మంగళవారం 01 డిసెంబర్ 2020
Warangal-city - Oct 27, 2020 , 01:19:30

సరికొత్తగా కాఫేటేరియా

సరికొత్తగా కాఫేటేరియా

కాజీపేట రైల్వే క్యాంటీన్‌లో అధునాతన వంట మిషన్లు

రూ.42లక్షల వ్యయంతో సౌకర్యాలు

ప్రయాణికులకు రుచికరమైన ఆహారం

కాజీపేట : కాజీపేట రైల్వే క్వాంటీన్‌(కాఫేటేరియా) సరికొత్త రూపు సంతరించుకోనుంది. నిత్యం వేలాది మంది ప్రయాణం సాగించే ఈ స్టేషన్‌లో స్వచ్ఛమైన, రుచికరమైన ఫలహారం అందించేందుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఇదివరకు పాత భవనంలో కార్మికుల ఆధ్వర్యంలో క్యాంటీన్‌ ఉన్నా కాంట్రాక్టర్లు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో మూతపడగా హ్యాకర్లు ఇష్టానుసారం బయటి నుంచి తినుబండారాలు తెచ్చి విక్రయించేవారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూ.42లక్షలతో కాఫేటేరియా ఆధునీకరణ పనులు ప్రారంభించారు. ఉత్తర, దక్షిణభారతానికి కూడలిగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌లోని క్యాంటీన్‌ సకల సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ఈ కాఫేటేరియాలో స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గతంలో మొదటి నంబర్‌ ఫ్లాట్‌పారంపై పాత భవనంలో ఉండే రైల్వే క్యాంటీన్‌ రైల్వే కార్మికుల ఆధ్వర్యంలో నడిచేది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు అప్పగించినా సరైన సౌకర్యాలు లేకపోవడంతో మూతపడి ఉంది. దీంతో హ్యాకర్లు బయట తయారుచేసిన తినుబండారాలను తీసుకొచ్చి ప్రయాణికులకు విక్రయించేవారు. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇటీవల కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వే జంక్షన్‌, విజయవాడ స్టేషన్లలో సదుపాయాల కల్పన బాధ్యతను రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌)కి అప్పగించింది. ఈక్రమంలో క్యాంటీన్‌ను వెంటనే పునః ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో రైల్వే సిబ్బంది, ఐఆర్‌సీటీసీ.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దీంతో రూ.42లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కొవిడ్‌-19 కారణంగా ప్రయాణికుల రైళ్లను రద్దు చేయడం, రాకపోకలు తక్కువ ఉండడంతో పునరుద్ధరణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు కాఫేటేరియాలోకి అడుగుపెట్టగానే ఆకట్టుకునేలా రీమోడలింగ్‌ చేస్తున్నారు.

సిద్ధమవుతున్న వంటశాల

ప్రయాణికులకు అతి తక్కువ సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలను అందించేలా చక్కటి వంటశాల సిద్ధమవుతోంది. ఇందులో వివిధ రకాల టిఫిన్లు, వెజ్‌, నాన్‌వెజ్‌ కూరలను అప్పటికప్పుడు తయారుచేసేలా అధునాతన యంత్రాలను బిగించారు. భోజన తయారీ, ప్యాకింగ్‌ చేసేందుకు మిషన్లు కూడా తీసుకొచ్చారు. న్యూఢిల్లీ, సికింద్రాబాద్‌, చెన్నై, విశాఖపట్నం తదితర దూర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఎంతమందికైనా ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక విశ్రాంతి గది, భోజన విక్రయశాల, సామాన్లు భద్రపరిచే గది, రక్షిత మంచినీటి కోసం ఆర్‌వోఆర్‌ ఫ్యూరిఫయర్‌ మిషన్‌, మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మిస్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు రావడం కాస్త ఆలస్యమైనా ఎటువంటి ఇబ్బంది కలుగకుండా విశ్రాంతి గదుల్లో తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.