శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 01, 2020 , 05:17:15

త్వరలో ‘విహంగ’ కల సాకారం

త్వరలో ‘విహంగ’ కల సాకారం

  • స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి
  • పంచాయతీరాజ్‌ శాఖ  మంత్రి దయాకర్‌రావు
  •  కలెక్టర్‌, ఎయిర్‌పోర్ట్‌ అధికారులతో చర్చించిన  మంత్రి

మామునూరు: సీఎం కేసీఆర్‌ నాయకత్వం, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కృషితో త్వరలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కల సాకారం కానున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. విమానాశ్రయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కేంద్ర బృందం భూ స్వభావ పరీక్షలు చేస్తున్న క్రమంలో సోమవారం ఆయన చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలసి ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించారు. ఆ తర్వా త కలెక్టర్‌, ఎయిర్‌పోర్ట్‌ అధికారులతో చర్చించారు. మొత్తం 1140 ఎకరాల స్థలం అవసరమని, ప్రస్తుతం ఏఏఐ ఆధీనంలో 706 ఎకరాలుందని, మరో 430 ఎకరాలు కావాలని అధికారులు మంత్రికి చెప్పారు.

ఈ మేరకు స్థలం సేకరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌ కోసం మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే చాలాసార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపడమే గాక తుది దశకు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ అధికారులు, ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమా ర్‌ పాల్గొన్నారు.