మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Sep 07, 2020 , 08:31:35

పక్కా రోడ్లకు ప్రతిపాదనలు

పక్కా రోడ్లకు ప్రతిపాదనలు

  • రహదారుల పునరుద్ధరణ దిశగా చర్యలు
  • ఇటీవలి భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీ శాఖకు తీవ్ర నష్టం
  • లోలెవల్‌ కాజ్‌వేలకు రూ.120 కోట్లు
  • కల్వర్టుల కోసం రూ.100 కోట్లు
  • కార్పొరేషన్‌ పరిధిలో రూ.42 కోట్లు
  • ప్రభుత్వానికి నివేదించిన ఆర్‌అండ్‌బీ
  • శాశ్వత ప్రాతిపదికన చర్యలు : ఎస్‌ఈ

ఇటీవలి భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని రహదారులు, కల్వర్టులు, లో లెవల్‌ కాజ్‌వేలు దెబ్బతినగా ఆర్‌అండ్‌బీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఓ వైపు తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతూనే శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన రహదారులను గుర్తించి అంచనాలు రూపొందించింది. ఈమేరకు 50కిలోమీటర్ల బీటీ రోడ్ల కోసం రూ.20 కోట్లు, కార్పొరేషన్‌ పరిధిలో 60 కిలోమీటర్ల రోడ్లకు రూ.47 కోట్లు, లో లెవల్‌ కాజ్‌వేలకు రూ.120 కోట్లు, కల్వర్టుల కోసం రూ.100 కోట్లు మొత్తం రూ.262 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

     వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పాత కాజ్‌వేలు సైతం తెగిపోవడంతో రహదారులు, భవనాల శాఖకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మునుపెన్నడూ లేని విధంగా దాదాపు వారం రోజులు రోడ్లన్నీ వరద నీటిలో మునగడంతో కోతకు గురయ్యాయి. దీంతో అన్ని స్థానిక(పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, కార్పొరేషన్‌) రాష్ట్ర, జాతీయ రహదారులకు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేగాక తక్షణసాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.25 కోట్లు మంజూరు చేశారు. అంతేగాక శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై అంచనాలు రూపొందించాలని ఆదేశించడంతో ఆయా జిల్లాల్లో రాష్ట్ర రహదారులను భవనాల శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి చేపట్టాల్సిన రహదారులను గుర్తించింది. వీటికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రోడ్లు, భవనాల శాఖ వరంగల్‌ సర్కిల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో దెబ్బతిన్న కాజ్‌వేలు, వంతెనలపై సమగ్ర నివేదికలు తయారుచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు కొట్టుకుపోయినట్లు గుర్తించి, పునరుద్ధరణ కోసం దాదాపు రూ.20కోట్లతో అంచనాలు తయారు చేసింది. అదేవిధంగా ఇప్పటికే గుర్తించిన, నిర్మాణంలో ఉన్న దాదాపు 25 బ్రిడ్జీలకు రూ.120 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కల్వర్టుల కోసం మరో రూ.100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

కార్పొరేషన్‌ పరిధిలో భారీగా..

వరంగల్‌ మహానగరపాలక సంస్థ పరిధిలో ఎక్కువ నష్టం జరిగింది. నగరంలో మొత్తం 130 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉండగా వీటిలో 60 కి.మీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలోని రోడ్లకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేయగా కొంత ఖర్చుచేశారు. అలాగే, దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ.47కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

నివేదికలు పంపాం..

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతు చేశాం. చాలా ప్రాంతాల్లో రెండు, మూడు రోజులు నీటమునగడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వరంగల్‌ సర్కిల్‌లోని ఆరు జిల్లాల్లో దెబ్బతిన్న కాజ్‌వేలు, బీటీ రోడ్లు, మరమ్మతు చేయాల్సిన వంతెనలను గుర్తించాం. రహదారుల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది. గ్రామాల నుంచి మండల కేంద్రానికి, మండలకేంద్రం నుంచి జిల్లాకేంద్రాలకు సింగిల్‌ రోడ్లు, డబుల్‌రోడ్లు వేసుకున్నాం. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపించాం.

- ఏ.నాగేందర్‌రావు, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీlogo