ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-city - Oct 29, 2020 , 02:07:04

కమిషనరేట్‌ మార్క్‌

కమిషనరేట్‌ మార్క్‌

  • సంచలనాత్మక కేసుల్లో ఖతర్నాక్‌ దర్యాప్తు
  • నిందితులు తప్పించుకోకుండా పక్కాగా చార్జిషీట్‌
  • ప్రజల్లో నమ్మకం పెంచుతున్న వరంగల్‌ పోలీసులు

వరంగల్‌ క్రైం : నేరస్తులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నారు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు. ఎలాంటి కేసు విచారణలోనైనా తమ మార్క్‌ చూపిస్తున్నారు. గతేడాది జాన్‌ 18న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాయీ బ్రాహ్మణవాడలో బిల్డింగ్‌పై నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిపై కామాంధుడు లైంగికదాడిచేసి అతి క్రూరంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అప్పటి సీపీ విశ్వనాథ రవీందర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి ఏసీపీ శ్రీధర్‌, హన్మకొండ పోలీసులు 21 రోజుల్లోనే పక్కా ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించి 48 రోజుల్లోనే నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు ఉరి శిక్ష పడేలా చేశారు. దీంతో ప్రజలందరి నుంచి పోలీసులపై అభినందనలు వెల్లువెత్తాయి. హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, షీటీం రాష్ట్ర ఇన్‌చార్జి స్వాతి లక్రా ట్విట్టర్‌ వేదికగా కమిషనరేట్‌ పోలీసులను ప్రశంసించారు. 

అప్పటి సీపీ రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారి ఏసీపీ శ్రీధర్‌, ఇన్‌స్పెక్టర్లు సంపత్‌రావు, సదయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌, కోర్టు కానిస్టేబుల్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయానికి పిలిపించి మరీ అభినందించారు. చిన్నారి తల్లిదండ్రులు సీపీని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  తాజాగా 9 హత్యల కేసులో గీసుగొండ పోలీసులు కమిషనరేట్‌ మార్క్‌ చూపించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9హత్యలకు పాల్పడిన బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ను  మే 25న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీపీ రవీందర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన  మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి శివరామయ్య, ఎస్సైలు నాగరాజు, అబ్దుల్‌ రహీం, కమిషనరేట్‌ సైబర్‌, టాస్క్‌ఫోర్స్‌, ఐటీ కోర్‌ విభాగాధికారుల సహకారంతో అన్ని ఆధారాలూ సేకరించి 24 రోజుల్లోనే న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. తక్కువ కాలంలోనే నిందితుడికి ఉరిశిక్షపడేలా చేయడంతో ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.