సోమవారం 30 నవంబర్ 2020
Warangal-city - Oct 27, 2020 , 01:19:32

కొత్తవాడ చేనేతకు కొత్త హంగులు

కొత్తవాడ చేనేతకు కొత్త హంగులు

హాస్టల్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దుప్పట్ల తయారీ

నాలుగు నూతన డిజైన్లకు శ్రీకారం

పోచమ్మమైదాన్‌ : వరంగల్‌లోని కొత్తవాడ చేనేత ఉత్పత్తులకు కేంద్రంగా మారింది. బెడ్‌షీట్లు, కార్పెట్లు తయారు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న చేనేత సంఘాలకు ప్రభుత్వం కొత్తగా దుప్పట్లు నేసే అవకాశం కల్పించింది. టెస్కో ద్వారా తొలిసారి కొత్త హంగులతో పలు డిజైన్లకు శ్రీకారం చుట్టింది. చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్‌ ఆదేశాల మేరకు వరంగల్‌ డీఎంవో పురాణం శ్రీనివాస్‌, టీం ఆఫీసర్‌ రాజేశ్‌ ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం బెడ్‌షీట్లు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో చేనేత కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

అన్ని సంఘాలకు అవకాశం..

ప్రభుత్వం ప్రత్యేకంగా హాస్టల్‌ విద్యార్థుల కోసం ఉపయోగించనున్న బెడ్‌షీట్లను నాలుగు రకాలుగా ఉత్పత్తి చేయనున్నారు. గతంలో మాదిరిగా సాధారణ బెడ్‌షీట్లు కాకుండా 50X90 పరిమాణంతో నాణ్యత, మన్నికతో సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌లో 12 చేనేత సంఘాలు, రూరల్‌లో 10 సంఘాలు కలిసి దాదాపు 20వేల దాకా ఉత్పత్తి చేసేందుకు అనుమతిచ్చారు. దీంతో ఆయా సంఘాల్లోని నేత కార్మికులు పనుల్లో నిమగ్నం కాగా నూలు పట్టడం, నేయడం తదితర పనులను సంఘాల పర్సన్‌ ఇన్‌చార్జిలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులకు చేతినిండా పని దొరికే అవకాశం దక్కింది. అయితే ఈ ఉత్పత్తులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో కార్మికులు చకచకా మగ్గం మీద కొత్త హంగులతో దుప్పట్లను నేస్తూ హాస్టళ్లకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త డిజైన్లతో కూడిన దుప్పట్లకు అవకాశం కల్పించిన టెస్కో అధికారులకు చేనేత సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు చెబుతున్నారు.