సోమవారం 28 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 01:55:06

కరువుతీరా వానలు

కరువుతీరా వానలు

  • n జిల్లాలో ఐదు రోజులుగా వర్షాలు
  • n నిండుకుండల్లా జలాశయాలు
  • n పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • n చెరువులను తలపిస్తున్న పొలాలు
  • n పత్తిపంటలో నిలుస్తున్న వర్షపునీరు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన జలాశయాలతోపాటు చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంతేకాకుండా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఖానాపురం మండలంలోని సరస్సు నీటిమట్టం గురువారం సాయంత్రానికి 27.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 30.2 అడుగులు కాగా, మరో 2.4 అడుగుల నీరు చేరితే మత్తడి పోయనుందని అధికారులు తెలిపారు. నర్సంపేటలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, కుంటలు, చెరువులు నిండుతున్నాయి. అలాగే, చెన్నారావుపేట మండలంలోనే పెద్ద చెరువులైన కోపాకుల, జల్లి, అమీనాబాద్‌, పాపయ్యపేట ఊర చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పాపయ్యపేట శివాలోని సుద్దరేవుల ఆనకట్ట మత్తడి పోస్తున్నది. మండలంలోని శంకరంతండాలో బానోత్‌ మోహన్‌కు చెందిన పూరిగుడిసె గోడ కూలిపోయింది. అయితే, ఇంటో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దుగ్గొండి మండలంలోని దుగ్గొండి ఊరచెరువు, తిమ్మంపేట గుండం చెరువు, చలపర్తి సింగరాయ చెరువు మత్తడి పోస్తున్నాయి. వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం చెరువుకు గురువారం గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు సర్పంచ్‌ సతీశ్‌, రైతు నాయకుడు యాకూబ్‌రెడ్డి, ఇతర ప్రముఖులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దామెర మండలంలోని ఊరుగొండ పెద్ద చెరువుతోపాటు పసరగొండ, పులుకుర్తి, ల్యాదెళ్ల, కోగిల్వాయి చెరువులు నిండాయి. చెరువుల్లోని చేపలు బయటకు వెళ్లకుండా మత్స్యకారులు జాలీలు ఏర్పాటు చేశారు.

జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒక్కటైన సంగెం మండలం ఎల్గూర్‌చెరువు గురువారం ఉదయం నుంచి మత్తడి పోస్తున్నది. సంగెం, కుంటపల్లి, కాట్రపల్లి, వెంకటాపురం, కాపులకనపర్తి చెరువుల నుంచి భారీగా వరదనీరు వచ్చి ఎల్గూర్‌చెరువులో చేరుతున్నది. సంగెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చింతలపల్లి-సంగెం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్గూర్‌చెరువు మత్తడి పోస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి గంగమ్మతల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. మత్తడి ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. శాయంపేట మండలంలోని శాయంపేట-మైలారం మధ్య ఉన్న కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. వసంతాపూర్‌, కొప్పుల, పెద్దకోడెపాక, సూరంపేట గ్రామాల పరిధిలోనూ కాజ్‌వేలను వరదలు ముంచెత్తాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చలివాగులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. మూడు రోజులుగా ప్రాజెక్టు అలుగు పోస్తున్నది. రాయపర్తి మండలవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. రాగన్నగూడెం  వనం వారి మాటు, సన్నూరులోని ఊరకుంట చెరువు, రాయపర్తిలో కొత్త చెరువు, మైలారంలోని ఊర కుంట, పెర్కవేడులోని దేవునికుంట పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. మైలారం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌తోపాటు మండలకేంద్రంలోని మంచినీళ్ల చెరువు, రామచెంద్రుని చెరువు ఎస్సారెస్పీ జలాల రాకతో కళకళలాడుతున్నాయి.

కాగా, స్థానికులు సరదాగా చేపలు పడుతున్నారు. గీసుగొండ మండలంలో వాగులు, కుంటలు, చెరువులన్నీ నిండుతున్నాయి. శాయంపేట ఊర చెరువు, మనుగొండలోని నర్సింహుల చెరువు మత్తడి పడుతున్నాయి. పరకాల పట్టణ శివారులోని చలివాగు పొంగి పొర్లుతున్నది. అలాగే, దామెర చెరువు నిండింది. నడికుడలోని మహ్మద్‌షా నల్లమాటు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలోని అన్ని చెరువులు, వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. నెక్కొండ మండలం ముదిగొండలో గడ్డం రామచంద్రుకు చెందిన పెంకుటిల్లు కూలింది. ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి,  సర్పంచ్‌ కొర్లపాటి శైలజా ప్రభాకర్‌, వీఆర్‌వో రాజు పరిశీలించారు. అలాగే, వరుసగా  వర్షాలు కురుస్తుండడంతో మండలంలోని పత్తి చేలు జాలిపట్టిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మరో రెండు రోజులు కురిస్తే పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నెక్కొండ ఏవో సంపత్‌రెడ్డి చెబుతున్నారు.

పర్వతగిరి మండలం కల్లెడ ఆకేరు వాగు ప్రవహిస్తున్నది. గోపనపెల్లి చెరువు మత్తడి పడుతుండగా, కొంకపాక, ఏనుగల్లు, చింతనెక్కొండ, అన్నారం షరీఫ్‌, జమాల్‌పురం, రోళ్లకల్‌ చెరువుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నదని స్థానికులు చెబుతున్నారు. ఆత్మకూరు మండలకేంద్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బయ్య పద్మ ఇల్లు నెలమట్టమైంది. తమకు ఆదుకోవాలని బాధితురాలు అధికారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే, నర్సంపేట పట్టణం 16వ వార్డులోని రాధమ్మ ఇల్లు వర్షానికి కూలింది.  నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువు మత్తడి పోస్తున్నది. గురువారం  17 అడుగులు పూర్తి సామర్థ్యంతో నిండి మూడు ఇంచుల మందంతో అలుగు పోస్తున్నది.  మహేశ్వరం పెద్ద చెరువు కూడా అలుగు పడుతున్నది.


logo