గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 29, 2020 , 06:19:05

నగరానికి మరో మకుటం

నగరానికి మరో మకుటం

  • తలమానికంలా ‘హన్మకొండ కాలేజ్‌' 
  • అత్యాధునిక హంగులతో నిర్మాణం
  • రూ.9 కోట్లతో కొత్త భవనాలు
  • మహామహులకు విజ్ఞానం పంచిన కళాశాల
  • మరో రెండు నెలల్లో ప్రారంభానికి సన్నాహాలు
రెడ్డికాలనీ : వరంగల్‌ మహానగరాన్ని ‘స్టడీ హబ్‌'గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. కోట్లాది రూపాయాలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కళాశాలలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగానే హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలను అత్యాధునికంగా నిర్మించి నగరానికే తలమానికంగా తీర్చిదిద్దింది. ఎంతోమంది ప్రముఖులు విద్యనభ్యసించిన ఈ కాలేజీకి పూర్వవైభవం తెచ్చింది. 1948లో మల్టీపర్సస్‌ విద్యాలయంగా ఉండి 1970లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయింది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పురాతన భవనంలోనే విద్యార్థులు భయంభయంతో విద్యనభ్యసించేవారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవతో ఇది అభివృద్ధికి నోచుకుని జిల్లాకు మరో మకుటంలా నిలిచింది. మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు చదువుకున్న ఈ కళాశాలకు ప్రభుత్వం పూర్వ వైభవం తేగా ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సందర్శించారు. 
రూ.9 కోట్లతో కళాశాల భవనాలు
హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.9కోట్లు కేటాయించింది. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించింది. 2017, ఆగస్టు 18న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కళాశాల పనులను ప్రారంభించారు. ప్రభుత్వం మూడేళ్లలోనే కొత్త హంగులతో భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తిచేయించి ప్రారంభించనుంది.
ప్రముఖుల విద్యాభ్యాసం
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌తో పాటు చాలమంది ప్రముఖులు ఇదే కళాశాలలో చదివారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, రాజకీయ, సామాజికవేత్తలుగా స్థిరపడ్డారు. విద్యార్థిగా ఇదే కళాశాలలో చదివిన కడియం, అధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు.  

కరోనా సమయంలోనూ పనులు


హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యాసంస్థల రూపురేఖలనే మార్చే దిశగా సీఎం కేసీఆర్‌ ముందుకు పోతున్నారు. నిరుపేదలకు నాణ్యమైన, మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. హన్మకొండ  కళాశాలలో ఎంతోమంది ప్రముఖులు విద్యనభ్యసించారు. కరోనా సమయంలోనూ భవన నిర్మాణ పనులు కొనసాగాయి. మరో రెండు నెలల్లో కళాశాల ప్రారంభమవుతుంది. 
- ఆర్‌.శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, హన్మకొండ


logo