శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Sep 04, 2020 , 07:01:09

పల్లెప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు

పల్లెప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు

  • జీపీల్లో ఇంటి పన్ను నివేదికలు  రోజువారీగా పంపాలి 
  • హరితహారం నిర్దేశితలక్ష్యసాధనకు కృషి చేయాలి
  • శ్మశానవాటికలు, కంపోస్టు షెడ్లను త్వరగా పూర్తి చేయాలి
  • సమీక్షా సమావేశంలో కలెక్టర్‌రాజీవ్‌గాంధీ హన్మంతు 

 హన్మకొండ, సెప్టెంబర్‌ 03 : ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. పల్లెప్రగతిలో చేపట్టిన శ్మశానవాటికలు, కంపోస్టు షెడ్ల నిర్మాణాలు, హరితహారం, గ్రామ పంచాయతీల ఇంటి పన్నుల వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు, నర్సరీల పెంపకం, అర్హులైన వారికి కొత్తజాబ్‌ కార్డుల జారీ, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శ్మశానవాటికలు, కంపోస్టు షెడ్ల నిర్మాణాల పనుల్లో వేగం పెంచాలన్నారు. సాధించిన పనుల ప్రగతి, అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాలను రోజువారీగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. సర్పంచ్‌లతో సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించాలని, అలసత్వం వహించొద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గ్రామాల్లో తప్పకుండా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు శ్రమించాలన్నారు. పంచాయతీలకు కేటాయించిన లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త జాబ్‌కార్డులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  2019-21ఆర్థిక సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను వసూలు చేయాలన్నారు. రోజు వారీగా వసూళ్ల నివేదికలను సమర్పించాలని డీపీవోను ఆదేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. పంచాయతీ పరిధిలోని స్థలాలు, ప్లాట్లను క్రమబద్ధీకరించడంలో  రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి జీపీలో నర్సరీలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎస్‌ ప్రసూనారాణి, డీపీవో మొహమూది, ఏపీడీ ఎన్‌ శ్రీవాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.