శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Aug 16, 2020 , 03:28:19

మహానగరాన్ని చుట్టుముట్టిన వరద

మహానగరాన్ని చుట్టుముట్టిన వరద

  • ఉమ్మడి జిల్లాను ముంచెత్తిన వాన
  • సమక్క-సారక్క గద్దెలను తాకుతూ ‘జంపన్న’ ప్రవాహం
  • చెరువులు, వాగుల ఉగ్రరూపం
  • ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలం 
  • నీట మునిగిన పలు గ్రామాలు
  •  పునరావాస శిబిరాలకు ప్రజల తరలింపు
  •  సహాయక చర్యల్లో మంత్రులు, అధికారులు

ఎడతెరిపి లేని వాన వరంగల్‌ ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది. ఐదారు రోజులుగా కమ్ముకున్న ముసురుతో పాటు, రెండు రోజుల నుంచి దంచికొడుతున్న వర్షంతో మహానగరాన్ని వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నది. కుండపోత వర్షాలతో వరద పోటెత్తి చెరువులు, వాగులు ఉగ్రరూపం దాల్చగా మెజార్టీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. సహాయక చర్యల్లో తలమునకలైన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆపదలో ఉన్నవారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. తక్షణ సాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. 

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఐదారు రోజులుగా కమ్ముకున్న ముసురు, రెండు రోజుల నుంచి దంచికొడుతున్న వర్షంతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. మహానగరాన్ని వరద చుట్టుముట్టి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చెరువులు, వాగులు ఉగ్రరూపం దాల్చి మెజార్టీ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి పోటెత్తగా, బయ్యారం, భద్రకాళీ, పాకాల, లక్నవరం, వడ్డెపల్లి చెరువులు, పాలెంవాగు, వట్టివాగు, చలివాగు, మున్నేరు, ఆకేరు వాగులు కలగలిపి జలవిలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని కుండపోతతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శనివారమే కుండపోత పోయగా ఆదివారం కూడా భారీ వర్షాలు పడే అవకావముందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడుతాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో వాన నష్టం అంచనా అటుంచితే ఎలావంటి ప్రాణనష్టం జరకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. 

రికార్డు స్థాయిలో వర్షపాతం 

ఎడతెరిపిలేని వానలకు అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 1401.8మిల్లీ మీటర్లు (సగటున 200.3మీమీ), వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2289.4 మి.మీ (143.32), మహబూబాబాద్‌ జిల్లాలో 1035 మి.మీ (86.2), జనగామ జిల్లాలో 1820.1 మి.మీ (59.1), జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో 1140.4 మి.మీ (103.63), ములుగు జిల్లాలో 1198.4 మి.మీ (133.15) వర్షపాతం నమోదైంది. 

పొంగిపొర్లుతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం 

వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన రామప్ప, లక్నవరం, పాకాల, గణసముద్రం, బయ్యారం మొదలైన భారీ చెరువులు అలుగు పారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులు మత్తళ్లుపడి అనేక ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారి (163)పై  వరంగల్‌-జనగామ మధ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ లో లెవల్‌ కాజ్‌వే నుంచి వరద పారుతుండడంతో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూర్‌ మండలం కటాక్షపురం చెరువు మత్తడి పడి రాకపోకలు స్తంభించాయి. చలివాగు ఉధృతితో ములుగు నుంచి ఏటూరునాగారం మధ్య జంగాలపల్లి వద్ద స్థానిక వాగులు పొంగడంతో జాతీయ రహదారిపై డివైడర్లను తొలగించారు. మహబూబాబాద్‌-నెల్లికుదురు, మహబూబాబాద్‌ ఇల్లంద, ఏటూరునాగారం-మంగపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  

రంగంలోకి మంత్రులు, అధికారయంత్రాంగం 


 వరదల కారణంగా సహాయక చర్యల్లో ఎక్కడా విఘాతం కలగకుండా చూడాలని కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అప్రమత్తం చేశారు. సహాయక, పునరావాస చర్యలపై సమీక్షించారు. ప్రజలు ఆందోళన పడొద్దని భరోసానిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ములుగు జిల్లా రామన్న గూడెం వద్ద గోదావరి 8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. మరో మీటర్‌ వస్తే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.  

వరద ముంపులోమహానగరం

వరంగల్‌ మహానగరం మునుపెన్నడూలేని విధంగా వరదముంపులో చిక్కుకున్నది. దారులన్నీ ఏరుల్లా మారాయి. హన్మకొండ-కరీంనగర్‌వైపు, హన్మకొండ(హంటర్‌రోడ్‌)-వరంగల్‌, హన్మకొండ-వరంగల్‌ మధ్య న రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డెపల్లి, భద్రకాళీ చెరువులు మత్తడి పడుతున్నాయి. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో  అనేక కాలనీల్లో ఇళ్లలోకి వాన నీరు చేరింది. 

అర్బన్‌ జిల్లాలో 12 పునరావాస కేంద్రాలకు 2140 మంది తరలింపు 


హన్మకొండ, వరంగల్‌, ఖిలావరంగల్‌ రెవెన్యూ మండలాల పరిధిలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2140మందిని తరలించినట్లు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో సురక్షిత తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, భోజన వసతి ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. అవసరమైన చోట మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్డీవోకు సూచించారు.  
logo