శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Aug 09, 2020 , 00:35:09

కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

  • చీఫ్‌ విప్‌ దాస్యం, ఎమ్మెల్యే నరేందర్‌
  • కేఎంసీలో వైద్యాధికారులతో సమీక్ష

పోచమ్మమైదాన్‌, ఆగస్టు 8 : కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వరంగల్‌లో కరోనా సేవలను ముమ్మరం చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. నగరంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేఎంసీలోని ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో శనివారం వైద్యాధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరిత, కాళోజీ  హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి కేఎంసీలోని సూపర్‌స్పెషాలిటీ

హాస్పిటల్‌లో ఏర్పాటు చేయనున్న 250 పడకల కొవిడ్‌ బ్లాక్‌ పనులను పరిశీలించారు. కరోనా సేవలకు అవసరమైన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, సమీక్షా సమావేశంలో ఎంజీఎంలో అందుతున్న సేవలతో పాటు ఇంకా అవసరమైన సదుపాయాలపై చర్చించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే యూపీహెచ్‌సీల్లో  పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్‌ అందజేస్తుందన్నారు.  ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. బాధితులు అధైర్యపడొద్దన్నారు.

  నగరంలో కరోనా పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా కంటోన్మెంట్‌ జోన్లలో ఉన్న పరిస్థితులు, వైద్యుల పనితీరు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, కరోనా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేస్తున్న ఆహార నాణ్యత తదితర వాటిని అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. కరోనాపై ప్రజలు ఆందోళన పడకుండా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య అనిల్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.