శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Aug 10, 2020 , 00:40:39

కొట్టుకున్న కాంగ్రెసోళ్లు

కొట్టుకున్న కాంగ్రెసోళ్లు

 కాంగ్రెసోళ్లు కొట్టుకున్నరు.. హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయం సాక్షిగా ఆదివారం బాహాబాహీకి దిగారు. యూత్‌ కాంగ్రెస్‌ దినోత్సవం, క్విట్‌ ఇండియా మూమెంట్‌ డే సందర్భంగా చేపట్టిన జెండాల ఆవిష్కరణ వివాదానికి దారి తీయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి వర్గీయులు ఘర్షణ పడి ఠాణా మెట్లెక్కగా 13మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.   - రెడ్డికాలనీ/వరంగల్‌ క్రైం

రెడ్డికాలనీ : జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయం సాక్షిగా ఆదివారం రెండు వర్గాలవారు కొట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టుకొనే దాకా వెళ్లింది.

ఏం జరిగిందంటే..

యూత్‌ కాంగెస్‌ దినోత్సవం, క్విట్‌ ఇండి యా మూమెంట్‌ డే సందర్భంగా ఆదివారం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం లో రెండు జెండా గద్దెలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ జెండాలు ఎగురవేసి, కేక్‌ కట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాయిని రెండు జెండాలు ఎగురేసి వెళ్లడంపై యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాయిని వర్గీయుల మధ్య గొడవకు దారి తీసినట్లు తెలిసింది. అప్పటివరకు ఆవిర్భావ వేడుకలు సంతోషంగా జరుగగా జిల్లా అధ్యక్షుడు నాయిని కేక్‌ కట్‌ చేసి వెళ్లిపోవడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకోవడమే గాక అక్కడే ఉన్న కర్రలతో దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. తోపులాటలో కుర్చీలపై పడడంతో అవి విరిగిపోయాయి. కేక్‌ కూడా కింద పడి చెల్లాచెదురైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, యూత్‌ కాంగ్రెస్‌ నేతల మధ్య ఎప్పుటినుంచో ఉన్న విభేదాలు యూత్‌ కాంగ్రెస్‌ దినోత్సవం సందర్భంగా మళ్లీ బయటపడ్డాయి. 

కారు అద్దాలు ధ్వంసం..

కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో అక్కడే నిలిపి ఉంచిన కాంగ్రెస్‌ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు కొడుకు కారు అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస్‌రావు గొడవ పడుతున్న నాయకులను ఆపే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు.  

13మందిపై కేసు.. ఆరుగురి అరెస్ట్‌

వరంగల్‌ క్రైం : కాంగ్రెస్‌ ఘర్షణలో ఇరువ ర్గాలపై ఆదివారం కేసులు నమోదైట్లు సీఐ ప త్తిపాక దయాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ జిల్లా అ ధ్యక్షుడి వర్గం, యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి వర్గీ యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేందుకు హన్మకొండ ఠాణా మెట్లెక్కారు. సాయంత్రం వరకు కొనసాగిన హైడ్రామాకు డీసీసీ అధ్యక్షు డు నాయిని రాజేందర్‌రెడ్డి వచ్చి రాజీకుదిర్చేం దుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ దయాకర్‌ తెలిపారు. మిగతా ఏడుగురిని త్వరలోనే ఆరెస్టు చేస్తామని చెప్పారు.