బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Oct 02, 2020 , 06:06:57

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం

  • నవంబర్‌ 6వ తేదీ తుది గడువు
  • గత ఎన్నికల్లో 2,81,138 మంది ఓటర్లు

హన్మకొండ, అక్టోబర్‌ 1: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తాజాగా ఓటర్ల జాబితాను రూపొందించడంలో అధికారులు నిమగ్నయ్యారు.   వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలో పేర్లు ఉన్న వారు సైతం మళ్లీ ఓటు హక్కు పొందాలంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. పాత ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 2,81,138 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 

12 జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ స్థానం..

ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రెండు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు కొత్త జిల్లాలు, సిద్దిపేట జిల్లాతో కలిపి మొత్తం 12 జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విస్తరించి ఉంది. ఈ 12 జిల్లాల్లో 22 డివిజన్లు ఉండగా 186 మంది తహసీల్దార్లు ఎలక్టోరల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. అర్హులందరూ ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  అర్హులు వీరే.. 

2017 అక్టోబర్‌ నాటికి డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు ఫారం-18 అందుబాటులో ఉంటుంది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో https//ceotser msl.telangana.gov.in/MLC/form18aspx ద్వా రా ఓటు నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, మార్కుల ధ్రువీకరణ పత్రం, పట్టా జిరాక్స్‌ కాపీలు దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు సమర్పించాలి. 

 అర్హులందరూ నమోదు చేసుకోవాలి

   పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. అర్హులైన పట్టభద్రులందరు నవంబర్‌ 6వ తేదీలోగా తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ‘ఫారం-18’ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు చేసుకోవాలి. పాత ఓటరు జాబితాలో పేరు ఉన్నా మళ్లీ నమోదు చేసుకుంటేనే ఓటుహక్కును కలిగి ఉంటారు. 

 - ఎం వాసుచంద్ర, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ నమోదు అధికారి logo