మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Sep 24, 2020 , 06:32:10

పల్లెల్లో పర్మినెంట్‌ నర్సరీలు

పల్లెల్లో పర్మినెంట్‌ నర్సరీలు

  • సర్కారు స్థలాల్లోనే ఏర్పాటుకు నిర్ణయం    
  •  నిర్వహణ బాధ్యత పూర్తిగా పంచాయతీలదే     
  •  ప్రతి నర్సరీలో 10వేల మొక్కల పెంపకం తప్పనిసరి  
  •  ఏడో విడుత నుంచి ఇంటికి ఆరు మొక్కలు అందేలా ప్లాన్‌   

శాయంపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారాన్ని మరింత పకడ్బందీగా మారుస్తున్నది. ఇప్పటికే ఊరికో నర్సరీని ఏర్పాటు చేయగా ఇక నుంచి సర్కారు భూముల్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నర్సరీలో పదివేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని లక్ష్యం నిర్దేశించింది. వచ్చే ఏడో విడుత హరితహారంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

నర్సరీలు, హరితహారం నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించి సర్పంచ్‌, కార్యదర్శులకు జాయింట్‌ బ్యాంకు ఖాతాను తెరిచారు. ఇటు గ్రీన్‌ప్లాన్‌ తయారీలో పంచాయతీ కార్యదర్శులు తలమునకలయ్యారు. ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించనుండగా, ‘వనసేవక్‌'ల నియామకంతో పాటు జీపీలే అన్నింటినీ చూసుకోవాలని, వచ్చే నెల మొదటి వారం నుంచి నర్సరీ పనులు మొదలు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.  

సర్కారు స్థలాల్లో శాశ్వత నర్సరీలు

గ్రామాల్లో శాశ్వత నర్సరీల కోసం సర్కారు స్థలాలను ఎంపిక చేసి తీర్మానాలను అధికారులకు అందించాలని కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. గతేడాది ఊరికో నర్సరీని తప్పనిసరి చేసి, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి నీటి సౌకర్యం ఉన్న భూమిని అద్దెకు తీసుకున్నారు. ఎకరం భూమికి నెలకు రూ.3వేల చొప్పున చెల్లించారు. చిన్న నర్సరీలకు నెలకు రూ.వెయ్యి ఇచ్చారు. ఇలా పది నెలలపాటు నర్సరీ స్థలానికి ఉపాధి నిధులను చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు వల్ల మొక్కల పంపిణీ తర్వాత మరోచోటుకు నర్సరీని మార్చాల్సి వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లోనే నర్సరీలు పెట్టాలని ఆదేశాలు రాగా, కార్యదర్శులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనూ నర్సరీల ఏర్పాటుకు అవువైన స్థలం ఉంటే చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. 

ఇక ప్రతి నర్సరీలో 10వేల మొక్కల పెంపకం

ప్రతి ఊరి నర్సరీలోనూ ఇక నుంచి 10వేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని సర్కారు నిర్ణయించింది. పెద్ద గ్రామాల్లో అయితే పదివేలకుపైగా, చిన్న గ్రామాలైతే పదివేలకు తగ్గకుండా పెంచాలి. ఏడో విడుత నుంచి ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రీన్‌ప్లాన్‌ సర్వే ప్రకారం జీపీ తీర్మానం ఇచ్చిన తర్వాత ఈజీఎస్‌ అధికారులు ఎస్టిమేట్‌ చేయనున్నారు. గృహాలకు పండ్లు, పూల మొక్కలు, రైతులకు టేకు మొక్కలు, ఎవెన్యూ, బండ్‌, బ్లాక్‌, ఇతర ప్లాంటేషన్‌ కోసం సర్వే చేసి గ్రీన్‌ప్లాన్‌ రూపొందించాల్సి ఉంటుంది. 

నిర్వహణ బాధ్యత పంచాయతీలకే

హరితహారం, నర్సరీల నిర్వహణ బాధ్యత పంచాయతీలకే అప్పగించారు. ఇందు కోసం సర్పంచ్‌, కార్యదర్శులతో జాయింట్‌ ఖాతాను ఓపెన్‌ చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి అధికారులు నిధులను మాత్రమే ఇస్తారు. జీపీకి సంబంధించి ఈజీఎస్‌ అకౌంట్‌ ద్వారా కార్యదర్శి నుంచి చెల్లింపులు చేస్తారు. సాయిల్‌ కనెక్షన్‌, ఫెన్సింగ్‌ ఏది చేసినా జీపీకే పేమెంట్‌ చేస్తారు. నర్సరీలో బెడ్ల ప్రకారం చెల్లిస్తారు.  కూలీలకు మాత్రం మస్టర్‌ పేమెంట్‌ చేస్తారు. నర్సరీ నిర్వహణకు వనసేవక్‌ను నియమించే అధికారం పంచాయతీలకు ఇచ్చారు. గ్రామంలో జాబ్‌కార్డున్న ఒకరిని ఎంపిక చేయాలి. వనసేవక్‌కు రోజుకు రూ.237 చెల్లిస్తారు. వనసేవక్‌ బెడ్లకు నీళ్లు కొట్టడం, కాపలా ఉండడం లాంటివి చూసుకోవాలి.


logo