మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Aug 13, 2020 , 02:50:18

నిరాటంకంగా ఆపరేషన్లు

నిరాటంకంగా ఆపరేషన్లు

  • కరోనా కాలంలోనూ ఎంజీఎంలో కొనసాగుతున్న శస్త్రచికిత్సలు
  • 21 ఆపరేషన్‌ థియేటర్లలో అందుతున్న సేవలు
  • సకల వసతులు.. నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా
  • ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ

వరంగల్‌ చౌరస్తా / పోచమ్మమైదాన్‌ :  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను లెక్క చేయకుండా వైద్యులు తమ వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారు. వివిధ రకాల వ్యాధులు, శారీరక రుగ్మతలతో వస్తున్నవారికి ఆప్యాయంగా సేవలందిస్తూనే అత్యవసర వైద్యసేవలను సైతం కొనసాగిస్తున్నారు. ఎంజీఎంలో ప్రధాన శస్త్రచికిత్సలను నిరాటంకంగా కొనసాగిస్తూ రోగులకు, క్షతగాత్రులకు ప్రాణం పోస్తున్నారు. సాధారణ శస్త్రచికిత్సల కోసం ఐదు ఆపరేషన్‌ థియేటర్లు, చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలకు రెండు, ప్లాస్టిక్‌ సర్జరీల కోసం ఒకటి, పిడియాట్రిక్‌ విభాగానికి ఒకటి, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పేషెంట్ల కోసం ప్రత్కేకంగా ఒక ఆపరేషన్‌ థియేటర్‌ను, న్యూరో విభాగానికి ఒకటి, సీటీ సర్జరీలకు ఒకటి, ఆర్థో(ఎముకలు) విభాగావసరాలకు మూడు థియేటర్లను కలిపి మొత్తం 16 ఆపరేషన్‌ థియేటర్లను, ఇతర అవసరాలకు మరో ఐదు ఆపరేషన్‌ థియేటర్లను మొత్తంగా 21 ఆపరేషన్‌ థియేటర్లను వినియోగిస్తున్నారు. కరోనా కారణంగా ప్రైవేట్‌ హాస్పిటళ్లలో శ్రస్త్ర చికిత్సలు తగ్గినా ఎంజీఎంలో మాత్రం నిరంతరం కొనసాగిస్తున్నారు.  

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, వసతుల ఏర్పాటు

అత్యవసర వైద్యసేవలను అందుబాటులో ఉంచేందుకు ఎంజీఎం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 21ఆపరేషన్‌ థియేటర్లకు ముఖ్యంగా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు మందులు, శస్త్రచికిత్స పరికరాలు, యంత్రాలను సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ వార్డులోని బాధితులకు పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆక్సిజన్‌ ప్లాంటును మూడింతలు విస్తరించే చర్యలు ప్రారంభించారు.

కరోనాతో ల్యాబ్‌ టెక్నీషియన్ల సహవాసం

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ టెక్నీషియన్లు మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు. కరోనా సోకినా భయపడకుండా విధులు నిర్వర్తిస్తూ ఒకరకంగా కరోనాతోనే సహవాసం చేస్తున్నారు. ఎంజీఎంలోని బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఎమర్జెన్సీ, బ్లడ్‌ బ్యాంకుల్లో దాదాపు 58 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, అటెండర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 27 మంది కరోనా బారినపడి క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న 20 మంది సిబ్బంది తిరిగి విధుల్లో చేరారు. కాకతీయ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో నేరుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో వారిని కూడా కరోనా వదలడం లేదు. ఇక్కడ 21 మంది వరకు వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సైంటిస్టులు పనిచేస్తున్నారు. రోజూ రెండు షిఫ్టుల్లో సుమారు 400 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో ఉన్న ఇద్దరు వైద్యులు, మరో ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు కూడా కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉన్నారు. వైరస్‌ సోకినా హోం క్వారంటైన్‌లో ఉంటూ తిరిగి 17 రోజుల తర్వాత విధులకు హాజరవుతూ ఇతరులకు ధైర్యం చెబుతున్నారు. కరోనా సోకుతుందని తెలిసినా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. 

కరోనా బాధితులకు పౌష్టికాహారం

కరోనా బాధితులు రోగ నిరోధకశక్తి పెంచుకునేలా ప్రభుత్వం వారికి పోషకాహారాన్ని అందిస్తున్నది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ మెనూ ప్రకారం పదార్థాలు అందజేస్తున్నది. కొవిడ్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నవారితో పాటు సీనియర్‌ వైద్యులు, వార్డు సిబ్బందికి కూడా జీవో 298 ప్రకారం డైట్‌ ఇస్తారు. ప్రతి జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేషెంట్‌కు రూ.275 చొప్పున, డాక్టర్స్‌, వైద్య సిబ్బందికి రూ.300 చొప్పున, ఇతర ఏరియాల్లో పేషెంట్‌కు రూ.200 చొప్పున, డాక్టర్స్‌, వైద్య సిబ్బందికి రూ.250 చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదయం 7.30 నుంచి 8.30లోపు ఇడ్లీ, పూరి, దోశ, ఊతప్ప, బ్రెడ్‌ అండ్‌ మిల్క్‌, వడ, ఉప్మా తదితరాల్లో ఏదో ఒక టిఫిన్‌ ఇవ్వాలి. టీం టైమ్‌లో ఉదయం 10.30 నుంచి 11 మధ్య కప్‌ టీ లేదా పాలు, 50 గ్రాముల బిస్కట్లు, పేషెంట్‌ పరిస్థితిని బట్టి కొందరికి లెమన్‌ జ్యూస్‌, 50 గ్రాముల మొలకలు అందించాలి. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు లంచ్‌, ఇందులో400 గ్రాముల వైట్‌రైస్‌తో ఏదైనా కూరగాయలతో కర్రీ, ఆకుకూరతో కూడిన పప్పు, సాంబారు ఇవ్వాలి. వంద గ్రాముల పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు, మినరల్‌ వాటర్‌ బాటిల్‌ అందజేయాలి. సాయంత్రం 4 - 5 మధ్య కప్‌ టీ లేదా పాలు, బాదాం, కిస్‌మిస్‌లు, కర్జూర, జీడిపప్పు ఇవ్వాలి. రాత్రి 7.30 - 8గంటల మధ్య వైట్‌రైస్‌, వెజిటబుల్‌ కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు, వాటర్‌ బాటిల్‌, వైద్యులకు అదనంగా ఫ్రైడ్‌రైస్‌ చికెన్‌ కర్రీ అందిస్తారు.

అనుక్షణం అప్రమత్తం 


లాక్‌డౌన్‌లో కొద్ది రోజల పాటు అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే చేసి, సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేశాం. ప్రస్తుతం అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నాం. ఆక్సిజన్‌ సరఫరా, యంత్రాల కోసం ముందస్తు చర్యలు చేపడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. శస్త్రచికిత్సల విభాగాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం.  

- డాక్టర్‌ గోపాల్‌రావు, సర్జికల్‌ విభాగాధిపతి  logo