బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Oct 18, 2020 , 04:33:47

రైతు నేస్తం.. యువత పెన్నిధి..

 రైతు నేస్తం.. యువత పెన్నిధి..

  •  ఎవుసానికి వెన్నుదన్ను.. ఉపాధికి బాసట
  •  ప్రభుత్వ కృషితో పల్లెల్లో విప్లవాత్మక మార్పు
  • రాయితీ ట్రాక్టర్లతో మారిన రాత
  • దుక్కి దున్నుడు మొదలు పంట ఇంటికి చేరేదాకా అన్నదాతలకు కొండంత అండ 
  • యంత్ర వినియోగంతో పెరిగిన సాగు
  • నిరుద్యోగులకు ఆదాయ వనరు
  • కుటుంబాలను ఎల్లదీసుకుంటున్న ‘యజమానులు’
  • జీవన ప్రమాణాలు మెరుగు 

ఉమ్మడి జిల్లాలో 2161 ట్రాక్టర్లు పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ పరిశ్రమల శాఖ నుంచి 470 ఒకప్పుడు ముక్కుతూ మూల్గుతూ సాగిన ఎవుసానికి ఈ బండి వెన్నుదన్నుగా నిలిచింది. చదును చేసి.. దుక్కిదున్ని.. పెంట జారగొట్టి.. దమ్ము చేసి.. గొర్రు కొట్టి.. చివరికి పంటను, గడ్డిని ఇంటికి చేర్చేదాకా అన్నదాతలకు ఆత్మీయ నేస్తంలా మారింది. వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలని, నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ‘యంత్ర లక్ష్మి’ ద్వారా అందించిన ‘సబ్సిడీ ట్రాక్టర్ల’తో పల్లెల్లో విప్లవాత్మక మార్పు కనిపిస్తున్నది. నాడు నీరు లేక ఎడ్లబండ్లు, నాగళ్లతో కష్టసాధ్యమై సాగు భూములను కూడా వదిలేసిన రైతాంగం, నేడు ప్రాజెక్టుల నీరు అందుబాటులోకి వచ్చి, చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీరుండి, ఆరు చక్రాల బండి అండతో బీడు భూముల్లోనూ పసిడి పంటలు పండిస్తున్నది. మరోవైపు గ్రామాల్లో ఉపాధి లేక, కుటుంబాలకు భారమై దిక్కులు చూసిన చాలా మంది యువకులకు ఈ బండే బతుకు దారి చూపింది. ఎవరికీ చేయిజాపకుండా కష్టపడి ఆర్జిస్తూ నలుగురిలో తలెత్తుకునేలా చేసింది. క్రమేణా ఊర్లలో జీవన ప్రమాణాలను సైతం మెరుగుపరుస్తున్నది.

- వరంగల్‌ సబర్బన్‌/ మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ

సాలుకు రూ.లక్ష తప్పుతున్నయ్‌..

నేను పదో తరగతి దాక చదివిన. మాకు పదెకరాల భూమున్నది. నాలుగెకరాల్లో వరి, మూడెకరాల్లో పత్తి, అరెకరంల మిర్చి, ఇంకో అరెకరంల పసుపు, రెండెకరాల్లో మక్క పండిస్తున్న. మా నాన్న ఎడ్లు, నాగళ్లతోనే ఎవుసం చేసెటోడు. అప్పుడప్పుడు ట్రాక్టర్‌ కిరాయిదెచ్చి పనులు చేయించెటోడు. అట్ల సీజన్‌కు రూ.50వేల దాక ఖర్చయ్యేది. రెండు పంటలకు రూ.లక్ష దాకా అయ్యేటివి. 2017-18ల ప్రభుత్వం 50శాతం సబ్సిడీపై ట్రాక్టర్‌ మంజూరు చేసింది. రూ.3.50 లక్షలు కడితే మిగితా డబ్బులు సర్కారే ఇచ్చింది. అప్పటినుంచి దాంతోనే పొలం పనులు చేస్కుంటున్న. పంటను మార్కెట్‌కు తీస్కపోయి అమ్ముకుంటున్న. ఏడాదికి రూ.లక్షా 20వేల దాకా ఆదా అవుతున్నయ్‌. ట్రాక్టర్‌ లేకుంటె శాన కష్టమయ్యేది. సబ్సిడీ మీద ట్రాక్టరిచ్చిన సీఎం కేసీఆర్‌ మేలు ఎప్పటికీ మర్చిపోను.

