గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 28, 2020 , 02:13:55

ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్ర‌మాల‌కు మ‌హ‌ర్దశ‌

ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్ర‌మాల‌కు మ‌హ‌ర్దశ‌

  • కేసీఆర్‌ పాలనలోనే సబ్బండ వర్గాలకు సముచిత స్థానం
  • రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రపంచానికే మార్గదర్శకం
  • కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం
  • బీజేపీ ప్రభుత్వం తీరు నచ్చకనే కేంద్ర మంత్రి రాజీనామా
  • అర్హులను గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదు చేయించండి
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశం, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లోని పెద్దవంగర, రాయపర్తిలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో సబ్బండ వర్గాలకు సముచిత స్థానం లభిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రపంచానికే మార్గదర్శకంగా మారాయని పేర్కొన్నారు. అర్హులను గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదు చేయించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- పెద్దవంగర/రాయపర్తి

పెద్దవంగర/రాయపర్తి, సెప్టెంబర్‌ 27: పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం పెద్దవంగర, రాయపర్తిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షతోపాటు పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పథంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పంతో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి పనుల ప్రాధమ్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పల్లె ప్రగతితో సీజనల్‌ రోగాలు, కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌లు సైతం అదుపులో ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీల నిర్మాణం, రైతు వేదికలు, కల్లాల పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అలాగే విలేజ్‌ పార్కుల కోసం త్వరగా స్థలాలను గుర్తించాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, ఇదే అదునుగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ప్రక్షాళన చాలా మంచి నిర్ణయమని, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు. ఏండ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నూతన రెవెన్యూ చట్టం శాశ్వతంగా దూరం చేయనుందన్నారు. ఈ చట్టం అన్ని రాష్ర్టాలకు ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలుగా నిలుస్తూ సీఎం కేసీఆర్‌ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని యువతకు స్త్రీనిధి, డెయిరీ, ఐటీడీఏ ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని, గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. యువత అధైర్యపడొద్దని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు, రైతులకు పట్టా పాస్‌ పుస్తకాలు అందజేశారు. అదేవిధంగా గతంలో కురిసిన వర్షాలకు రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో ఇండ్లు దెబ్బతిన్న 95 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికీ రూ.3200 చొప్పున రూ.3.4లక్షల విలువైన చెక్కులను మంత్రి అందించారు.

ఆయా కార్యక్రమాల్లో రాయపర్తిలో వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ, ఏవో గుమ్మడి వీరభద్రం, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, గారె నర్సయ్య, అయిత రాంచందర్‌, పూస మధు, కర్ర రవీందర్‌రెడ్డి, సూదుల దేవేందర్‌రావు, బిల్ల రాధిక, సుభాష్‌రెడ్డి, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, భూక్యా భద్రూనాయక్‌, లేతాకుల సుమతి, యాదవరెడ్డి, బండి రాజబాబు, భాషబోయిన సుధాకర్‌, జక్కుల వెంకట్‌రెడ్డి, కుందూరు రాంచంద్రారెడ్డి, కుంచారపు హరినాథ్‌, ముత్తడి సాగర్‌రెడ్డి, గజవెల్లి అనంత, ప్రసాద్‌, చెవ్వ కాశీనాథం, చిన్నాల శ్రీనివాస్‌, రాజు, వనజ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పెద్దవంగరలో ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, డీఆర్‌డీఏ పీడీ విద్యా చందన, డీపీవో ఆర్‌ఎస్‌పీ లత, డీఎల్‌పీవో షర్ఫొద్దీన్‌, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో అపర్ణ, మిషన్‌ భగీరథ ఈఈ మల్లేశం, పీఆర్‌ డీఈ ప్రసన్నకుమార్‌, డీఆర్‌డీఏ ఏపీడీ వెంకట్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఐలయ్య, మాజీ జడ్పీటీసీ కమలాకర్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు సుధీర్‌కుమార్‌, సోమ నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, సంజయ్‌, సుధాకర్‌, మనోహర్‌గౌడ్‌, జగదీశ్‌, లింగమూర్తి, రాము, సమ్మయ్య, వేణుసాగర్‌, హరీశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

ఓటరు నమోదు బాధ్యత మీదే..

అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ఓటరు నమోదు చేయించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ పోరాట కాలం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి విద్యార్థులు, మేధావులే ఆయువుపట్టుగా నిలిచి ఆదుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని ఆయన సూచించారు.

కేంద్రం వైఖరిపై మండిపాటు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు రైతులకు ఇబ్బందులు కల్గించేలా.. బడా వ్యాపారులకు మేలు చే సేలా ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. బీజేపీ ప్రభు త్వం తీరు నచ్చకనే కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ రాజీనామా చేశారని గుర్తు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అద్భుతమని ఢిల్లీలో పొగుడుతారు.. తెలంగాణ గల్లీల్లో మాత్రం తిడతారు.. అడిగితే అణా పైసా ఇవ్వరు. ఇదేం నీతి’..? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.logo