బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Oct 13, 2020 , 02:17:43

హర్షాతిరేకాలు..

హర్షాతిరేకాలు..

  • ఎమ్మెల్సీగా కవిత గెలుపుపై హర్షాతిరేకాలు
  •  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన సంబురాలు
  • టీఆర్‌ఎస్‌, టీ జాగృతి, టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో వేడుకలు
  • భూపాలపల్లి, జనగామలో బైక్‌ ర్యాలీల హోరు
  •  స్వీట్లు పంచి, పటాకులు కాల్చిన నాయకులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట కవిత భారీ మెజార్టీతో గెలవడంపై సోమవారం వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం ఫలితం వెలువడగానే టీఆర్‌ఎస్‌, తెలంగాణ జాగృతి, టీబీజీకేఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బైక్‌ ర్యాలీలతో హోరెత్తించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి వేడుకలు చేసుకున్నారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, కవిత చిట్రపటాలకు పాలాభిషేకం చేశారు.    

-వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

కవిత గెలుపుతో టీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, కుడా అడ్వయిజర్‌ మెంబర్‌ చిర్రా రాజు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నేత బీ వీరేందర్‌, టీఆర్‌ఎస్వీ అర్బన్‌ కో ఆర్డినేటర్లు బైరపాక ప్రశాంత్‌, అరూరి రాజు, టీఆర్‌ఎస్వీ నేత మాచర్ల శరత్‌చంద్ర, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పబ్బోజు శ్రీకాంతాచారి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాశీబుగ్గ, మడికొండలోనూ సంబురాలు జరిగాయి. కవిత గెలిచిన సందర్భంగా మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

జనగామ జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం, జాగృతి శ్రేణులు వేర్వేరుగా విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. జనగామ చౌరస్తా వద్ద పొత్కనూరి మంజుల, కొలగాని కావ్య ఆధ్వర్యంలో మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకొని సంబురాల్లో మునిగితేలారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి ఆధ్వర్యంలో జాగృతి జిల్లా కార్యాలయం వద్ద పెద్దఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. శ్రేణులు బైక్‌లపై ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తాకు చేరుకొని సంబరాలు చేసుకున్నారు. చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్‌ మీదుగా జిల్లా కోర్టు భవనం వరకు బైక్‌ ర్యాలీ సాగింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో టీబీజీకేఎస్‌ నేత పడగల సమ్మయ్య ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి నాయకత్వంలో హనుమాన్‌ ఆలయం నుంచి జయశంకర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ తీసి అంబేద్కర్‌ సెంటర్‌లో పటాకులు కాల్చారు. రేగొండలో ఎంపీపీ పున్నం లక్ష్మి, జ డ్పీటీసీ విజయసాయి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి పటాకు లు కాల్చారు. కాటారంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అజ్జయ్య ఆధ్వర్యంలో స్వీట్లు పంచి పటాకులు కాల్చారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. కవిత గెలుపును హర్షిస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శాయంపేట, గీసుగొండ మండలకేంద్రాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు.

ములుగు జిల్లాకేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ పంచుకొని సంబురాలు చేసుకున్నారు.logo