బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Sep 30, 2020 , 00:31:16

సర్కారు బంపరాఫర్‌..!

సర్కారు బంపరాఫర్‌..!

  • ఆస్తి పన్నుపై 10శాతం వడ్డీ కడితే 90శాతం మాఫీ
  • అక్టోబర్‌ 31దాకా గడువు
  • వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై  బల్దియా విస్తృత ప్రచారం

వరంగల్‌ : ఏళ్ల తరబడి ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీపై రాష్ట్ర సర్కారు బంపరాఫర్‌ ఇచ్చింది. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంలో భాగంగా 2019-20 వరకు బకాయి ఉన్న ఆస్తి పన్నుతో పాటు 10 శాతం వడ్డీ చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేసే సువర్ణావకాశం కల్పించింది. కార్పొరేషన్‌ పరిధిలో సుమారు రూ. 20కోట్ల దాకా బకాయిలున్నాయి. ఆస్తి పన్ను కంటే వడ్డీ పెద్ద మొత్తంలో పేరుకపోయిన వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఏళ్ల తరబడి పన్ను చెల్లించకుండా పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వారికి వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ మంచి అవకాశమని చెప్పొచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీంను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా గ్రేటర్‌ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటి వరకు రూ.8కోట్లు వసూలు

ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌తో మొండిబకాయిదారులు సానుకూలంగా స్పందిస్తున్నారని బల్ది యా అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు రూ.8కోట్ల దాకా వసూలైనట్లు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను, వడ్డీ కట్టాల్సిన వారి వద్దకు ప్రత్యేక బృందాలుగా వెళ్లి బల్దియా అధికారులు వసూలు చేస్తున్నారు. మీ సేవ, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లో కూడా పన్ను, వడ్డీ చెల్లించే అవకాశం కల్పించారు.

గడువు అక్టోబర్‌ 31 

వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు అక్టోబర్‌ 31 దాకా అవకాశం కల్పించింది. ఇదే చివరి అవకాశంగా ప్రభుత్వం తెలిపింది. ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న మొండిబకాయిదారులకు పన్నుతో పాటు వడ్డీ సమానంగా ఉంది. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులు మూడు నెలల క్రితం మొండిబకాయిదారుల పేర్లను బహిరంగంగా ప్రదర్శించారు. పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను, వడ్డీ బకాయి ఉన్న వారి కోసం ప్రభుత్వం ఈ స్కీంను ప్రకటించింది. 

విస్తృత ప్రచారం

ప్రభుత్వం ప్రకటించిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై గ్రేటర్‌ కార్పొరేషన్‌ విస్తృత ప్రచారం చేస్తున్నది. నగరంలోని హోర్డింగ్‌లు, డివైడర్ల మధ్య ఉన్న లాలిపప్స్‌ ద్వారా ప్రచారం కల్పిస్తున్నది. పోస్టర్లు, ఇంటింటికీ స్టిక్కర్లను అంటించి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై ప్రజలకు గ్రేటర్‌ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్‌ 31 నాటికి ఈ స్కీం గడువు ముగియనుందని, ఈ ఆఫర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. పన్నుల విభాగం సిబ్బందితో కమిషనర్‌ పమేలా సత్పతి వరుస సమావేశాలు నిర్వహిస్తూ వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను ప్రజల్లోకి తీసుకెళ్లి వసూళ్లు పెంచాలని సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వారి వద్దకు పన్నుల విభాగం అధికారులు నేరుగా వెళ్లి మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కమిషనర్‌ సూచించారు.logo