ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Sep 26, 2020 , 02:33:06

నాలాల విస్తరణపై మంత్రి కేటీఆర్‌ ఆరా

నాలాల విస్తరణపై మంత్రి కేటీఆర్‌ ఆరా

  • స్వయంగా గ్రేటర్‌ కమిషనర్‌తో మాట్లాడిన అమాత్యుడు
  • ఆక్రమణల కూల్చివేతల వివరాలు పంపాలని ఆదేశాలు

వరంగల్‌, సెప్టెంబర్‌ 25 : నగరం ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు నగరంలోని అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి నగరానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు నాలాల ఆక్రమణలే నగర ముంపునకు కారణమని ప్రజలు చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి నాలాలపై ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

కాగా, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం స్వయంగా గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతికి ఫోన్‌చేసి నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎన్ని ఆక్రమణలు గుర్తించారు? ఎన్ని తొలగించారంటూ మంత్రి కమిషనర్‌ను ప్రశ్నించారు. దసరా నాటికి నాలాల విస్తరణతో పాటు  ఆక్రమణల తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికివరకు 70 శాతం ఆక్రమణల తొలగింపు పూర్తి చేశామని  కమిషనర్‌ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ప్రతి నాలా వంద ఫీట్లు ఉండేలా మార్కింగ్‌ చేస్తూ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నామని మంత్రికి చెప్పారు.  నాలాల విస్తరణ, ఆక్రమణల కూల్చివేతల వివరాలు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను తనకు పంపించాలని మంత్రి కమిషనర్‌ను ఆదేశించారు. 

కూల్చివేతల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. త్వరలోనే వరంగల్‌ పర్యటనకు వస్తానని మంత్రి కేటీఆర్‌ కమిషనర్‌తో అన్నట్లు తెలిసింది. సోమవారం నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై సమీక్షించేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వరంగల్‌కు వస్తున్నారని మంత్రి కమిషనర్‌కు తెలిపినట్లు సమాచారం. 


logo