బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Sep 23, 2020 , 03:19:40

గోదావరి ఫ్లడ్‌ బ్యాంకుకు నిధులు కేటాయించాలి

గోదావరి ఫ్లడ్‌ బ్యాంకుకు నిధులు కేటాయించాలి

ములుగు/మహబూబాబాద్‌, నమస్తేతెలంగాణ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట వద్ద గోదావరి వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ మేరకు ఫ్లడ్‌ బ్యాంకులు ఏర్పాటు కోసం సుమారు రూ.200 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని నీటి పారుదలశాఖ  అధికారులను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ  మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వెంకటాపురం మండలంలోని పాలెంవాగు, వాజేడు మండలంలోని  మోడికుంట వాగు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, ఆ పనులను వెంట నే  పూర్తి చేయ డం ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా సాగునీరు అందుతుందన్నారు. మిగిలిన పనుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి  పూర్తి  చేయిస్తామన్నారు. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న  సమ్మక్క  బరాజ్‌కు అటవీశాఖ  అనుమతులు వచ్చాయని, త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లాలోని వివిధ వాగులపై 16 చెక్‌డ్యాంల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. శ్రీరాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు ములుగు జిల్లాలో ప్రత్యేక సమావేశం నిర్వహించి,  క్షేత్రస్థాయిలో సమస్యలపై అధ్యయనం చేయాలని కోరగా అధికారులు అంగీకరించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అలా గే, సీతారామ ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం, గార్ల, డోర్నకల్‌ మండలాల్లో కొత్తగా 48,446 ఎకరాల ఆయకట్టు ఏర్పడనుందని మంత్రికి అధికారులు వివరించారు. సమావేశంలో ఎంపీ మాలోత్‌ కవిత, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు.


logo