- సిద్ధన రమేశ్‌, రైతు, అమీనాబాద్‌ (చెన్నారావుపేట)

వరంగల్‌ సబర్బన్‌/ మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : వ్యవసాయ రంగంలో ట్రాక్టరు పాత్ర కీలకం. రైతుల సేద్యపు బాటలో రవాణా వ్యవస్థది అతిపెద్ద అంకం. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పంట పండించడం ఒకెత్తయితే ఆ పంటను ఇంటికి, మార్కెట్‌కు తరలించడం మరో ఎత్తు. నాలుగు దశాబ్దాల వెనక్కి వెళితే వ్యవసాయ అవసరాల కోసం రైతులు పూర్తిగా ఎడ్ల బండ్లు, నాగళ్లనే వినియోగించేవారు. కాల క్రమేణా సేద్యపు ప్రయాణంలోకి ట్రాక్టరు వచ్చి చేరింది. కొద్దికొద్దిగా విస్తరించి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మార్చేసింది. మొన్నటి దాకా గ్రామానికి ఒకట్రెండు ట్రాక్టర్లతో నెట్టుకొచ్చిన రైతులు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వీరిలో విద్యావంతులైన యువ రైతులు సబ్సిడీ ట్రాక్టర్‌తో ఉపాధి పొందుతున్నారు. 

నాడు చిన్న రైతులకు అందని ద్రాక్షే..

ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేసి ‘ఔరా’ అనిపించిన రైతులు అనేక మంది ఉన్నారు. 1970 దశకంలోనే కొందరు వ్యయ ప్రయాసలకోర్చి ట్రాక్టర్లు జిల్లాకు తీసుకొచ్చి సాగుకు వినియోగించారు. దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం తొలిసారిగా తన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరలో వ్యవసాయానికి ట్రాక్టర్‌ను వినియోగించారు. ఆ తర్వాత అనేక మంది అభ్యుదయ రైతులు సేద్యంలో ట్రాక్టర్లను వినియోగించినా అది పెద్ద రైతులకే పరిమితమైంది. చిన్న రైతులకు ట్రాక్టరు అందని ద్రాక్షగానే మిగిలింది. 

‘యంత్ర లక్ష్మి’తో విప్లవాత్మక మార్పు

ఒకప్పుడు ముక్కుతూ మూల్గుతూ సాగిన వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలని, నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో 2014 నుంచి ‘యంత్ర లక్ష్మి’ ద్వారా రెండు విడుతల్లో అందించిన ‘సబ్సిడీ ట్రాక్టర్ల’తో పల్లెల్లో విప్లవాత్మక మార్పు కనిపిస్తున్నది. ఈ పథకంలో భాగంగా సన్న, చిన్న కారు రైతులకు కూడా ప్రభుత్వం ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. అన్ని గ్నామాల అన్నదాతలకు ఆరుచక్రాల బండి అందుబాటులోకి వచ్చింది. పల్లెల్లో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపింది.  నాడు వ్యవసాయంలో సరుకు రవాణాకు, దుక్కి, పొలం దున్నేందుకు కేవలం ఎడ్ల బండ్లు, నాగలిని మాత్రమే వినియోగించే వారు. దీంతో వ్యవసాయ పనులు ఆలస్యమయ్యేవి. వేలాది ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నా నీరు లేక, ఎడ్లబండ్లు, నాగళ్లతో ముందుకు సాగలేక, కూలీల ఖర్చులు భారమై భూములను పడావుగా, పశువుల మేతకు కంచెలుగా వదిలేశారు. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందించడంతో ఎండా కాలంలో పెంట తోలుడు మొదలు కుని, పంట కాలం పూర్తయిన తర్వాత దిగుబడులను ఇంటికి, మార్కెట్‌కు తరలించడం దాకా వాటినే వినియోగిస్తున్నారు. ఉదయాన్నే కూలీలను తరలించడంతో పాటు పొలాలు, దుక్కులు దున్నడం, ఎరువులు జారేయడం అన్నీ ట్రాక్టర్ల ద్వారానే చేస్తున్నారు. ఇప్పుడు పలు నిర్మాణ పనులకు సైతం కావాల్సిన వస్తువులను ట్రాక్టర్లతోనే తరలిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నీరు కాలువల ద్వారా చెరువుల నుంచి తమ పొలాలకు మళ్లుతుండడం, ట్రాక్టర్లతో వ్యవసాయం సులభతరం కావడంతో వదిలేసిన భూములను సైతం సాగులోకి తెస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఇవే ట్రాక్టర్లతో ఇతర పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనూ ట్రాక్టర్ల వినియోగం పెరిగింది.

కష్టాలు తీర్చి.. భరోసా ఇచ్చి..

ఈ ట్రాక్టర్‌పై ఉన్న యువకుడి పేరు బాదావత్‌ మహేందర్‌. ఊరు మహబూబాబాద్‌ మండలం ఉప్పరపల్లి. వారసత్వంగా వచ్చిన ఐదెకరాల భూమిలో వరి, పత్తితో పాటు పసుపు, మిర్చి పంటలు పండిస్తున్నాడు. గతంలో ఎడ్లను ఉపయోగించి కూలీలతో వ్యవసాయం చేసేవాడు.  ఒక్కోసారి దుక్కి దున్నేందుకు, విత్తనాలు వేసేందుకు కూలీలు దొరకక తిప్పలు పడేవాడు. సొంతంగా ట్రాక్టర్‌ లేదని చాలాసార్లు బాధపడేవాడు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం, సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీ ట్రాక్టర్లకు శ్రీకారం చుట్టడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎస్టీ కేటగిరీ కావడంతో ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇవ్వగా మిగిలిన డబ్బు కట్టి ట్రాక్టర్‌ తీసుకున్నాడు. ఇక అప్పటినుంచి తన భూమితో పాటు ఇతర రైతుల భూములను కూడా ఆ ట్రాక్టర్‌తో దున్నడంతో పాటు పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్తూ ఉపాధి పొందుతున్నాడు. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్‌ను అటు వ్యవసాయానికి ఉపయోగించుకోవడమే గాక ఇతర రైతులకు కిరాయికి ఇస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు.

