సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Aug 22, 2020 , 03:51:14

దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలి

దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలి

  •  చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ/నయీంనగర్‌ : నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు ధ్వంసమైనందున రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల వివరాలు సేకరించి,

వాటిని పునరుద్ధరించడానికి అంచనాలను  సిద్ధం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు రానివ్వొద్దన్నారు. ప్రస్తుతం వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులు ఆలస్యమవుతున్నాయని, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాజీపేట, ప్రశాంత్‌నగర్‌, ఎస్‌బీహెచ్‌ కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, మంగళవారం వరకు ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, వరదలకు దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎక్కడైనా కొత్త రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  


logo