బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Oct 12, 2020 , 06:25:59

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

  • కలిసికట్టుగా విజయం సాధిద్దాం
  • సీఎం కేసీఆర్‌ పాలనే ప్రధాన ఎజెండా
  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌
  • ఉమ్మడి జిల్లా ముఖ్యులతో భేటీ
  • ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చ
  • మరో ఇద్దరు ఇన్‌చార్జిలను ప్రకటించిన మంత్రి

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికార పార్టీ నాయకులను కోరారు. ఆదివారం హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ముఖ్యులతో ఈ సమావేశం జరుగగా, ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరువవుతున్నాయని గ్రాడ్యుయేట్లకు వివరిస్తే గెలుపు తమదేనని చెప్పారు. 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్‌ను ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తున్నాయని, ప్రస్తుతం ఎమ్మె ల్సీ ఎన్నికల్లోనూ విజయం తమదే కావాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ అన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులతో ఆదివారం వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనే ప్రధాన ఎజెండాగా వ్యూహం ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్ల నమోదు, గెలుపు కోసం పార్టీపరంగా అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని గ్రాడ్యుయేట్లకు ఈ విషయంపై వివరించే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఓటర్ల నమోదు పకడ్బందీగా నిర్వహించాలని,

అర్హులైన ఏ ఒక్కరూ తప్పిపోకుండా చూడాలని సూచించారు. ఆలోచనాపరులైన గ్రాడ్యుయేట్లకు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనం మేరకు ముఖ్యనేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఎన్నికలో విజయం తమదేనని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నదని, అందుకే ఏ ఎన్నికైనా తమ పార్టీయే గెలుస్తోందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను, తాజాగా తెచ్చిన చట్టాలను గ్రా డ్యుయేట్లకు అర్థమయ్యేలా కార్యాచరణ ఉండాలని చెప్పా రు. ఓటర్ల నమోదులో పకడ్బందీగా వ్యవహరించాలని అన్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికలో సూక్ష్మ స్థాయిలో వ్యూహం ఉండాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ చెప్పా రు.

ఓటర్ల నమోదు నుంచి పక్కాగా వ్యవహరించాలని అన్నా రు. ఎన్నికల నేపథ్యంలో గెలుపు కోసం తరచూ సమావేశమవ్వాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్‌భాస్కర్‌, రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజాగా మర్రి, సాంబారికి ఇన్‌చార్జి బాధ్యతలు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఇద్దరు నేతలను ఇన్‌చార్జిలుగా నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ఉమ్మడి వరంగల్‌ జడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావును నియమించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నియమితులైన నేతలతో పాటు వీరు కూడా ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని దయాకర్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.logo