ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Sep 25, 2020 , 01:46:53

క‌రోనా కామ‌నే

క‌రోనా కామ‌నే

 • వైరస్‌ ఇప్పుడు సాధారణం
 • జనజీవనం యథాతథం
 •  పుంజుకున్న వ్యాపారాలు
 • జాగ్రత్తలు పాటిస్తూనే ఆఫీసులకు.. పనులకు
 • నిత్యావసరాలుగా మాస్కులు, శానిటైజర్లు
 • భౌతికదూరానికి అలవాటు పడిన ప్రజలు
 • ఆలింగనాలకు మంగళం.. కరచాలనాలకు చెల్లు
 • ఆరోగ్యంపై పెరిగిన చైతన్యం
 • వీధుల్లోకి అన్నివర్గాల వారు
 • వైరస్‌ బారిన పడినా ఎదుర్కొంటూ ముందుకు
 • మహమ్మారి ముందులానే తాజా పరిస్థితులు

మొదట ఎక్కడో చైనాలో కరోనా వెలుగుచూసిందనగానే ఇక్కడ అలజడి రేగింది.. తర్వాత ఇతర దేశాలకు పాకి.. మన దేశంలోని కేరళలో తొలి కేసు నమోదు కాగానే అందరిలో వణుకుమొదలైంది. వైరస్‌ విజృంభించి.. నలుదిశలా విస్తరిస్తూ రావడంతో ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేత పెట్టుకుని బతకాల్సి వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొవిడ్‌ అందరినీ చుట్టుముట్టి విలయతాండవం చేసింది. ఆరోగ్యపరంగా చాలా చిక్కులు తెచ్చిపెట్టి కొందరి ప్రాణాలను కూడా హరించింది. మార్చి నుంచి ఆరు నెలలుగా భయంభయంగా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ మార్పు కనిపిస్తున్నది. జాగ్రత్తలు పాటిస్తే కరోనాతో ఏమీకాదనే ధీమా వచ్చింది. ఆ ధైర్యమే ఇప్పుడు జనజీవనాన్ని సాధారణ స్థితికి తెచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మాస్కులు, శానిటైజర్లు నిత్యావసరాలుగా మారగా భౌతికదూరం అలవాటైంది. ఒకవేళ ‘పాజిటివ్‌' వచ్చినా ‘పాజిటివ్‌'గానే ఎదుర్కొని ముందుకెళ్లేంత చైతన్యం వచ్చింది.   

 వరంగల్‌ ప్రతినిధి/జనగామ, నమస్తే తెలంగాణ : కరోనా.. నిన్నమొన్నటిదాకా ఈ మాట వింటేనే వణుకు పుట్టేది. ఎక్కడో ఏ దేశంలోనో ఎవరికో వస్తేనే వామ్మో అనే పరిస్థితి. కరోనా నియంత్రణ కోసం ఎవరూ ఊహించని లాక్‌డౌన్‌, ఆ తర్వాత మినహాయింపులైనా కరోనాపై భయం మాత్రం పోలేదు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందంటే ఇరుగుపొరుగు వాళ్ల ఈసడింపులు, ఇంట్లో వాళ్ల ఇబ్బందులు తప్పలేదు. కష్టమొస్తే ఆదుకునే దగ్గరి వారు సైతం భయంతో దూరంగానే ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా కామన్‌ అయ్యింది. కొవిడ్‌తో కలిసి నడవడం తప్పనిసరైంది. జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌తో ఏమీకాదనే ధీమా అందరిలోనూ వచ్చింది. ఆ ధైర్యమే ఇప్పడు జనజీవనాన్ని సాధారణ స్థితికి తెచ్చింది. ఆరు నెలల పాటు భయంతో గడిపిన ప్రజలు, ఇప్పుడు మామూలు జీవితానికి అలవాటు పడ్డారు. ఏం చేస్తే కరోనా రాదు?, కరోనా వస్తే ఏం చేయాలి?  అన్న స్పష్టతతో ఎవరికి వారు సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. వ్యాపారాలు యథావిధిగా నడుస్తున్నాయి. ఇప్పుడు అన్నివర్గాల వారూ వీధుల్లోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్‌, మాస్క్‌ వినియోగిస్తూనే నూటికి 80శాతం  భౌతికదూరం పాటిస్తున్నారు. జేబులు, హ్యాండ్‌బ్యాగుల్లో శానిటైజర్లు పెట్టుకోవడం సహజమైపోయింది. ఎక్కడికి వెళ్లినా గతంలో లాగా ఆలింగనం చేసుకోవడం మానేశారు. కరచాలనం చేయడం మర్చిపోయారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఒకరినొకరు తగులకుండా మాట్లాడుకుంటున్నారు.

పుంజుకుంటున్న మార్కెట్‌

కరోనాతో ఆగమైన మార్కెట్‌ మళ్లీ పుంజుకుంది. ఏ వ్యాపారం ఎలా ఉంటుందో అన్న ఆందోళనలు, అనుమానాలు తొలగిపోతున్నాయి. కరోనా ముందులానే అన్నీ చక్కబడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, బట్టలు, బోల్లు, మోటరు సైకిళ్లు, కార్లు, బంగారం దుకాణాలు, కంప్యూటర్‌ షాపులు, సెల్‌ ఫోన్‌ దుకాణాలు ఏవి చూసినా పూర్వ స్థితికి మారినట్లే కనిపిస్తున్నాయి. గతంలో పొద్దున, సాయంత్రం ఉండే కొనుగోలుదారుల హడావుడి ఇప్పుడు రోజంతా ఉంటున్నది. అన్ని వ్యాపార సంస్థల్లోనూ కరోనా నివారణ జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తున్నారు. వ్యాపారాలకు పాత పరిస్థితి రావడానికి ఈ జాగ్రత్తలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. శానిటైజర్‌, మాస్క్‌, భౌతికదూరం పాటించే షాపులకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఒక్కొక్కటిగా దుకాణం, మాల్‌, హోటల్‌ అన్నీ తెరుచుకున్నాయి. హన్మకొండ, వరంగల్‌, కాజీపేట ఎక్కడ ఏ షాపులో చూసినా జనం కిటకిటలాడుతున్నారు. నగరంలో కార్లు, మోటరు సైకిళ్ల హారన్‌ మోతలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వాహనాల రద్దీ ఉంటున్నది. ఆర్టీసీ బస్సులు నిండిపోతున్నాయి. సోమవారం హైదరాబాద్‌కు వెళ్లాలంటే సీటు దొరికే పరిస్థితి లేదు. శుక్రవారం, శనివారం హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు రావాలన్నా ఇదే పరిస్థితి.  నెల రోజులుగా దాదాపుగా సాధారణ స్థితికి మారిపోయింది.  

ప్రజల్లో అవగాహన పెరిగింది 


కరోనాతో మూడు నెలలు గడపదాటని ప్రజలు ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే పనులకు పోతున్నం. మాస్కులు లేకుండా దాదాపు ఎవరూ బయటికి రావడం లేదు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది.

-అమరిశెట్టి అశ్విని, గృహిణి, వరంగల్‌ logo