మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Aug 30, 2020 , 03:19:11

‘మామునూరు’కు ప్రత్యేక బృందం

‘మామునూరు’కు ప్రత్యేక బృందం

  • నేటి నుంచి ఎయిర్‌పోర్ట్‌ స్థలంలో 
  • భూ స్వభావ పరీక్షలు
  • నాలుగైదు రోజులు టెస్టులు
  • ఫలిస్తున్న రాష్ట్ర సర్కారు చర్యలు

(వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ మామునూరు)

మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఢిల్లీలో పట్టణాభివృద్ధి, పౌరవిమానాయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసి మామునూరు విమానాశ్రయ విషయాన్ని త్వరగా తేల్చాలని కోరిన నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందించారు. వారం పదిలోజుల్లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందాన్ని క్షేత్రస్థాయిలోకి పంపి పూర్తి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో శనివారం మామునూరు విమానాశ్రయానికి ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సమగ్ర భూస్వభావ పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక అంశాలను పరీక్షించేందుకు ప్రత్యేక బృందా లు దిగాయి.

  ఇప్పటికే రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి తొలి, మలి నివేదికలు అందచేసింది. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కావాల్సిన భూమికి సంబంధించిన స్పష్టత వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏఏఐ పరిధిలో 706 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నది. రన్‌వే, అఫీషియల్స్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌ మొదలైన ఏర్పాట్లు చేయటానికి మరో 430 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని, దీని కోసం రెవెన్యూ శాఖ ఖిలా వరంగల్‌ మండల పరిధిలోని నక్కలపెల్లి, గాడిపెల్లి గ్రామాల్లో ల్యాండ్‌ ఎంజాయ్‌మెంట్‌ సర్వేకూడా పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్లు భవనాల శాఖ, ఏఏఐ డీపీఆర్‌ కోసం నియమించిన క్రియేటివ్‌ కన్సల్టెన్సీ బృందాలు నాలుగైదు పర్యాయాలు సర్వే పూర్తి చేశాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి నాలుగైదు రోజులపాటు మామునూరు విమానాశ్రయ ప్రాంతంలో జియోటెక్నాలజీ బృందాలు భూస్వభావ పరీక్షలు నిర్వహించి సదరు నివేదికను ఏఏఐకి అప్పగించిన తర్వాత భూసేకరణకు కావాల్సిన లాంఛనాలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయ కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై  చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి, చేస్తున్న ఒత్తిడికి నిదర్శనంగా ప్రస్తుత పనులు నిలవడం విశేషం.  logo