శుక్రవారం 23 అక్టోబర్ 2020
Warangal-city - Sep 28, 2020 , 01:59:39

రైతుకు చేరువయ్యేందుకే కొత్త సంస్కరణలు..

రైతుకు చేరువయ్యేందుకే కొత్త సంస్కరణలు..

  • వాణిజ్య బ్యాంకులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నాం..
  • ఆరు నెలల్లోనే 140 డిపాజిట్లు సేకరించాం
  • మా పాలకవర్గం వచ్చాకే సాధ్యమైంది
  • తక్కువ వడ్డీతో రుణ పరిమితి పెంచాం
  •  పీఏసీఎస్‌లకు మంచిరోజులొచ్చాయ్‌
  •  ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు

సుబేదారి : ‘మాది పూర్తిగా రైతు సేవ చేసే బ్యాంకు. మారిన కాలానికి అనుగుణంగా మూస పద్ధతిలో కాకుండా మాకున్న వనరులు, పరిమితులను బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కమర్షియల్‌ బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్నాం. ఈ ఆరు నెలల కాలంలో అది కూడా కొవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ అనేక సంస్కరణలు చేశాం. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత టర్నోవర్‌ను రూ.979 కోట్లకు తీసుకొచ్చామ’ని ఉమ్మడి వరంగల్‌ సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు పేర్కొన్నారు. రైతులు లోన్‌ తీసుకునేందుకు ఆలోచించే గడ్డు పరిస్థితులు, గత పాలకవర్గ అవినీతితో మసకబారిన ప్రతిష్ట వంటి ప్రతికూలతలను అధిగమించి లాభాల బాట పట్టించా మని, ఇదంతా ఆరు నెలల్లోనే సాధ్యమైందని వివరించారు. నేడు తొలి సర్వస భ్య సమావేశం సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

నమస్తే: బ్యాంకుపై పడిన అవినీతి ముద్రను అధిగమించేందుకు మీరు తీసుకున్న చర్యలు?

చైర్మన్‌ : ఇంతకు ముందు ఉన్న పాలకవర్గం బ్యాంకును అప్రతిష్టపాలు చే సింది. కోట్ల రూపాయలు అవినీతి చేసింది. దీని వల్ల బ్యాంకు డిపాజిటర్లు, రైతుల్లో ఒక రకమైన భయం పట్టుకుంది. ఇలా వీటన్నింటిని అధిగమించి ఏం చేయాలి? పాలకవర్గం వైపు నుంచి ఎలా చేస్తే బాగుంటుందని పలు దఫాలుగా సభ్యులు, ఉద్యోగులతో సమీక్షించాను. ఇతర జిల్లాలో డీసీసీబీ అభివృ ద్ధి నమూనాను పరిశీలించాం. ముఖ్యంగా కరీంనగర్‌ డీసీసీబీ మంచి లాభా ల్లో ఉందని తెలిసి ఎలా చేస్తున్నారో అధ్యయనం చేశాం. అలాగే స్టేట్‌ కో ఆప రేటివ్‌ బ్యాంకు ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో మూస పద్ధతిని పక్క బెట్టి కొత్తగా నిర్ణయం తీసుకున్నాం. విధివిధానాలు రూపొందించుకొని, కమ ర్షియల్‌ బ్యాంకులకు దీటుగా అభివృద్ధి చేయాలనే సంస్కరణలు తీసుకుకొచ్చాం.

మీరు చైర్మన్‌ అయిన తర్వాత చేసిన సంస్కరణలేమిటి?

