గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Oct 08, 2020 , 03:29:47

మార్గం సుగమం...

 మార్గం సుగమం...

  • అందుబాటులోకి అండర్‌ బ్రిడ్జి
  •  నెరవేరిన వరంగల్‌వాసుల దశాబ్దాల కల
  • రూ.9 కోట్లతో పూర్తయిన నిర్మాణం
  • త్వరలో ప్రారంభం కానున్న రాకపోకలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌ ్రప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. నగరవాసులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అండర్‌ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇరుకైన దారితో నిత్యం ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు చుక్కలు చూడాల్సి వచ్చేది. ఆ దారిన ప్రయాణమంటేనే నరకంగా ఉందంటూ గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు కరువైంది. ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మేయర్‌ నన్నపునేని చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లతో సమాంతర బ్రిడ్జిని నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీర్చింది.

 ఖిలా వరంగల్‌

వరంగల్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడంతో నగరవాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్రిడ్జి విస్తరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేయని ఉద్యమాలు లేవు. ఓ వైపు కంపుకొట్టే మల, మూత్రశాలలు, మరోవైపు లీకైన డ్రైనేజీ పైపు లు.. బ్రిడ్జి కింది రోడ్డుపై మృత్యుకుహరంగా ఇనుప చువ్వలు, నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు.. ఇలా ప్రజలు నరకం చూసేవారు. ఇన్ని సమస్యలున్న అండర్‌ బ్రిడ్జిని విస్తరించాలని ఇక్కడి ప్రజలు అప్పటి పాలకులకు వందల సంఖ్యలో వినతి పత్రాలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సమస్య ఇంకా తీవ్రమై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. అంతేగాక తేలికపాటి వర్షం పడినా అండర్‌ బ్రిడ్జి కింద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడేది.

స్వరాష్ట్రంలోనే వంతెన సాకారం..

అండర్‌ బ్రిడ్జి వెడల్పు చేయాలనే దశాబ్దాల కల రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తీరబోతోంది. మొట్టమొదటిసారిగా టీఆర్‌ఎస్‌ పార్టీ మహానగర పాలక సంస్థపై జెండా ఎగురవేసిన నేపథ్యంలో అప్పటి మేయర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ సమాంతరంగా మరో వంతెన నిర్మాణం కోసమే తొలి సంతకం చేశారు. సుమారు రూ.9కోట్లు కేటాయించి శంకుస్థాపన చేసి అనుమతుల కోసం రైల్వేశాఖకు నివేదిక పంపారు. దీంతో ఖిలా వరంగల్‌, శివనగర్‌, చింతల్‌, రంగశాయిపేట, ఉర్సు, శంభునిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట ప్రాంతాల ప్రజలకు వరంగల్‌ వైపు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అలాగే బ్రిడ్జికి రెండు వైపులా స్మార్ట్‌గా రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో బట్టలబజార్‌ నుంచి ఖమ్మం ప్రధాన రహదారి, కరీమాబాద్‌ కు ‘వై’ ఆకారంలో ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత అభివృద్ధి చేస్తా..


వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతం రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నా. నిత్యం అండర్‌ బ్రిడ్జి కింది వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడి సమస్యను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించా. ఎమ్మెల్యేగా ఈ టర్మ్‌లోనే పాత బస్తీ అనే పేరును మార్చి కొత్తదనం తీసుకొస్తా. ఇరువైపులా స్మార్ట్‌ రోడ్డు పనులు పూర్తయిన తర్వాత అండర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తాం. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.

 నన్నపునేని నరేందర్‌,వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే