ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Oct 04, 2020 , 06:32:21

యూపీఎస్సీకి ఏర్పాట్లు పూర్తి

యూపీఎస్సీకి ఏర్పాట్లు పూర్తి

  • 16 సెంటర్లు.. 6763 మంది అభ్యర్థులు
  • గంటన్నర ముందే సెంటర్‌కు రావాలి
  • కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
  • అర్బన్‌ కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు

హన్మకొండ : నగరంలో నేడు జరిగే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ ప్రిలిమినరీ-2020 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 16 సెంటర్లు ఏర్పాటు చేయగా, 6763మంది అభ్యర్థులు పరీక్షలకు హా జరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకాధికారిగా అశ్విన్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రానికి హన్మకొండ, వరంగల్‌, కాజీపేట బస్టాండ్ల నుంచి ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. కొవిడ్‌ నేపథ్యంలో అభ్యర్థులు సెంటర్‌కు శానిటైజ్‌ చేసుకొని, మాస్కు ధరించి గంటన్నర ముందు రావాలని సూచించారు. సెంటర్ల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. దగ్గు, జ్వరం లక్షణాలున్న అభ్యర్థుల కోసం అదే సెంటర్‌లో వేరే గది ఉం టుందన్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారుల సహకారంతో టి ఫిన్‌, భోజన వసతి కల్పించామని, ప్రథమ చికిత్స కేంద్రా లు ఏర్పాటు చేశామని చెప్పారు. సెంటర్‌కో పర్యవేక్షణాధికారితో పాటు నలుగురు రెవెన్యూ అధికారులను నియమించామన్నారు.  నలుగురు రూట్‌ అధికారులు, ఇన్విజిలేటర్ల ను సైతం నియమించినట్లు తెలిపారు. మొదటి పేపర్‌ ఉద యం 9.30 గంటల నుంచి 11.30  వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తామని తెలిపారు. 

అభ్యర్థులకు సూచనలు..

పరీక్షా సమయానికి 10 నిమిషాల ముందు నుంచి కేం ద్రంలోకి అనుమితించరు. కేంద్రానికి గంటన్నర ముందే కేటాయించిన గదిలోకి వెళ్లి సీట్లలో కూర్చోవాలి. ఇతరులతో మాట్లాడడం, గుమిగూడడం నిషేధం. శానిటైజ్‌ చేసుకుని, మాస్కు ధరించి రావాలి. సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇతర సాంకేతిక, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. 

సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు సీపీ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. ప్రతి సెంటర్‌ వద్ద ఐదుగురు పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని, పొరపాటున ఒక సెంటర్‌కు బదులు మరో సెంటర్‌కు వెళ్లిన అభ్యర్థులను తిరిగి సంబంధిత పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరవేసేందుకు  వాహనాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. 

అబ్జర్వర్‌కు స్వాగతం పలికిన ఆర్డీవో

జిల్లాలో పరీక్షల అబ్జర్వర్‌గా నియమితులైన రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ డైరెక్టర్‌ కే యూకూబ్‌నాయక్‌ శనివారం సాయత్రం జిల్లాకు వచ్చారు. హారిత కాకతీయ హోటల్‌లో ఆయనకు ఆర్డీవో వాసుచంద్ర స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై వివరించారు. ఇక్కడ ఆర్డీవోతో పాటు డీటీ శర్మ తదితరులున్నారు. logo