ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Oct 01, 2020 , 02:20:19

గ్రేటర్‌లో స్మార్ట్‌ టాయిలెట్లు

గ్రేటర్‌లో స్మార్ట్‌ టాయిలెట్లు

  • ‘లూ కేఫ్‌' పేరుతో కార్పొరేట్‌ హంగులు 
  • బేబీ ఫీడింగ్‌ రూం..  కాఫీ పాయింట్‌
  • ప్రయోగాత్మకంగా 8 సెంటర్లలో ఏర్పాటు

వరంగల్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్మార్ట్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రోపాలిటన్‌ నగరాల స్థాయిలో ‘లూ కేఫ్‌' పేరున అన్ని హంగులతో నిర్మిస్తున్నారు. స్టార్‌ హోటళ్లలోని టాయిలెట్ల స్థాయిలో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఒక్కో లూ కేఫ్‌ టాయిలెట్‌కు రూ.17 లక్షలు వెచ్చించనున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఇప్పటికే వీటిని ఏర్పాటు చేశారు. లూ కేఫ్‌ టాయిలెట్లను తొలిసారిగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 8 సెంటర్లలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

 కార్పొరేట్‌ స్థాయి హంగులు..

వరంగల్‌ మహా నగరంలో ఏర్పాటు చేయనున్న లూ కేఫ్‌ టాయిలెట్లలో కార్పొరేట్‌ స్థాయి హంగులు కల్పిస్తున్నారు. కళ్లు జిగేల్‌ మనే లైటింగ్‌,  డిజైన్‌ ఫ్లోరింగ్‌తో పాటు రెండు షీ టాయిలెట్లు, రెండు మెన్‌ టాయిలెట్లు, రెండు మూత్రశాలలు, విశాలమైన వాష్‌బేషన్‌, బేబీ ఫీడింగ్‌ రూం ఏర్పాటు చేస్తున్నారు.   

లూ కేఫ్‌ టాయిలెట్లలో ప్రత్యేకంగా కాఫీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో టాయిలెట్‌ నిర్వాహకులకు కాఫీ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా గ్రేటర్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. లూ కేఫ్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో మంచి గార్డెనింగ్‌ అభివృద్ధి చేయనున్నారు. కాఫీ సెంటర్‌కు వచ్చే వారికి ఆహ్లాదం కలిగించేలా చిన్న గార్డెన్‌ను అభివృద్ధి చేయాలని కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

10 రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు..

నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం, పాత బస్‌డిపో సెంటర్‌, ఐటీడీఏ కార్యాలయం, టీబీ ఆస్పత్రి సెంటర్‌, నిట్‌, కుడా కార్యాలయం, రత్న హోటల్‌ ఎదురుగా, ఖుష్‌మహల్‌ ప్రాంతాల్లో మొదట లూ కేఫ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. మరో 10 రోజుల్లో వీటిలో కొన్నింటిని ప్రారంభించేందుకు గ్రేటర్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మలిదశలో తూర్పు నియోజకవర్గంలోని 8 సెంటర్లలో ఏర్పాటు చేసేందుకు గ్రేటర్‌ అధికారులు స్థల పరిశీలన చేశారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక శ్రద్ధతో వరంగల్‌లో లూ కేఫ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు బల్దియా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోచమ్మమైదాన్‌ , వెంకట్రామ జంక్షన్‌, శంభునిపేట, నాయుడుపెట్రోల్‌ పంపు, సీఎస్‌ఆర్‌, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌, ఎస్‌బీహెచ్‌, ఎంజీఎం జంక్షన్లలో లూ కేఫ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు గ్రేటర్‌ అధికారులు స్థలాలను గుర్తించారు.logo