శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 27, 2020 , 06:16:45

ఇంటి అనుమతులు 21రోజుల్లో..

ఇంటి అనుమతులు 21రోజుల్లో..

  • 75 గజాల స్థలంలో నిర్మాణానికి మినహాయింపు
  • రూపాయి చెల్లిస్తే భవన రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ
  • కలెక్టర్‌ అధ్యక్షతన టీఎస్‌ బీపాస్‌ కమిటీ 
  • క్షేత్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు
  • త్వరలోనే కొత్త విధానం అమలు

ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మున్సిపాలిటీల చుట్టూ నెలల తరబడి తిరిగే కష్టాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దూరం చేసింది. బల్దియా మెట్లు ఎక్కకుండానే ఇంటి నుంచే 21రోజుల్లో అనుమతులు పొందేలా ‘టీఎస్‌-బీపాస్‌'ను అందుబాటులోకి తెచ్చింది.మరో త్వరలోనే ఇది రాష్ట్ర వాప్తంగా అమలు కానుండగా 75గజాల స్థలంలో కట్టుకునేవారికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదని రాష్ట్ర సర్కారు ప్రకటించి పేదలకు ఎంతో ఉపశమనం కలిగించింది. కేవలం రూపాయి చెల్లిస్తే భవన రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని జారీ చేయనుంది. 

-వరంగల్‌ 

వరంగల్‌ : మున్సిపాలిటీ కార్యాలయం మెట్లు ఎక్కకుండానే ఇంటి నుంచే అనుమతులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్‌ బీపాస్‌'కు శ్రీకారం చుట్టింది. సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణాల అనుమతులను పొందేలా ఈ విధానాన్ని రూపొందించింది. మరో 10 రోజుల్లో రాష్ట్రమంతా ఇది అమల్లోకి రానుంది. 75 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం రూపాయి చెల్లిస్తే 21 రోజుల్లోనే భవన రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ అవుతుంది. బహుళ అంతస్తుల అనుమతులను కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే టీఎస్‌ బీపాస్‌ కమిటీ ఇవ్వనుంది. క్షేత్రస్థాయిలో తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు అనుమతుల జారీలో కీలకంగా వ్యవహరించిన మున్సిపల్‌ శాఖ పాత్ర ప్రస్తుత విధానంలో లేకపోవడం గమనార్హం.

 రూపాయి చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ పత్రం..

టీఎస్‌ బీపాస్‌ విధానంతో పేదలకు ఇంటి నిర్మాణం మరింత సులభతరం కానుంది. 75 గజాల స్థలంలో జీ ప్లస్‌ 1 వరకు ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. కేవలం రిజిస్ట్రేషన్‌ పత్రాలు టీఎస్‌ బీపాస్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసి నామమాత్రంగా రూపాయి చెల్లిస్తే వెంటనే భవన రిజిస్ట్రేషన్‌ పత్రం వస్తుంది. ఇంటి నక్ష, లింక్‌ డాక్యుమెంట్‌ లాంటి పత్రాలు అవసరం లేకుండానే అనుమతులు పొందే అవకాశం కల్పించారు. మున్సిపల్‌ సర్వేయర్ల పని లేకుండానే ‘మీ సేవ’ కార్యాలయాల్లో భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. 75 గజాలపైన 200 గజాల వరకు (జీ ప్లస్‌ 1) టీఎస్‌ బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన వెంటనే  అనుమతిపత్రం పొందే అవకాశమిచ్చారు.  

  స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు..

 200 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల ప్లాట్‌లో నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు మంజారు చేస్తారు. జీ ప్లస్‌ 2 భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణమే అనుమతులివ్వనున్నారు. నిబంధనల మేరకు భవన నిర్మాణం పూర్తయితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. 500 చదరపు మీటర్ల ప్లాట్‌ (10 మీటర్ల ఎత్తు) కంటే ఎక్కువ, జీ ప్లస్‌ 2 కంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణానికి సింగిల్‌ విండో విధానంలో టీఎస్‌ బీపాస్‌ కమిటీ ద్వారా అనుమతులు మంజారు చేస్తారు. ఎన్‌వోసీల కోసం ఇతర శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మంజూరు చేయనున్నారు.

 21 రోజుల్లో అనుమతులు..

టీఎస్‌ బీపాస్‌ విధానం ద్వారా ఎలాంటి నిర్మాణాలకైనా 21 రోజుల్లో అనుమతులు లభించనున్నాయి. 21రోజులు దాటినా అనుమతులు పెండింగ్‌లో ఉంటే ఇచ్చినట్లుగానే భావించాలని టీఎస్‌ బీపాస్‌ విధానంలో నిబంధన పెట్టారు. 21రోజుల తర్వాత అనుమతులు ఇవ్వకుంటే ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం దరఖాస్తుదారు తీసుకునే అవకాశముంది. కలెక్టర్‌, కమిషనర్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పోలీస్‌ శాఖల అధికారులు టీఎస్‌ బీపాస్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీంతో ఇతర శాఖల నుంచి ఎన్‌వోసీలు అవసరముంటే దరఖాస్తుదారులు ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగకుండా వారిని కమిటీలో నియమించారు. టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే కమిటీ అధికారుల లాగిన్‌లోకి వెళ్తుంది. వారు వెంటనే పరిశీలించి 21 రోజుల్లోగా అనుమతులు మంజూ రు చేయాల్సి ఉంటుంది.  

 క్షేత్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీ..

భవన నిర్మాణ అనుమతులు స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ఏర్పాటు కానున్నాయి. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరణలో తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందితే దరఖాస్తుదారుపై కఠిన చర్యలు తీసుకోనున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణం కూల్చివేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తారు. భవన నిర్మాణ అనుమతుల్లో ఇబ్బందులుంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ (22666666)కు ఫిర్యాదు చేయవచ్చు.  

 మరో వారం పది రోజుల్లో అమల్లోకి..

మరో వారం పది రోజుల్లో టీస్‌ బీపాస్‌ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు గ్రేటర్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం డీపీఎంఎస్‌ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్న కార్పొరేషన్‌, ఇక నుంచి టీఎస్‌ బీపాస్‌ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నది. దీనిపై ఇప్పటికే సర్వేయర్లకు అవగాహన కల్పించింది.