డీసీసీబీ అంటేనే రైతు సేవా బ్యాంకు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణం ఇవ్వాలనేది మా ప్రధాన అంశం. అది క్రాప్‌లోన్‌ కావచ్చు, ఎల్‌టీ లోన్‌ కావచ్చు. అంతేకాకుండా వారి పిల్లల ఉన్నత చదువుల కోసం వ్యవసాయ భూమిపై, ఇంటి స్థలాలపై రూ. 20 లక్షల రుణం ఇస్తున్నాం. అలాగే వ్యాపారం కోసం గొర్లు, బర్లు, కోళ్లఫారాలు పెట్టుకోవాలనుకునే వారికి రూ. 30 లక్షల దాకా ఇస్తున్నాం. వ్యవసాయం కోసం ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు రుణాలు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీపై అన్ని రకాల పరిశ్రమలు, వాహనాలకు రుణాలు ఇస్తున్నాం. కొత్తగా మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇస్తున్నాం. అలాగే గ్రామాల్లో కిరాణా దుకాణం, కూరగాయల వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు రూ. లక్ష నుంచి రెండు లక్షల దాకా ప్రభుత్వ ఉద్యోగి జమానత్‌తో రుణాలు ఇస్తున్నాం. కొత్తగా పది మంది కలిసి(ఒక గ్రూప్‌గా) రైతులు లేక మహిళలకు ఏదైనా వ్యాపారం ఉమ్మడిగా గానీ వ్యక్తిగతంగా డెయిరీ ఫాం పెట్టుకోవడానికి విజయ, ఎన్‌ఎస్‌ఆర్‌, నాగార్జున డెయిరీ సంస్థల అనుసంధానంతో రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నాం. అలాగే గ్రామాలు, పట్టణాల్లో గృహ నిర్మాణాల కోసం ప్రాపర్టీని బట్టి లోన్‌ మంజూరుచేస్తున్నాం. మా బ్యాంకులో గోల్డ్‌లోన్లు, చిరువ్యాపారులకు ఇస్తున్న రుణాలకు మంచి స్పందన ఉంది.

ఈ ఆరు నెలల్లో ఎంతమందికి లోన్లు ఇచ్చారు?

మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే లాక్‌డౌన్‌ మొదలైంది. అందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి కరోనా పేరుతో ప్రత్యేక రుణాలు ఇచ్చాం. ఇప్పటివరకు వ్యవసాయ భూమి ష్యూరిటీతో లక్షలోపు 5,562మందికి 25 పైసల వడ్డీకి రూ. 30 కోట్లు ఇచ్చాం. ఖరీఫ్‌ సీజన్‌లో 48వేల 699మంది రైతులకు రూ. 302 కోట్ల పంట రుణాలు ఇచ్చాం. 500మంది చిరు వ్యాపారులకు ఒకరికి లక్ష చొప్పున, 20మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కోటీ 58లక్షలు, బంగారం తనఖా పెట్టుకుని రూ.45 కోట్లు ఇచ్చాం. ఇలా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద 56 మహిళా సంఘాలకు రూ.2కోట్ల 46లక్షలు ఇచ్చాం. వ్యవసాయ భూమిని జమానత్‌ పెట్టి 120 మంది బిజినెస్‌ లోన్‌ పెట్టుకున్నారు. ధరణి వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయిన తర్వాత వారికి రుణాలు ఇస్తాం. రూ. 25వేల లోపు తీసుకున్న వారికి ప్రభు త్వం రుణమాఫీ చేయడం వల్ల మా బ్యాంకులో 11439 మందికి సంబంధించి రూ.6 కోట్ల 49లక్షలు వచ్చాయి.

పెండింగ్‌ లోన్లపై మీ వైఖరి? ప్రస్తుత టర్నోవర్‌, రికవరీ వివరాలు?

పాత బకాయిలతోపాటు, కొత్తగా ఇస్తున్న రుణాల వసూలు కోసం జీఎం, ఏజీఎం స్థాయి అధికారులతో నలుగురు నోడల్‌ ఆఫీసర్లను నియమించాం. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న రుణాల విషయంలో కొంతం కఠినంగానే వెళ్తున్నాం. ఇందుకోసం లీగల్‌ అడ్వయిజర్‌గా రిటైర్డ్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ను ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా నియమించాం. ఏళ్ల తరబడి మొండిబకాయిలు కట్టని వారిపై కో ఆపరేటివ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నోటీసులు ఇచ్చి, ఆస్తులు జప్తు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. ఈ విషయంలో ఎంతటి స్థాయిలో ఉన్న వారినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, టెస్కాబ్‌ పాలకమండలి ఆదేశాలిచ్చింది. మా పాలకవర్గం వచ్చిన తర్వాత రికవరీని 87శాతానికి తీసుకొచ్చాం. జంగా రాఘవరెడ్డి చైర్మన్‌గా ఉన్న నాటికి(ఏప్రిల్‌ 18, 2017 వరకు) రూ.726 కోట్ల,77లక్షలు ఉంది. ఆ తర్వాత కలెక్టర్‌ స్పెషల్‌ అధికారిగా ఉన్న సమయంలో(ఫిబ్రవరి 29, 2020 నాటికి) రూ.839కోట్ల, 32లక్షల, 84వేలుగా ఉండేది. నేను చైర్మన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన(ఫిబ్రవరి 29) తర్వాత నుంచి ఇప్పటివరకు రూ.979కోట్ల 63లక్షల 95వేలకు తీసుకువచ్చాం. ఈ ఆరు నెలల్లోనే రూ.140 కోట్లు పెంచాం. ఇది మా పాలకవర్గం, ఉద్యోగుల సమష్టి కృషి.. సంస్కరణల ఫలితమే. బ్యాంకును సరికొత్త పద్ధతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకువచ్చాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మంచిరోజులు వచ్చాయి. కొత్తగా గోదాముల నిర్మాణాలకు నాబార్డు నుంచి రూ.2 కోట్ల నిధులు వస్తున్నాయి. అలాగే కొత్తగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరో 10 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటుచేసుకోవడానికి టెస్కాబ్‌ అనుమతి ఇచ్చింది. ఇలా బ్యాంకును రైతులకు మరింత దగ్గరగా తీసుకువెళ్తూ, కమర్షియల్‌ బ్యాంకులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తున్నాం.

రుణపరిమితి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

ముందే చెప్పినట్లు మాది పూర్తిగా రైతు సేవా బ్యాంకు. గతంలో వడ్డీ ఎక్కువని చాలా మంది మా బ్యాంకులో లోన్‌ తీసుకునేందుకు ఆలోచించేవారు. ఇతర కమర్షియల్‌ బ్యాంకుల కంటే మా బ్యాంకులోనే తక్కువ వడ్డీ ఉంటుంది. ఈ విషయంలో చాలామందికి అపోహ ఉంది. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాకున్న 19 బ్రాంచీలవారీగా గ్రామాల్లో డీసీసీబీ బ్యాంకు రుణాలు, వడ్డీ రేట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. వడ్డీ తగ్గించాం.. రుణపరిమితి పెంచాం. క్రాప్‌లోన్‌ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను బట్టి ఇస్తున్నాం. బిజినెస్‌ లోన్‌ ఇంతకుముందు ఎకరాకు రూ. రెండున్నర లక్షల వరకు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు లక్ష పెంచాం. గతంలో ఐదెకరాలుంటే ట్రాక్టర్‌ ఇచ్చేది, ఇప్పుడు 3నుంచి 4 ఎకరాలు ఉన్నా ఇస్తున్నాం. అలాగే 4, 5 ఎకరాలకు మార్టిగేజ్‌పై వరికోసే యంత్రం లోన్‌ ఇస్తున్నాం. వీటికి గతంలో 95 పైసల వడ్డీ పడేది, ఇప్పుడు 69 పైసలే. గోల్డ్‌లోన్‌ విషయంలో గతంలో గ్రాముకు రూ.2500 ఇచ్చేది, ఇప్పుడు 3200కు పెంచాం.logo