గురువారం 24 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 01:55:06

ఖర్చులేకుండా.. కొట్టాలు

ఖర్చులేకుండా.. కొట్టాలు

  • జాబ్‌ కార్డు ఉండి చురుగ్గా పని చేస్తే చాలు!
  • ఉపాధి హామీ ద్వారా నిధులు
  • గొర్లకు రూ.54వేలు.. పశువులకు రూ.58వేలు
  • వినియోగించుకుంటే మూగజీవాలకు మేలు 

శాయంపేట: జాబ్‌ కార్డు ఉండి, ఉపాధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నవారికి పశువులు, గొర్లు ఉంటే కొట్టాలు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నిర్దేశిత కొలతతో నిర్మిస్తే అయ్యే ఖర్చును ఉపాధి హామీ ద్వారా అందించనున్నది. పంచాయతీ తీర్మానం, వైద్యాధికారి ధ్రువీకరణ ఇస్తే చాలు.. అధికారులే లబ్ధిదారుల వద్దకు వచ్చి పనులు మొదలు పెడతారు. పల్లెల్లో వ్యవసాయమే జీవనాధారం. దానికి అనుబంధంగా పలువురు మూగజీవాలను పెంచుకుంటూ ఉపాధి పొందుతుంటారు. రోజంతా శివారులో మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తోలుకొచ్చి ఆరుబయట వదిలేస్తారు. చెట్టు కింద కట్టేసి ఉంచుతారు. దీంతో వర్షంలో తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవాలు అనేక ఇబ్బందులు పడుతుంటాయి. పలు రోగాల బారిన పడుతూ ఒక్కోసారి మృత్యువాత పడుతుంటాయి. ఈ క్రమంలో వాటికి షెడ్లు నిర్మించి సంరక్షిచేందుకు ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఇందుకోసం ఉపాధి హామీ ద్వారా అవకాశం కల్పిస్తున్నది. 

  • జాబ్‌కార్డు ఉంటే అర్హులే
  • ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉండి, చురుగ్గా పనులకు హాజరవుతూ పశువులు, గొర్లు కలిగి ఉన్నవారికి ప్రభుత్వమే ఉచితంగా షెడ్లు కట్టిస్తున్నది. లబ్ధిదారుకు స్థలం ఉండి పంచాయతీ తీర్మానం తీసుకోవాలి. పశువులు, గొర్లు ఉన్నట్లు మండల పశువైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉపాధి హామీ అధికారులు అంచనాలు వేసి నిధులు అందిస్తారు. ఈజీఎస్‌ అధికారులు నిర్దేశించిన కొలతల ప్రకారం పూర్తి నిధులతో నిర్మించుకోవాలి. ఈజీఎస్‌ లెక్కల ప్రకారం 60 శాతం మెటీరియల్‌, 40 శాతం వేజెస్‌ బడ్జెట్‌ వచ్చేలా పనులుండాలి. పశువులు, గొర్ల కొట్టాలు పూర్తిగా మెటీరియల్‌తోనే నిర్మిస్తారు. లేబర్‌ బడ్జెట్‌ కోసం ఫాంపాండ్‌ పనులను లబ్ధిదారు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో కూలీలకు పని కల్పించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. బడ్జెట్‌ అంచనా ప్రకారం గ్రామ పంచాయతీలు తీర్మానాన్ని అందించాల్సి ఉంటుంది. 
  • పశువులైతే రూ.58వేలు, 
  • గొర్లు, మేకలకు రూ. 54 వేలు

పశువుల కొట్టం నిర్మాణానికి ఈజీఎస్‌ నుంచి రూ.58వేల వరకు అందిస్తారు. షెడ్డును 13 ఫీట్ల పొడవు, 11 ఫీట్ల వెడల్పుతో 3.5మీటర్లలో  యూ షేప్‌లో నిర్మించాలి. ఈజీఎస్‌ సిబ్బంది ముగ్గు పోశాక, లబ్ధిదారే నిర్మించుకోవాలి. షెడ్డులో నాలుగు పశువులను ఉంచవచ్చని అధికారులు చెబుతున్నారు. పూర్తి నిర్మాణం తర్వాతే ఈజీఎస్‌ అధికారులు ఎంబీ రికార్డు చేసి నిధులు మంజూరు చేస్తారు. ఇలా శాయంపేట మండలంలో 46 షెడ్లకు మంజూరు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గొర్లు, మేకల షెడ్లకు రూ.54వేలు అందిస్తారు. పొడవు 4.15 మీటర్లు, రెండు మీటర్ల వెడల్పుతో నిర్మించాలి. యూషేప్‌లో నిర్మించి ముందు భాగంలో జాలి పెట్టాలి. శాయంపేటలో ఇలా 16 గొర్ల షెడ్లకు మంజూరు ఇచ్చారు. ఎందులోనైనా మొదట ఎర్త్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.661 చెల్లిస్తారు. ఆ తర్వాతే మెటీరియల్‌ పనులు చేపట్టాల్సి ఉంటుంది. బిల్లులు మాత్రం నిర్దేశిత కొలతలకే చెల్లిస్తారు.


logo