శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Oct 19, 2020 , 04:55:14

వ‌ర్ష‌పాతం అద‌నంగా 60శాతం

వ‌ర్ష‌పాతం అద‌నంగా 60శాతం

  • కాలం ముగిసినా ఆగని వానలు
  • ఆరు జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షాలు
  • గతేడాది కంటే అధిక వర్షపాతం నమోదు
  • నైరుతితోపాటు అక్టోబర్‌లోనూ ఇదే తీరు
  • ఇప్పటికి దాదాపు సగం రోజులు వానలే

అసలెప్పుడూ లేని స్థాయిలో ఈ సీజన్‌లో వర్షాలు దంచికొట్టాయి. కాలం ముగిసినా వానకాలం మాదిరిగానే కురుస్తుండడంతో గత రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఐఎండీ లెక్కల ప్రకారం నైరుతి సీజన్‌ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకే అయినా అక్టోబర్‌ మూడో వారంలోనూ వానలు కురుస్తుండగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సాధారణ కంటే 60శాతం అదనపు వర్షపాతం నమోదైంది. గతంలో కొన్నిచోట్ల మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా ఈ సీజన్‌లో అన్ని జిల్లాల్లో 120 సెం.మీపైనే నమోదు కాగా ములుగు జిల్లాలో అత్యధికంగా 191 సెం.మీ కురువడంతో జనజీవనం అతలాకుతలమవుతోంది.

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో ఈసారి వర్షాలు 60శాతం కంటే ఎక్కువే కురిశాయి. ఆరేండ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు పడుతూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కాలం ముగిసి రెండు వారాలు గడుస్తున్నా ఇంకా తగ్గుముఖం పట్టకపోగా నడి వానకాలంలో పడినట్లే ఇప్పటికీ వానలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు నైరుతి సీజన్‌గా భావిస్తారు. ఈ సీజన్‌లో ఎక్కువగా వానలు పడేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ రెండో వారం తర్వాత చలికాలం మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం మూడోవారంలోనూ వానకాలం తరహాలోనే ప్రతిరోజు వానలు పడుతున్నాయి.అధిక వర్షాల వల్ల ప్రకృతిలో జరిగే మార్పులు జనజీవనానికి అన్ని రకాలుగా ఇబ్బందికరంగా మారాయి. దీంతో వానకాలం అసలు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.


సగం రోజులు వానలే..

వానకాలం మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెరిపినివ్వడం లేదు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 17వరకు 139 రోజుల్లో ఆరు జిల్లాల్లోనూ సగటున సగం రోజులు వానలు కురిశాయి. వానకాలం మొదలైనప్పటి నుంచి ములుగు జిల్లాలో 75 రోజులు, మహబూబాబాద్‌ జిల్లాలో 74, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 71 రోజులు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 66 రోజులు వానలు పడ్డాయి. వరంగల్‌ అర్బన్‌, జనగామ జిల్లాల్లో 67 రోజుల చొప్పున వర్షం కరిసింది. ఆరేండ్ల కాలంలో వానకాలం సీజన్‌లో ఇన్ని రోజుల పాటు వర్షం ఎప్పుడూ పడలేదు. ఎక్కువ రోజులు వానలు పడడంతో అన్ని రకాలుగా నష్టం జరుగుతోంది. పంటలు, పాడి పశువులు, రోడ్లతో పాటు పాత ఇండ్లు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చే దశకు వరి నేలవాలుతుండగా పత్తి పంట చేనులోనే ఎర్రబారుతోంది. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొంది.