శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Oct 23, 2020 , 02:03:00

సాంకేతిక స్నాతకోత్సవం అదుర్స్‌

సాంకేతిక స్నాతకోత్సవం అదుర్స్‌

  • నిట్‌లో తొలిసారి వర్చువల్‌ విధానంలో నిర్వహణ
  •  1500 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పట్టాలు
  • ఇంట్లోంచే అందించిన కేంద్ర మంత్రి పోక్రియాల్‌ నిశాంక్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి
  •  సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం

నిట్‌క్యాంపస్‌ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో గురువారం సాయంత్రం సాంకేతిక స్నాతకోత్సవం డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు అధ్యక్షతన నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర విద్యా శాఖ మంత్రి పోక్రియాల్‌ నిశాంక్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. మోషన్‌ క్యాప్చర్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ విధానంతో పిక్చర్‌ను తయారుచేసి వేదిక మీదకు పిలిచి పట్టాను బహూకరించారు. యానిమేటెడ్‌ పిక్చర్‌ను పోలిన ఈ-అవతార్‌తో తమ వంతు రాగానే అతిథుల నుంచి 1500 మంది బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు స్వీకరించారు. వీరిలో అన్ని శాఖల్లో టాపర్‌గా నిలిచిన అపూర్వ భరద్వాజ్‌(కెమికల్‌ ఇంజినీరింగ్‌)కు రోల్‌ ఆఫ్‌ హానర్‌ గోల్డ్‌మెడల్‌ లభించింది. ఈ ఉత్సవానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూట్యూబ్‌ లింక్‌  ద్వారా హాజరయ్యారు. విద్యార్థుల ముఖాలను ఆన్‌లైన్‌ మోషన్‌ క్యాప్చర్‌ చేయడం వల్ల తామే పట్టా తీసుకున్న అనుభూతిని పొందారు. ఏ-ధీరమ్స్‌ స్టూడియో, నిట్‌ వరంగల్‌  అధునాతన టెక్నాలజీతో స్నాతకోత్సవ నిర్వహణను అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులెవరూ క్యాంపస్‌లో లేని కారణంగా సాంకేతిక సహకారంతో స్నాతకోత్సవాన్ని విభిన్నంగా నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎన్‌ గోవర్ధన్‌ రావు, డీన్లు పాల్గొన్నారు.

పలు భవనాలకు శంకుస్థ్ధాపన

   కేంద్ర విద్యా శాఖ మంత్రి పోక్రియాల్‌ నిశాంక్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ వర్చువల్‌ విధానంలో నిట్‌లోని పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య టీచింగ్‌, లర్నింగ్‌ సెంటర్‌, విశ్వేశ్వరయ్య సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అతిథిగృహంతోపాటు రుద్రమదేవి లేడీస్‌ హాస్టల్‌ భవనాలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థులుగా ఈ రోజు సాధించిన విజయంతో ప్రారంభమవుతున్నదని, జీవితకాలం దాన్ని కొనసాగించాలని అన్నారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభ, వనరులను ఉపయోగించుకుని ఎదుగాలని అన్నారు. నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ జాతీయస్థాయి ర్యాంకింగ్‌లో చాలా మంచి స్థ్ధాయిలో ఉన్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం 18 ప్రతిష్టాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నామని, కరోనా వైరస్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను పరిశోధనాత్మకంగా చేపడుతున్నామని పేర్కొన్నారు.