ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Oct 16, 2020 , 06:20:39

నేటి నుంచే పూల జాతర

 నేటి నుంచే పూల జాతర

  •  ఎంగిలిపూలతో మొదలు
  • తొమ్మిదిరోజుల పాటు వాకిళ్లు పూదోటలు    
  • సంబురాల్లో ఆడబిడ్డలు   
  • కరోనా జాగ్రత్తలతో ఏర్పాట్లు    

ప్రపంచమంతా దేవుడిని పూలతో కొలిస్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణలో ‘బతుకమ్మ’గా బతికున్నది. అలాంటి పూల పూజకు వేళైంది. నేటి ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ప్రతి వాకిలీ పూదోట కానున్నది. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తనున్నది.

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. 

బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. 

పాడి పంటలనూ ఉయ్యాలో.. 

చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ”

..అంటూ సాగే బృందగానాలతో జిల్లాలోని పల్లె, పట్టణం హోరెత్తనున్నాయి. నేటి ఎంగిలిపూలతో మొదలై, సద్దుల బతుకమ్మ దాకా సంబురాలు అంబరాన్నంటనున్నాయి.. వాకిళ్లన్నీ పూదోటలుగా మారనుండగా, మహిళలు, ‘పాట చిలుకలాల.. ఆట చిలుకలాల..’ అన్నచందంగా ఆడిపాడనున్నారు. ఈ సారి కరోనా జాగ్రత్తల నడుమ ఆడబిడ్డలు పండుగ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.    

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పల్లెఆడబిడ్డలతో పాటు పట్టణ మహిళలకూ ఇదే ఇష్టమైన వేడుక. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి దాకా (ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల(పెద్ద) బతుకమ్మదాకా) ప్రతిరోజూ ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. నిత్యం సద్దులు పంచుకొని తింటూ వేడుకలా జరుపుకుంటారు. 

ఎంగిలిపూల నుంచే సందడి 

ఎంగిలిపూల నుంచే మహిళల సందడి మొదలవుతుంది. మగవారు పూలసేకరణలో నిమగ్నం కాగా, ఆడవాళ్లు వాటిని అందంగా పేర్చి, ఆడుతారు. బతుకమ్మ పండుగ నిజానికి ప్రకృతి పూజ. ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల పూలను, వాటితో గౌరమ్మను పూజించడం ఈ పండుగలోని విశిష్టత.

అత్తగారింటి నుంచి తల్లిగారింటికి

‘ఇదరక్కచెల్లెండ్లను ఉయ్యాలో.. 

ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో..

ఒక్కడే మాయన్న ఉయ్యాలో..

వచ్చన్న బోడాయె ఉయ్యాలో..

ఎట్లస్తు చెల్లెలా ఉయ్యాలో.. 

ఏరడ్డమాయె ఉయ్యాలో

.. ఇప్పటి పరిస్థితికి చక్కగా సరిపోయే పాట ఇది. ప్రజల ప్రయాణం తీరు మారింది. ఇప్పుడు కార్లు, మోటారు సైకిళ్లు వచ్చినయి. సాగునీటి ప్రాజెక్టులతో వచ్చిన జలాలతో చెరువులన్నీ నిం డాయి. ఊరూరా ఏరులు పారుతున్నాయి. రాకపోకలకు అడ్డుగా వరద నీరు పొంగిపొర్లుతున్నది. ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టేలా బతుకమ్మ పా టలు ఎప్పటి నుంచో ఉన్నా యి. పెళె్లై మెట్టినింటికి వెళ్లిన మహిళలంతా ప్రతి బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి చేరుకుంటారు. మమతానురాగాల బతుకమ్మలను పేర్చి, సంతానం, పాడీపంటా చల్లంగుండాలని ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని వెళ్లిపోతారు. తమకు మంచి భర్త దొరకాలని కన్నెపిల్లలు కోరుకుంటారు.

ఎటుచూసినా  పూల పరిమళం..

తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలుస్తోన్న బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. పల్లెదారులన్నీ పూల పరిమళాలు వెదజల్లుతాయి. రెండువైపులా పసుపు ఆరబోసినట్లు తంగేడు.. చేనుచెలకల్లోంచి నిక్కినిక్కి చూసే గునుగు, పట్టుకుచ్చు.. ముళ్ల కంచెల మీద నుంచి పలకరించే కట్ల పూలు.. ఇంటి గోడ మీద విరిసి మురిపించే మందారాలు, తలుపు సందుల్లోంచి తొంగి చూసే గన్నేరు.. నేలంతా పరుచుకుని, బంగారాన్ని విచ్చుకునే గుమ్మడి ఇంకా రుద్రాక్ష, గో రింట.. ఇలా తీరొక్క పువ్వు బతుకమ్మ పండుగను ఆహ్వానిస్తూ కనిపిస్తాయి.

పూల సేకరణ..

గుమ్మడి, తంగెడు, గునుగు, పట్టుకుచ్చు, కట్ల, రుద్రాక్ష, గోరింట, బంతి, గన్నేరు.. వీటితో పాటు మీ ఇంట్లో ఉన్న ఏ పువ్వులైనా సరే.. వీటితో పాటు గుమ్మడి ఆకులు ఉండాలి.

