బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Sep 15, 2020 , 08:03:41

అక్రమ నిర్మాణాలు తొలగించారా?

అక్రమ నిర్మాణాలు తొలగించారా?

  • వీడియో కాన్ఫరెన్స్‌లో మేయర్‌, కమిషనర్‌ను అడిగిన మంత్రి కేటీఆర్‌
  • 324 నిర్మాణాలకు 68 తొలగించామని వివరణ
  • ఆస్తిపన్నుపై  వడ్డీ మాఫీ గడువు అక్టోబర్‌ 31 

వరంగల్‌, సెప్టెంబర్‌14: నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారా? అని మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ మేయర్‌, కమిషనర్‌ను అడిగారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి  పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌తో కలిసి మేయ ర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణప్రగతి, పబ్లిక్‌ టాయ్‌లెట్లు, ఆస్తిపన్ను వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం, స్వచ్ఛసర్వేక్షన్‌-2021పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా మేయర్‌ మాట్లాడారు. నగరంలో 324 నిర్మాణాలు నాలాలపై ఉన్నట్లు గుర్తించి వాటిలో 68 తొలగించామని మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఇరిగేషన్‌, రెవె న్యూ శాఖలతో సమన్వయం చేసుకుని వంద శాతం ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. కలెక్టర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అక్టోబ ర్‌ 2 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ గడువు అక్టోబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా మరుగుదొడ్ల లక్ష్యాలను సెప్టెంబర్‌ 25 నాటికి సాధించాలన్నారు.


అక్టోబర్‌ 2న నిర్వహించే స్వచ్ఛ దివస్‌ నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని అదేశించారు. ప్రణాళికాబద్దంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 50 శాతమే సాధించారని త్వరలో 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. 

స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. టీయూ ఎఫ్‌ఐడీసీలో నిధులు మంజూరు చేశామని పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌-2021లో వరంగల్‌ ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని కమిషనర్‌ పమేలా సత్పతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే 11 లక్షల మొక్కలు నాటినట్లు ఆమె వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డీ షాహిద్‌ మసూద్‌, బల్దియా ఎస్‌ఈ విద్యాసాగర్‌, సిటీ ప్లానర్‌ నర్సింహరాములు, చీఫ్‌ ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత పాల్గొన్నారు.logo