ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Aug 22, 2020 , 03:51:12

వీడని వరద

వీడని వరద

  • పలుచోట్ల తెగిన రోడ్లు
  • నీట మునిగిన పంటలు
  • నగరంలో ఇంకా నీళ్లలోనే పలు కాలనీలు
  • ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : ఉమ్మడి జిల్లాను వరద వీడడం లేదు. శుక్రవారం సైతం మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా, చెరువులు మత్తళ్లు పోస్తూనే ఉన్నాయి. రెండు మూడు చోట్ల చెరువులు తెగిపోయి వరదతో రోడ్లు ధ్వంసమయ్యాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్‌ నగరంలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పంటలు, ముంపు ప్రాంతాలను ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పి పరిహారం అందేలా చూస్తామన్నారు.

జనగామ జిల్లాలో వల్మిడి వాగు వరద ఉధృతికి వల్మిడి-మంచుప్పుల రోడ్డు తెగి రాకపోకలు బందయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలో రామప్ప సరస్సు మత్తడి పడి ఎగువ ప్రాంతాలకు వరద నీరు చేరింది. దీంతో అధికారులు తూము షెటర్లను పైకి లేపి దిగువ ప్రాంతానికి భారీగా నీటిని విడుదల చేశారు. జంగాలపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. జంపన్నవాగు వరద ఉధృతి తీవ్రంగానే కొనసాగుతున్నది. రామన్నగూడెం పుష్కరఘాట్‌, కమలాపురం ఇన్‌టేక్‌వెల్‌, పేరూరు వద్ద గోదావరి పొంగి పొర్లుతున్నది. వట్టివాగు వరదతో కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది. కొండాయి,

వెలిశెట్టిపల్లి, అద్దెల వెంకటాపురం, పాపయ్యపల్లి పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకోగా అక్కడి ప్రజలను నాలుగు బోట్ల ద్వారా టూరిజం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు 12 ఏళ్ల తర్వాత పూర్తిగా నిండి మత్తడి పడి తెగిపోయింది. సంగెం వాగు జాతీయ రహదారి బ్రిడ్జి కోతకు గురైంది. దీంతో గురువారం రాత్రి నుంచే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరంగల్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.


logo