శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Oct 15, 2020 , 03:01:42

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

  • డీఎంహెచ్‌వో  డాక్టర్‌ లలితాదేవి
  • అక్షయ నర్సింగ్‌ హోం సీజ్‌

వరంగల్‌ చౌరస్తా, అక్టోబర్‌ 14 : నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు నిర్వహిస్తున్న అక్షయ నర్సింగ్‌ హోం రిజిస్ట్రేషన్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే లలితాదేవి రద్దు చేశారు. చట్టాన్ని అతిక్రమించినందుకు తహసీల్దార్‌ ఇక్బాల్‌ నర్సింగ్‌ హోంను సీజ్‌ చేశారు. మంగళవారం అర్ధరాత్రి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  నర్సింగ్‌ హోంలో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాలికతో పాటు సిద్దిపేటకు చెందిన మహిళ అబార్షన్‌ చేయించుకోవడానికి నర్సింగ్‌ హోంలో చేరినట్లు గుర్తించామని డీఎంహెచ్‌వో తెలిపారు. డాక్టర్లు లేకపోవడం, రికార్డుల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే అబార్షన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు గుర్తించడంతో నర్సింగ్‌ హోం రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి, సీజ్‌ చేశారు. బాలికతో పాటు, మహిళకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి వరంగల్‌ సీకేఎం దవాఖానకు తరలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్కానింగ్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోంలపై నిఘా పెట్టామన్నారు. తనిఖీల్లో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు, జిల్లా సర్వేలైన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీకృష్ణారావు, మట్టెవాడ ఎస్సై శ్రీనివాసరెడ్డి, మాస్‌మీడియా ఆఫీసర్‌ అశోక్‌రెడ్డి, సీడీపీవో విశ్వజ, సిబ్బంది శ్రీనివాస్‌, విప్లవ్‌కుమార్‌, రమేశ్‌ పాల్గొన్నారు. కాగా, వైద్యా రోగ్య శాఖ అధికారి ఫిర్యాదు మేరకు అక్షయ నర్సింగ్‌ హోం నిర్వాహకులు డాక్టర్లు రవిబాబు, విష్ణువర్ధన్‌ రెడ్డి, సబితపై మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెసీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ సీఐ గణేశ్‌ తెలిపారు.