సాగునీరు.. పంటలతో పల్లెల్లో పండుగ కళ

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో నీటి వసతి కలిగి పంటల సాగు పెరగడంతో పల్లెల్లో పం డుగ కల కనిపిస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో పల్లెల్లో అప్పుడే సందడి నెలకొంది. బతుకమ్మ ప్రత్యేకమైన పండుగే కాదు ఆ పండుగకు వచ్చే రోజులూ ప్రత్యేకమైనవే. వానాకాలం చివర, చలికాలం ఆరంభంలో ఈ పండుగ వస్తుంది. ఒకప్పటి రోజుల్లో వానాకాలం పంటల ముగింపు. తర్వాత పంటలకు ఆరంభం. దీంతో బ తుకమ్మ వచ్చే రోజులను కొత్తపాత సందు అంటారు. 

బతుకమ్మ పుట్టుకపై ఎన్నో కథలు 

బతుకమ్మ పండుగ పుట్టుక గురించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఒకసారి తెలంగాణలో కలరా, మశూచిలాంటి భయంకర అంటువ్యాధులు ప్ర బలాయి. వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏ గడపలో అడుగుపెట్టినా నిర్జీవ దేహాలే కనిపించాయి. కన్నీటి శోకాలే వినిపించాయి. ఈ తరుణంలో ప్రజలు, తమవాళ్లను బతికించుకునేందుకు, పూలతో బతుకమ్మ పేర్చి, ఆదిపరాశక్తి(గౌరి)ని పూజించారనీ, అదే బతుకమ్మగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. అత్యంత ప్రాచుర్యం పొందిన మరో కథ ప్రకారం, దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజు ధర్మాంగదుడు సంతానం కోసం లక్ష్మీదేవిని పూజించగా, అతని భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మొదట ఆ బిడ్డకు రాజు లక్ష్మి అని పేరుపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని అనేక ఆపదలు, కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆమె పేరును ‘బతుకమ్మ’ అని మార్చాడు. అప్పుడు రాకుమారి, అన్ని గండాలు దాటి బతికి బట్టకట్టింది. అలా అప్పటినుంచి జనులందరి క్షేమం కోసం పువ్వులు తెచ్చి, ఆమె పేరు(బతుకమ్మ)తో వాటిని పేర్చి, పూజించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలుస్తున్నది.

 పూల మాటున ఆరోగ్యం 

బతుకమ్మను పేర్చేందుకు ప్రధానంగా వాడే తంగేడు పూలు, ఆకుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చలికాలం మొదలయ్యే క్రమంలో సాధారణంగా వచ్చే ఆస్తమా, అతి మూత్ర విసర్జన, చర్మ వ్యాధుల నివారణకు తంగేడు ఉపయోగపడుతుంది. తొమ్మిదిరోజుల పాటు తంగేడు పూలను, ఆకులను ఎక్కువ సేపు తాకడం వల్ల సాధారణ వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా కొలుస్తారు. ఆడబిడ్డను శుక్రవారం, బుధవారం పుట్టింటి నుంచి బయటికి పంపరు. అందుకే సద్దుల బతుకమ్మను కూడా ఈ రెండు వారాల్లో జరుపరు. తిథి ప్రకారం ఆ రోజుల్లో సద్దులు వచ్చినా మరుసటి రోజు నిర్వహిస్తారు. ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు. ఆరోజున బతుకమ్మ ఆడరు. బతుకమ్మ పండుగ రోజుల్లో తయారు చేసే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. పౌష్టికాహారం ప్రధాన ఉద్దేశంగా ఈ ప్రసాదాలుంటాయి.  

జీవన విధానానికి ప్రతిరూపం

 బతుకమ్మ పాటలు తెలంగాణ ప్రజల జీవనశైలిని చాటేలా ఉంటాయి. పండుగ అంతా ప్రకృతిని, మానవుల మధ్య సంబంధాన్ని చెబుతుంది. ఆత్మీయతను మననం చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది. బతుకు తీరును చెప్పే పాటలు ఎన్నో మనకు వినిపిస్తాయి. వీటిని ఎక్కువగా నిరక్షరాస్యులే పాడుతుంటారు. జీవన విధానాన్ని తెలిపే ఈ పాటల వారసత్వ పరంపర ఇలా కొనసాగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అస్తిత్వం నిలుపుకొనే పరంపరంలో బతుకమ్మ ప్రాధాన్యతం బాగా పెరిగింది. ఉద్యమం తెచ్చిన ఏకతతో ఊరు ఊరంతా పండుగలో భాగమవుతున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత  ఊరూరా బతుకమ్మ మహా ఉత్సవంగా మారింది. 

తొలిరోజు : ఎంగిలిపూల బతుకమ్మ

రెండో రోజు : అటుకుల బతుకమ్మ

మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ

నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ

ఐదో రోజు : అట్ల బతుకమ్మ

ఆరో రోజు : అలిగిన బతుకమ్మ

ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ

ఎనిమిదో రోజు : వెన్నముద్దల బతుకమ్మ

తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మlogo