శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-city - Oct 28, 2020 , 02:25:47

అమ్మపాలు అందేలా..

అమ్మపాలు అందేలా..

  •  జీఎంహెచ్‌లో ‘మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌'
  • ఏర్పాటుకు వైద్యాధికారుల సన్నాహాలు
  • శిశు మరణాలు తగ్గించేందుకు దోహదం
  • ప్రసూతి వైద్యశాలను పరిశీలించిన డీఎంహెచ్‌వో లలితాదేవి

రెడ్డికాలనీ, అక్టోబర్‌ 27: నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువుల పాలిట ‘మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు’ వరంలా మారనున్నది. అనాథ, తల్లిపాలు ఇచ్చే పరిస్థితి లేని శిశువులకు ఇది ఎంతో ఆసరా కానున్నది. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ తర్వాత వరంగల్‌లో తల్లిపాల బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా, బ్యాంకు నెలకొల్పేందుకు ఎంజీఎం, సీకేఎంతో పాటు హన్మకొండలోని జీఎంహెచ్‌ను వైద్యాధికారులు పరిశీలించారు. డాక్టర్‌ సూచన మేరకు సేకరించిన తల్లిపాలను ఈ బ్యాంకు నుంచి ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న తల్లుల నుంచి పాలు సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తారు.  

శిశు మరణాలు తగ్గించేందుకు..

పోషకాహార లోపంతో పుట్టే శిశువుల మరణాలను తగ్గించేందుకు ‘మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు’ దోహద పడనుంది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించి పాలు సమృద్ధిగా ఉన్న తల్లుల నుంచి ముర్రుపాలు సేకరించి, ఆకలితో బాధపడుతున్న శిశువులకు సరఫరా చేసేందుకు జీఎంహెచ్‌లో ఈ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇది పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా పరోక్షంగా తల్లుల ఆరోగ్యాన్ని కాపాడుతుం ది. తల్లుల నుంచి పాలు సేకరించి ఉచితంగా చిన్నారులకు అందించనున్నారు. జీఎంహెచ్‌లో ప్రతిరోజు 20 మందికిపైగా నవజాత శిశువులు జన్మిస్తుండగా వారిలో సగానికిపైగా బలహీనంగా ఉంటున్నారు. వీరికి వేరే చోట చికిత్స అందించాల్సి ఉండడంతో తల్లులకు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లులకు పాలు రావు. ఇంకొందరికి ఆరోగ్యం సరిగాలేక పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. ఈ క్రమంలో నవజాత శిశువులకు మదర్స్‌మిల్క్‌బ్యాంకు ఎంతో ఉపయోగపడనుంది.

జీఎంహెచ్‌ను పరిశీలించిన డీఎంహెచ్‌వో

హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో (జీఎంహెచ్‌)లో మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటు కోసం వైద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకటిన్నర కిలోల కంటే తక్కువ బరువున్న శిశువులకు, వైద్యుల సూచన మేరకు ఇక్కడి నుంచి పాలు అందిస్తారు. బ్యాంక్‌ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని మంగళవారం డీఎంహెచ్‌వో కే లలితాదేవి, జిల్లా సర్వైలెన్స్‌ అధికారి శ్రీకృష్ణారావు జీఎంహెచ్‌ను పరిశీలించారు. మొదటి అంతస్తులోని ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌ పక్కనే ఉన్న నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఏర్పాట్లలో ఉన్నాం..

జీఎంహెచ్‌లో మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు ఏర్పాటు కోసం వైద్యాధికారులు పరిశీలించారు. ఎంజీఎం, సీకేఎంతో పాటు ఇక్కడ కూడా చూసి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు శిశు మరణాలను తగ్గిస్తుంది. పిల్లల ఆకలి తీర్చడంతో పాటు తల్లుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.        

 - సరళాదేవి, సూపరింటెండెంట్‌, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల