శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 23, 2020 , 03:19:29

పట్టభద్రుల పోరుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధం

పట్టభద్రుల పోరుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధం

  •  గెలుపే లక్ష్యంగా దూకుడు
  • ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సన్నాహక భేటీలు
  • ఎక్కడికక్కడ సమావేశాలతో గులాబీ జోరు
  • తాజాగా ఓటరు నమోదు షెడ్యూల్‌తో మొదలైన హడావుడి
  • నవంబర్‌ 6 వరకు దరఖాస్తులకు గడువు
  •  జనవరి 18న ఓటర్ల తుది జాబితా వెల్లడి

పట్టభద్రుల పోరుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమైంది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అంతటా నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఓ వైపు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చీఫ్‌ విప్‌ దాస్యం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, తదితర ముఖ్యనేతలంతా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఎన్నికల హడావుడి మొదలైంది.

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలో మరోసారి ఘన విజ యం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. కేసీఆర్‌ సుపరిపాలన ప్రధాన ఎజెండాగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలను ఎన్నికలకు సన్నద్ధం చేయడం, పట్టభద్రుల నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు లక్ష్యంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు ఇప్పటికే దాదాపు అన్ని సెగ్మెంట్లలో  దశకు చేరుకున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌,  ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. అలాగే, మండల స్థాయిలోనూ సమావేశాలు జరుగుతున్నాయి. ‘ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే’ అనే నినాదంతో క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సుపరిపాలన,  పథకాలు ప్రధాన అంశంగా ఎన్నికల ప్రచారం సాగాలని సూచిస్తున్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌కు గట్టి పట్టుంది. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. 2009లో ఉపఎన్నిక జరుగగా అందులోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.  మార్చిలో మరోసారి ఎన్నిక జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. వరంగల్‌,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్న టీఆర్‌ఎస్‌ మరింత ఆధిక్యంతో ఇదే పరంపర కొనసాగించేలా సిద్ధమవుతోంది.

ఈసీ ఏర్పాట్లు మొదలు...

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం 2021 మార్చి 29తో ముగియనుంది. ఆ లోపు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఓటర్ల నమోదు ప్రక్రియకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించింది. ఓటర్ల నమోదు కోసం అక్టోబర్‌ 1న ప్రకటన జారీ చేయనున్నారు. నవంబర్‌ 6 వరకు ఓటర్ల నమోదుకు తుది గడువు కాగా, అన్ని వివరాలను క్రోడీకరించి డిసెంబర్‌ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్‌ 31 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులు, అభ్యంతరాలను 2021 జనవరి 12లోపు పరిష్కరించి, జనవరి 18న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల జాబితా తయారీ ముగియగానే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలుకానుంది.

తాజావార్తలు