ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-city - Oct 29, 2020 , 02:07:04

వేగంగా వేదికలు

వేగంగా వేదికలు

  • ఆరు జిల్లాల్లో 334
  • రూ.73.60 కోట్ల నిధులు
  • శరవేగంగా పనులు
  • ఇప్పటికి 81పూర్తి
  • నవంబర్‌ 4న ప్రారంభానికి సన్నాహాలు

అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుటికప్పుడు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘రైతు వేదిక’ల నిర్మాణం ఉమ్మడి జిల్లాలో శరవేగంగా సాగుతున్నది. ఆరు జిల్లాల్లో రూ.73.60 కోట్లతో 334 భవనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటికి 81 పూర్తయ్యాయి. నవంబర్‌ మొదటివారంలోగా వేదికలను వందశాతం పూర్తిచేసి ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం వడివడిగా కదులుతున్నది. 

వరంగల్‌ ప్రతినిధి/వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : సాగును లాభసాటిగా మార్చేందుకు కావాల్సిన సలహాలు, సూచలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నది. లాభసాటి వ్యవసాయం, రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వీటికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికత, కొత్త పద్ధతులను రైతులకు వెంటవెంటనే తెలియజేయడం వల్ల సాగు లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నది. నిరంతరం నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలిచ్చేందుకు ప్రత్యేకంగా వేదికలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా భవనాల నిర్మాణం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 334 వేదికల నిర్మాణం మొదలైంది. జనగామలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 81 వేదికల నిర్మాణం పూర్తయ్యింది. వీలైనంత త్వరలో వందశాతం నిర్మాణాలు పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. నవంబర్‌ 4న వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.  

యుద్ధ ప్రాతిపదికన పనులు

ముందుగా దసరా లోగా వేదికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా కరోనా, వర్షాల కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. నవంబర్‌ మొదటి వారంలోగా పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 334 వ్యవసాయ క్లస్టర్లుండగా ప్రతి క్లస్టర్‌లోనూ వేదికలు నిర్మితమవుతున్నాయి. 

ఒకరికొకరు సలహాలు పంచుకునేలా 

వ్యవసాయంలో ప్రతి రైతు తన అనుభవంతో సాగులో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు పాటిస్తూ, ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలా చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఇలాంటి పద్ధతులను రైతులు ఒకరికొకరు పంచుకునేందుకు గతంలో గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలు ఉండేవి. కాలక్రమేణా అవి లేకుండాపోయాయి. రాష్ట్రంలో ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులతో ఏటేటా విస్తీర్ణం పెరుగుతున్నది. కొత్త రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు, రైతుల అనుభవాలను అన్నదాతలందరికీ వివరించేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నది. వ్యవసాయంలో కొత్త సాంకేతికతపై అవగాహన పెంచేందుకు శిక్షణ కేంద్రాలుగా ఈ వేదికలు ఉండబోతున్నాయి. అన్ని రకాల వసతులుండేలా వేదికలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.22లక్షల చొప్పున కేటాయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ రూ.12 లక్షలు, వ్యవసాయ శాఖ రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నాయి. మరో వారంలోపు వీటిని ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జిల్లా అధికారయంత్రాంగం వడివడిగా చర్యలు చేపడుతున్నది.