బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Oct 10, 2020 , 06:35:26

పండుగలా బతుకమ్మ చీరెల పంపిణీ

పండుగలా బతుకమ్మ చీరెల పంపిణీ

  • ఉమ్మడి జిల్లాలో ఘనంగా కార్యక్రమం
  • భద్రకాళి, మేడారం సమ్మక్క- సారక్కకు మంత్రి సత్యవతి మొక్కులు
  • వరంగల్‌ నగరంలో చీఫ్‌విప్‌ దాస్యంతో కలిసి అందజేత
  • పాలకుర్తి, తొర్రూరులో పంచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు
  • అందుకొని మురిసిపోయిన ఆడబిడ్డలు

ఊరూరా ‘బతుకమ్మ’ సంబురం ముందే వచ్చింది. పెద్ద బతుకమ్మను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంపిన సారెనందుకొని మహిళా లోకం మురిసిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి చీరెల పంపిణీ ఘనంగా మొదలైంది. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి, మేడారం సమ్మక్క-సారక్కలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ చీరెలు సమర్పించి మొక్కులు చెల్లించి, అర్బన్‌, ములుగు జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాలకుర్తి, తొర్రూరులో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంపిణీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చీరెలు అందించగా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. 

-వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నాకు అన్నయినా.. తమ్ముడైనా కేసీఆరే


నాకు అన్న, తమ్ముడు, తండ్రి అన్నీ కేసీఆరే. ప్రతి సద్దుల బతుకమ్మకు సర్కారు ఇచ్చిన చీరెనే కట్టుకుంటున్న. మంచిగ దాశిపెట్టుకొని మేడారం సమ్మక్క, ఎములాడ రాజన్న, కొమురెల్లి మల్లన్న జాతర్లకు సుతం బతుకమ్మ చీరెనే కట్టుకొని పోతున్న. ఇయ్యాల తీసుకున్నది శాన సక్కదనంగున్నది. సూత్తాంటె సంబురమైతాంది. పండుగ పూట పుట్టింటి కట్నం ముందుగనే అచ్చింది. పేదోళ్ల కట్టం తెలుసుగావట్టే కేసీఆర్‌ సారు ఏంజెయ్యాల్నో గదేజేత్తాండు.

- చింతల సారమ్మ, చెన్నారావుపేట, వరంగల్‌ రూరల్‌ జిల్లా

 వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పెద్ద బతుకమ్మను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంపిన చీరెల పంపిణీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమైంది. తీరొక్క రంగులు, డిజైన్లతో ఉన్న చీరెలను చూసి మహిళలు సంబురపడ్డారు. కుటుంబ పెద్దలా సీఎం కేసీఆర్‌ పండుగ సారె ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. తరచి తరచి చూసుకుని మురిసిపోయారు. స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రా థోడ్‌ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రా వు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి చీరెలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం అక్కడి బస్తీలో చీరెలు పంపిణీ చేశారు. తర్వాత నేరుగా మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద చీరెలు పెట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవతలను మొక్కుకున్నారు. అక్కడి నుంచి ములుగు కలెక్టరేట్‌కు చేరుకుని చీరెలు పంపిణీ చేసి స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పాలకుర్తిలో దేవరుప్పుల, పాలకుర్తి కొడకండ్ల మండలాలకు, తొర్రూరులో పెద్దవంగర, తొర్రూరు మండలాల వారికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చీరెలు పంపిణీ చేశారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ 24, 27 డివిజన్లలో జరిగిన చీరెల పంపిణీలో పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ , రఘునాథపల్లి, ధర్మసాగర్‌ మండలం కరుణాపురంలో ఎమ్మెల్యే టీ రాజయ్య, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి, మరిపెడ మండలం మరిపెడ, ఎల్లంపేట, వీరారం, దంతకుంట తండాలో డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌, ఐనవోలు మండలం నంద నం, హసన్‌పర్తి మండలం సీతంపేటలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌లోని 8, 28వ డివిజన్‌లో వరంగల్‌ తూర్పు ఎ మ్మెల్యే నన్నపునేని నరేందర్‌, నర్సంపేట మండలం రాజపల్లె, నల్లబెల్లి మండలం శనిగరం, ఖానాపురం మండలం ధర్మారా వు పేట, చెన్నారావుపేట, దుగ్గొండిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బయ్యారం, గార్లలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, వెంకటాపురంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బతుకమ్మ చీరెలు పంచగా మహిళలు వాటిని అందుకుని సంబురపడ్డారు. 

ఆడబిడ్డలకు ఆదరణ ఆకలికేకలకు అడ్డుకట్ట

దేవరుప్పుల : ‘ఆడబిడ్డలకు పెద్దన్నగా కేసీఆర్‌ ఆదరణకు బతుకమ్మ చీరెల పంపిణీ నిదర్శనం.. చీరె ధర, నాణ్యత ముఖ్యం కాదు.. చెల్లెళ్లకు ప్రేమతో అన్న అందించిన కానుక లెక్క భావించాలె. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మగ్గాలు నేసే నేతన్నల ఆకలికేకలు, ఆత్మహత్యలు పత్రికల్లో కనబడని రోజులేదు. తెలంగాణలో దానికి ఫుల్‌స్టాప్‌ పడింది. బతుకమ్మ పండుగకు పంచే లక్షలాది చీరెలను మన నేతన్నలు మగ్గాలపై నేసి ఆడబిడ్డలకు అందిస్తుండడంతో వారికి ఉపాధి దొరికింది. బతుకమ్మ చీరెల పథకం ఇలా ఉభయతారకం కావడం మంచి పరిణామం’ అంటూ కామారెడ్డిగూడెం సర్పంచ్‌ బిళ్ల అంజమ్మ చేసిన ఉపన్యాసం సభికులను అకట్టుకున్నది. పాలకుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన చీరెల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ బతుకమ్మ చీరెల పంపిణీపై ఉత్తమ అభిప్రాయాలు తెలిపిన సర్పంచ్‌లకు మంచి మార్కులు పడుతాయని చెప్పగా అనేక మంది సర్పంచ్‌లు మాట్లాడారు. వీరిలో కామారెడ్డిగూడెం సర్పంచ్‌ అంజమ్మ ప్రసంగాన్ని మంత్రి మెచ్చుకున్నారు. 

logo