ఉమ్మడి జిల్లాలో 2161 ట్రాక్టర్ల పంపిణీఅంతకు ముందు కేవలం పెద్ద రైతులకు పరపతిని పెంచే వాహనంగానే ఉన్న ట్రాక్టరును ప్రభుత్వం చిన్న రైతులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సేద్యంలో ట్రాక్టర్‌ పాత్రను ముందుగానే అంచనా వేశారు. 2014లోనే యంత్రలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టి సబ్సిడీపై రైతులు, నిరుద్యోగ యువతకు ట్రాక్టర్లు అందించారు. ఇప్పటి వరకు మూడు విడుతల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు రూ.18.5 కోట్ల రాయితీ ఇచ్చి 523 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. మహబూబాబాద్‌జిల్లాలో 2017-18లో 412 ట్రాక్టర్లను అందించారు. జనరల్‌ కేటగిరీలో 226, ఎస్టీలకు 150, ఎస్సీలకు 36 ట్రాక్టర్లను ఇచ్చారు. జనగామ జిల్లాలో 2016లో రూ.5కోట్ల రాయితీతో 144ట్రాక్టర్లు, 2017లో రూ.7కోట్ల రాయితీతో 259 ట్రాక్టర్లు అందించారు. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 420, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి కలిపి 403 మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 2161ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వగా, ఇతర రైతులకు 50 శాతం కల్పించారు. వీటికి తోడు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పురుషులకు 35శాతం, మహిళలకు 45శాతం సబ్సిడీతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 470 ట్రాక్టర్లు, డోజర్లను అందించారు. 

నిరుద్యోగులకు వరం

ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ట్రాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు వరంలా మారాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చేసి ఉద్యోగాలు లేక ఇంటి పట్టునే ఉంటున్న వారు తమ కుటుంబం పేరిట వచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లతో సొంత పనులు చేసుకోవడంతో పాటు ఇతర పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమ వ్యవసాయ పనులు పూర్తి కాగానే ఇతర పనులకు వెళ్తున్నారు. భవన నిర్మాణ, ఇసుక, కంకర, ఇతరత్రా సరంజామాను చేరవేసే పనుల్లో నిమగ్నమై అదనపు ఆదాయం పొందుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లు వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. 

సంఘానికి మంచి ఆదాయం 

మా రైతు సంఘానికి సబ్సిడీ మీద ఇచ్చిన ట్రాక్టర్‌తో మంచి ఆదాయం వస్తున్నది. మాది ఆదర్శ రైతు సహకార సంఘం. ఈ సంఘంలో 43మంది సభ్యులమున్నం. మా సొసైటీ తరఫున ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్ముతున్నం. మా సంఘానికి 2016-17లో ప్రభుత్వం 50శాతం సబ్సిడీపై ట్రాక్టర్‌ ఇచ్చింది. అప్పటినుంచి సంఘానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులన్నీ అందులోనే తెస్తున్నం. సభ్యులు ఎవరైనా వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ తీసుకపోతే పనులు చేయించుకున్నందుకు సంఘానికి కిరాయి ఇస్తరు. ఒకవేళ బయటి వాళ్లకు ఇచ్చినా కిరాయి తీస్కుంటం. ఇట్ల ట్రాక్టర్‌ ద్వారా సంఘానికి అదనపు ఆదాయం వస్తున్నది.  

- మేడిద లక్ష్మారెడ్డి, సంఘం ప్రొప్రైటర్‌, ఖాదర్‌పేట 

సంతోషంగ బతుకుతున్న..

మాది మహబూబాబాద్‌ మండలం బొజ్జన్నపేట. నేను డిగ్రీ దాకా చదివిన. ఉద్యోగం లేక నాకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్‌ ఇస్తున్నదని తెలిసి 2018ల దరఖాస్తు పెట్టిన, సొసైటీ పేరు మీద 90శాతం సబ్సిడీపై ట్రాక్టర్‌ వచ్చింది. అప్పటి నుంచి మాకే కాదు.. మిగతా వాళ్ల వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడుతున్నది. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.1.50లక్షలు మిగులుతున్నయ్‌. ఉద్యోగం లేదన్న బాధ లేకుండా కుటుంబంతో సంతోషంగా బతుకుతున్న. పిలల్లను మంచిగ చదివిస్తున్న. ట్రాక్టర్‌ ఇప్పిచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు రుణపడి ఉంట.

- గుండమల్ల రవికుమార్‌, బొజ్జన్నపేట, రైతు(చెన్నారావుపేట)


logo