గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Aug 28, 2020 , 04:01:54

సాకారం దిశగా ‘విహంగ’ ఆశలు

సాకారం దిశగా ‘విహంగ’ ఆశలు

  • మామునూరు ఎయిర్‌పోర్టుపై సెంట్రల్‌లో కదలిక
  • తాజాగా కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ విన్నపం
  • ఫలిస్తున్న రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు 
  • తుది దశకు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు
  • తొలి దశ సర్వేలు పూర్తి.. రెండు గ్రామాల్లో స్థలం గుర్తింపు 
  • ఒకట్రెండు రోజుల్లో పరిశీలన బృందం రాక 

వరంగల్‌ మామునూరు విమానాశ్రయంపై దశాబ్దాలుగా నెలకొన్న ప్రతిష్టంభన రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తొలిగిపోతున్నది. ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధరణ కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు రెండేళ్లుగా తెస్తున్న ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం దిగివస్తున్నది. నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌, ఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ను కలిసి మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ఇక్కడికి ప్రత్యేక పరిశీలన బృందం రానున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొన్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఒప్పందం మేరకు డీపీఆర్‌ రూపొందుతుండగా ఉమ్మడి జిల్లావాసుల్లో ‘విహంగ’ ఆశలు చిగురిస్తున్నాయి.     - వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్‌ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణపై ఉమ్మడి జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ కోసం రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శా ఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ను కలిశారు. మామునూరు విమానాశ్రయాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. విమానాశ్రయానికి ఉన్న భూమి ఎంత? ఇంకా సేకరించాల్సింది ఎం త? తదితర వివరాలను కేంద్రానికి సమర్పించారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇం డియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డీపీఆర్‌ రూపొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రహదారు లు, భవనాల శాఖ, ఏఏఐ నుంచి క్రియేటివ్‌ కన్సల్టెన్సీ డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారీలో తలమునకలయ్యాయి. ఇప్పటికే నాలుగైదు దఫాలుగా క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా పూర్తయ్యాయి. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ చేసి న విజ్ఞప్తి మేరకు నాలుగైదు రోజుల్లో ప్రత్యేక పరిశీలన బృందం ఇక్కడికి రానున్నట్లు అధికారయంత్రాంగం తెలిపింది. భూ పరీక్షలు చేసిన తర్వాత డీపీఆర్‌ తుదిరూపు దాల్చే అవకాశముందని వివరించింది. 

ఇదీ నేపథ్యం..  

ప్రస్తుతం అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మం డలంలో ఉన్న మామునూరులో 1930లో ఏ డో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ విమానాశ్రయాన్ని నిర్మించారు. మామునూరు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ విమానాశ్రయాలను హైదరాబాద్‌ బేగంపేట్‌, హకీంపేట విమానాశ్రయాలకు అ నుసంధానంగా నెలకొల్పారు. సిర్పూర్‌లో పేపర్‌మిల్లు, వరంగల్‌ ఆజంజాహి మిల్లు కార్యకలాపాల పర్యవేక్షణ కోసం, దేశ, విదేశీ వ్యాపారాల కోసం వీటిని ఏర్పాటు చేశారు. 1875 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు 6.6కిలోమీటర్ల రన్‌వేతో మామునూరు విమానాశ్ర యం అప్పట్లో దేశంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పైలట్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌, పైలట్‌ శిక్షణ కేంద్రం కూడా ఉండేవి. ఇండో-చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయం అంత శ్రేయస్కరం కాదని, అక్కడి నుంచి అనేక విమానాలను ఇక్కడికి తెచ్చి రక్షణ కోసం ఉంచిన చరిత్ర మామునూరు విమానాశ్రయానికున్నది. ఇక్కడ జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ సహా అనేక మంది ప్రధానులు సైతం దిగారు. 1981దాకా వాయుదూత్‌ స ర్వీసులు నడిచాయి. రానురాను కనుమరుగు కాగా, తర్వాత పునరుద్ధరణకు అవకాశం వచ్చి నా సీమాంధ్ర పాలకుల కుట్రలతో అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2007లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి మ ధ్య ఒప్పందం కుదిరినా, పాలకుల కుతంత్రాలతో నీరుగారిపోయింది.

మామునూరు, కడ ప విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని ఒ ప్పందాలు చేసుకున్నా మామునూరును పక్కనబెట్టి కడప ఎయిర్‌పోర్టును పునరుద్ధరించా రు. విశాలమైన మామునూర్‌ విమానాశ్రయ స్థలాన్ని 2012లో హిందూస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టాలని చూశారు. దీంతో మామూనూరు విమానాశ్ర య స్థలంలో వందలాది మంది తెలంగాణవాదులు, ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో ప్రదర్శన ఇచ్చి ‘మా విమానాశ్రయం మాకే దక్కాలి. ప్రైవేట్‌ వ్యక్తులకో, సంస్థలకో అప్పగిస్తే ఊరుకునేది లేదు’ అని తీవ్రస్థాయిలో నిరసన తెలుపడంతో ఆ ప్రతిపాదనను అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి. అనంతరం దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమకు వరంగల్‌లో శంకుస్థాపన చేసిన రోజు సీఎం కేసీఆర్‌ త్వరలోనే మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు.logo