలే..

-రైతు పొల్లు సరోత్తంరెడ్డి, టేకుమట్ల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా


రైతుల కల నెరవేరింది

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’తో రైతుల కల నెరవేరింది. రెవెన్యూ శాఖలో గతంలో ఉన్న దళారి వ్యవస్థకు అడ్డుకట్టపడే బృహత్తర కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టాడు. సారు రైతుల పాలిట దేవుడు. గతంలో తహసీల్దార్‌ కార్యా లయాల చుట్టూ కొన్ని ఏండ్లు తిరిగినా  ఎవుసాయ భూముల పట్టా కాలేదు. దానికి తోడు దళారీలు రైతుల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతిన్నరు. ఇక నుంచి లంచగొండి తనం ఉండదనే నమ్మకం కలిగింది. ఏళ్ల తరబడి కాని పనులు ఇక సాధ్యమవుతాయట. రైతుల అవస్థలు తీరినట్టే. తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటారు.

-జాడి భాయమ్మ, మహిళా రైతు, గడ్డిగానిపల్లి, కృష్ణకాలనీ


రైతుల గోస తీరినట్టే

భూములమ్ముడు కొనుడు, హక్కుల కాడ తెలంగాణ రైతులు గోస వడద్దని కేసీఆర్‌ సారు ధరణిని తెచ్చిండు. ఇదివరకు భూమికి పట్టా కోసం ఎక్కన్నో ఉన్న ఆఫీసుకు చెప్పులరిగేటట్లు తిరిగినా కాలేదు. పట్టా చెయ్యిమని పట్వారి కాళ్లు మొక్కినా చెయ్యకపాయె. కొత్తల కోసం జెనిగెలెక్క పట్టుకునేటోళ్లు. ఇగ ఎవ్వల బతిలాడే పని లేదు. దళారులతోటి పనిలేకుంట పట్టా ఇంటికాడికే వచ్చేటట్టు చేసిన సీఎం సారు సల్లంగుండాలె. రైతుల పాలిట దేవుడు ఉన్నడంటే ఒక్క కేసీఆరే.  

- మానేటి దుర్గయ్య, రైతు, స్తంభంపల్లి పీకే, మహాముత్తారం మండలం, జయశంకర్‌ భూపాలపల్లి