బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-city - Oct 28, 2020 , 02:25:50

మృత్యుబావి!

మృత్యుబావి!

  • అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన జీపు
  • గవిచర్ల వద్ద దుర్ఘటన
  • వరంగల్‌ నుంచి నెక్కొండకు వెళ్తుండగా ప్రమాదం
  • డ్రైవర్‌ దుర్మరణం 
  • 11 మంది క్షేమం
  • మరో ముగ్గురు గల్లంతు?
  • అర్ధరాత్రి దాకా పోలీసులు, గజ ఈతగాళ్ల గాలింపు
  • రూరల్‌ జిల్లాలో విషాదం
  • మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ/ సంగెం : జీపు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్ల సమీపంలో మగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. జీపులో 15మందికి గాను 11 మంది క్షేమంగా బయటపడగా, డ్రైవర్‌ మృత్యువాత పడ్డాడు. మరో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తున్నది. పోలీసులు, గజ ఈతగాళ్లు కొన్ని గంటల పాటు శ్రమించి జీపును బయటకు తీయగా అందులోనే డ్రైవర్‌ మృతదేహం ఉన్నది. మరో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదు. జీపు డ్రైవర్‌ పర్వతగిరి మండలంలోని ఏనుగల్‌ గ్రామస్తుడు దోని సతీశ్‌ (27) అని గుర్తించారు. ఈ దుర్ఘటనతో వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం అలుముకుంది. ముచ్చెమటలు పట్టించిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు.. 

సాయంత్రం ఐదు గంటల సమయంలో జీపు వరంగల్‌ నగరం నుంచి ప్రయాణికులతో నెక్కొండ మండల కేంద్రానికి బయల్దేరింది. డ్రైవర్‌ సతీశ్‌ సహా 14 మంది జీపులో ఉన్నారు. మార్గమధ్యలో వరంగల్‌ శివారులోని గవిచర్ల దాటగానే జీపు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఆ సమయంలో వ్యవసాయ పనులు ముగించుకుని గ్రామానికి వస్తున్న రైతులు, కూలీలు వెంటనే బావి వద్దకు చేరుకున్నారు. బావిలోంచి ఈదుతూ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్న వారికి సహకరించారు. ఇలా పది 11సురక్షితంగా ఒడ్డుకు చేరారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌, తాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. బావిలోంచి బయటపడ్డవారిలో నెక్కొండకు చెందిన బండి కట్టయ్య, మడిపెల్లికి చెందిన బానోతు విజయ, బానోతు రాంచంద్రు, మదనపురం భూక్యాతండాకు చెందిన గుగులోతు బుజ్జి, భూక్యా పితాలి, గుగులోతు విజయ, గుగులోతు మంజుల, జూద్యతండాకు చెందిన భూక్యా శ్రీనివాస్‌, రెడ్లవాడకు చెందిన భూక్యా నవీన్‌, పర్వతగిరి మండలం మూడెత్తుల తండాకు చెందిన మాలోతు సుజాతతో పాటు మరో గుర్తుతెలియని మహిళ ఉన్నారు. వీరిలో ఒకరైన రామచంద్రు, శ్రీనివాస్‌  మిగతా ప్రయాణికులను బయటకు చేర్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌ సతీశ్‌ కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో గుండెలవిసేలా రోదించారు. గల్లంతైన ముగ్గురు ఎవరనేది తెలియరాలేదు. 

డ్రైవర్‌కు ఫిట్స్‌ వచ్చిందా?

వరంగల్‌ నుంచి నెక్కొండకు ప్రయాణికులతో బయలుదేరిన జీపు డ్రైవర్‌ దోని సతీశ్‌కు మార్గమధ్యలో ఫిట్స్‌ రావడంతోనే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లి బావిలో పడినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. గవిచర్ల మోడల్‌స్కూల్‌ దాటగానే రోడ్డుపై గుంతలు ఉండడంతో బ్రేక్‌ కొట్టబోయి సైడ్‌కు వెళ్లిందంటే వీల్‌ రాడ్‌ ఊడిపోయి అయినా ఉండాలని, టైర్‌ పంక్చరైనా అయి ఉండాలని భావిస్తున్నారు.

అర్ధరాత్రి దాకా గాలింపు చర్యలు

జీపు బావిలో పడిన సమాచారం తెలిసి పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి దాకా సహాయక, గాలింపు చర్యల్లో తలమునకలయ్యారు. సంగెం ఎస్‌ఐ సురేశ్‌, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్‌, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్‌ కందకట్ల నరహరి బావిలో ఉన్న జీపును స్థానికులతో కలిసి బయటకు తీసేందుకు సహకరించారు. 

మంత్రి ఎర్రబెల్లి దిగ్బాంతి 

జీపు బావిలో పడిన సంఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదం నుంచి బయటపడివారికి వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపక్కన ఉన్న ఓపెన్‌ బావులపై ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బావులు, బొందలు ఉంటే వాటిని వెంటనే పూడ్చివేయాలని, లేదా ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు సేఫ్టీపై అధికారులు, పోలీసులతో చర్చించి, మెరుగైన చర్యలు చేపడతామన్నారు.