శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Sep 13, 2020 , 02:21:35

టూరిజం సర్క్యూట్‌గా మార్చుతాం..

టూరిజం సర్క్యూట్‌గా మార్చుతాం..

  • n పీవీ జీవితం అందరికీ ఆదర్శం
  • n సీఎం కేసీఆర్‌ వల్లే అరుదైన గౌరవం
  • n రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,  పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • n గ్రామాన్ని అన్ని విధాలా  అభివృద్ధి చేస్తాం..
  • n పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • n ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యం
  • n గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల  మంత్రి సత్యవతి రాథోడ్‌
  • n ఎంపీ కవిత, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో  కలిసి సందర్శన

నర్సంపేట రూరల్‌, సెప్టెంబర్‌ 12 : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జన్మించిన లక్నేపల్లి గ్రామాన్ని దేశం గర్వించే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామాన్ని టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటుచేయనున్న క్రమంలో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు శనివారం జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు, టూరిజం శాఖ ఎండీ మనోహర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరితతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. తొలుత పీవీ మెమోరియల్‌ ట్రస్ట్‌లోని పీవీ కాంస్య విగ్రహానికి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన రచించిన పుస్తకాలు, ఫొటో ఎగ్జిబిషన్‌, హనుమాన్‌ ఆల యం, శివాలయంతోపాటు ట్రస్ట్‌ చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లక్నేపల్లిని టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేసే విషయమై కలెక్టర్‌ హరిత, పీవీ కుటుంబసభ్యులతో కలిసి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించారు.

అన్ని విధాలా అభివృద్ధికి చేస్తాం : మంత్రి ఎర్రబెల్లి

దేశం గర్వించేలా లక్నేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆర్థిక, రాజకీయ భూసంస్కరణలు చేసి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. ఆయన గొప్పతనం ప్రపంచ నలుమూలలా వ్యాపించేలా సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాజకీయంగా ఎన్నో పదవులు, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా సామాన్య జీవితాన్ని గడిపారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఠపర్యాటకులు వచ్చేలా లక్నేపల్లిని టూరిజం సర్యూట్‌గా మార్చనున్నట్లు చెప్పారు. గ్రామానికి వన్నె తెచ్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా అంతర్జాతీయంగా భారత్‌కు కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన పీవీని సొంత పార్టీ నేతలే విస్మరించగా సీఎం కేసీఆర్‌ అరుదైన గౌరవం కల్పిస్తున్నారని వివరించారు. పీవీ నర్సింహారావు, తన తండ్రి మంచి స్నేహితులని చెప్పిన ఎర్రబెల్లి.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓసారి ఓడిపోయిన తనను భుజం తట్టి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. పీవీ ప్రోత్సాహం, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతోనే మంత్రినయ్యానని వివరించారు.

ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్‌

లక్నేపల్లి గ్రామానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కోట్లాది మంది ప్రజలకు పీవీ ఆదర్శనీయుడని, మారుమూల గ్రామంలో పుట్టి దేశ సమస్యల్ని అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ముందుకుసాగితే భారతదేశం ప్రపంచ దేశాల కంటే అభివృద్ధిలో ముందువరుసలో ఉండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వంలో పీవీ అనేక ఒడిదొడుకులను తట్టుకుంటూ పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడిపించడం గొప్ప విషయమని అన్నా రు. నేటితరం నాయకులు పీవీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ : ఎమ్మెల్యే పెద్ది 

దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని పదవి చేపట్టి దేశానికి మార్గనిర్దేశం చేసిన మహా వ్యక్తి పీవీ నర్సింహారావు అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌తో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని కావడం గర్వించదగ్గ విషయమన్నారు. శత జయంతి ఉత్సవాల పేరిట సీఎం కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అభినందనీయమన్నారు. పీవీ నర్సింహారావు లక్నేపల్లి ముద్దుబిడ్డ అన్నారు ప్రధానమంత్రిగా, బహుభాషావేత్తగా, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

భావితరాలకు స్ఫూర్తి : ఎంపీ మాలోత్‌  కవిత

పీవీ జీవితం భావితరాలను ఎంతో స్ఫూర్తినిస్తుందని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పీవీని ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో పీవీకి అరుదైన గౌరవం దక్కుతున్నదన్నారు. పీవీకి భారతరత్న తెచ్చేలా సీఎం కేసీఆర్‌ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఓం ప్రకాశ్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డిప్యూటీ ఇంజినీర్‌ ఏకాంబరం, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ సీతారాం, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో పవన్‌కుమార్‌, డీపీవో చంద్రమౌళి, ఏసీపీ ఫణీందర్‌, డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌ సీఐ శశికుమారి, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఎంపీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్‌, నర్సంపేట టౌన్‌, రూరల్‌, నెక్కొండ సీఐలు కరుణసాగర్‌రెడ్డి, సతీశ్‌బాబు, తిరుమల్‌, ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు, తహసీల్దార్‌ వాసం రాంమూర్తి, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, లక్నెపల్లి, రామవరం గ్రామాల సర్పంచ్‌లు గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ఉప సర్పంచ్‌ పరాచికపు సంతోష్‌, నాయకులు పాత్కాల కొమ్మాలు, జినుకల శంకర్‌, పిండి నరేందర్‌, దేశింగరావు, ఉపాధ్యాయుడు మాడ్గుల రవీంద్రశర్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పక్కా ప్రణాళికలతో..

లక్నేపల్లిని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భావితరాలు గుర్తుంచుకునేలా లక్నేపల్లిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్‌ సంకల్పమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాము గ్రామాన్ని సందర్శించామన్నారు. తెలంగాణ గడ్డలో పట్వారి నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి పీవీ అని, భూసంస్కరణల చట్టం చేసి మొట్టమొదటగా తన వెయ్యి ఎకరాల భూమిని నిరుపేదలకు పంచి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పీవీ తదనంతరం ఏ ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదని, పార్లమెంట్‌లో కనీసం ఆయన ఫొటో కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో పీవీకి ఖ్యాతిని తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని వివరించారు. అందుకే ఆయన జన్మించిన లక్నేపల్లి గ్రామ విశిష్టతను రాష్ట్ర, దేశ ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, వాటిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి పీవీనేనని, నిస్వార్థానికి, చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. సమైక్య పాలనలో పీవీ చరిత్రను మరుగున పడేశారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అరుదైన గౌరవాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. పీవీ పుట్టిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయినందునే పీవీ చరిత్ర వెలుగులోకి వచ్చిందని వివరించారు. దేశంలో అన్ని రాష్ర్టాలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ప్రపంచ దేశాల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తున్నదన్నారు.


logo