మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Sep 27, 2020 , 06:13:33

ఓరుగల్లు.. పర్యాటక హరివిల్లు

ఓరుగల్లు.. పర్యాటక హరివిల్లు

  • ఉమ్మడి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన టూరిజం కేంద్రాలు కాకతీయుల నిర్మాణాలు.. 
  • మరెన్నో సుందర ప్రదేశాలు
  • కనువిందు చేస్తున్న బొగత, ముత్యంధార, ఇతర జలపాతాలు
  • రారమ్మని ఆహ్వానిస్తున్న రామప్ప, లక్నవరం, పాకాల సరస్సులు
  • కొత్తగా పీవీ స్వస్థలాన్ని టూరిజం స్పాట్‌గా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు
  • నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

అంతులేని శిల్ప సౌందర్యం.. అద్భుత కళాఖండాలతో నిర్మితమైన రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్‌.. చుట్టూ ఎత్తయిన కొండలు.. మధ్యలో దివిటీలు.. పక్షుల కిలకిలా రావాలు, బోటింగ్‌తో అలరిస్తున్న లక్నవరం, పాకాల సరస్సులు.. గుట్టలపై నుంచి జాలువారుతూ కనువిందు చేస్తున్న బొగత, ముత్యంధార ఇతర జలపాతాలు.. జంతువులు, పక్షులు, ట్రెక్కింగ్‌, రైడింగ్‌తో ఆకట్టుకుంటున్న ఏటూరునాగారం అభయారణ్యం.. తాడ్వాయి వన కుటీరాలు, రాక్షస గుహలు.. ఇవన్నీ కలిసి ఓరుగల్లు పర్యాటక హరివిల్లుగా విలసిల్లుతున్నది. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం..                          

                   - వరంగల్‌ కల్చరల్‌/ములుగు

టూరిజంపై అవగాహన కల్పించడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించేలా ఏటా సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ 1980 నుంచి ఓ ప్రత్యేక థీమ్‌ తో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టూరిజం అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌పై నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. జిల్లాలోని పలు ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా ప్ర ఖ్యాతి గాంచాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత చారిత్రక ప్రదేశాల్లో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు పట్టణంలో ఆనాటి కట్టడాలు నేటికీ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, భద్రకాళీ దేవస్థా నం, ఖిలా వరంగల్‌, పాకాల వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్వదేశీయులతోపాటు ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు.

పీవీ ఊరును  పర్యాటక కేంద్రంగా..

మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ పీవీ ఊరు వంగరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా పీవీ వాడిన వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. పీవీ స్వస్థలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. 

కరోనాతో ఆదాయానికి గండి

కరోనా వైరస్‌ నేపథ్యంలో పర్యాటక రంగం ఎక్కువగా నష్టపోయింది. మార్చి 22 నుంచి సందర్శకులను అనుమతించలేదు. ఈ ఏడాది జిల్లా పర్యాటక శాఖకు దాదాపు రూ.2 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి బొగత జలపాతం వద్దకు సందర్శకులకు అనుమతించనున్నట్లు ములుగు డీఎఫ్‌వో ప్రకటించారు. 

రామప్పకు యునెస్కో గుర్తింపు దిశగా..రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు గతేడాది యునెస్కో టీం సందర్శించిన విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపు లభిస్తే ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అంత ర్జాతీయ ప్రమాణాలతో అన్ని విధాలుగా తీర్చుదిద్దుతారు. 

సామాజిక, ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం దోహదం

సామాజిక, ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం ఎంతో దోహదం చేస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తున్నది. టూరిజం ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నది. అందులో భాగంగానే అర్బన్‌ జిల్లా పరిధిలో పురావస్తు ప్రదర్శనశాల అభివృద్ధి పనులకు రూ. 3.49 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. ఎకో టూరిజం, అడ్వెంచర్‌, చారిత్రక కట్టడాల పునర్నిర్మాణాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మల్టీపర్పస్‌ కల్చరల్‌ కాంప్లెక్స్‌ అభివృద్ధి పనులను రూ.4కోట్లతో చేస్తున్నారు. ధర్మసాగర్‌ సరస్సు, ఐనవోలు, ముప్పారంలో చారిత్రక నిర్మాణాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో శిల్పారామం, థీమ్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో టూరిజం, అటవీ శాఖ సంయుక్తంగా పాండవుల గుట్టల పరిసర ప్రాంతాల్లో నైట్‌ క్యాంపెయినింగ్‌, హెరిటేజ్‌ వాక్‌, సైక్లింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది టూరిజం అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ థీమ్‌లో భాగంగా తాడ్వాయి, ఏటూరు నాగారం అభయారణ్యంలో బుల్లోకార్ట్‌ రైడింగ్‌, ట్రెక్కింగ్‌ వంటి సాహస కార్యక్రమాలకు నడుంబిగించింది. ఎకో టూరిజంలో భాగంగా గట్టమ్మ, మల్లూరు, మేడారం, లక్నవరం వంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసేందుకు, వారికి సదుపాయాలు కల్పించేందుకు హరిత కాకతీయ హోటళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 

డిజిటల్‌ మార్గంలో పర్యాటక దినోత్సవం..


కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని డిజిటల్‌ మార్గంలో నిర్వహించేందుకు సన్న ద్ధమవుతున్నాం. మూడు రోజుల పర్యాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం యోగా శిక్షణను ఏర్పాటు చేశాం. సోమవారం ఖిలావరంగల్‌ కోటలో హెరిటేజ్‌ వాక్‌, మంగళవారం గ్రామీణాభివృద్ధిపై ఆన్‌లైన్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నాం. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పర్యాటక రంగ అభివృద్ధికి అటవీ శాఖతో కలిసి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

- శివాజీ, జిల్లా పర్యాటక శాఖాధికారిlogo