బుధవారం 23 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 08, 2020 , 02:29:46

గ్రేటర్‌ పరిధిలో 12 లక్షల మొక్కలు నాటాలి

గ్రేటర్‌ పరిధిలో 12 లక్షల మొక్కలు నాటాలి

వరంగల్‌, ఆగస్టు 7 : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆగస్టు చివరి నాటికి 12 లక్షల మొక్కలు నాటాలని కమిషనర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌ కౌన్సిల్‌హాల్‌లో కమిషనర్‌ సంబంధిత అధికారులతో శుక్రవారం హరితహారం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారంలో 36 లక్షల మొక్కలు నాటాలని కార్పొరేషన్‌ లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. ఆగస్టు నెలలో 12 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటి వరకు 7 లక్షలు మాత్రమే నాటారని ఆమె అన్నారు. లక్ష్యాలను అధిగమించడంలో వెనుకబడి ఉన్న డివిజన్‌ స్పెషల్‌ ఆఫీసర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వీడి అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేసిన హెల్త్‌అసిస్టెంట్‌ రామ శ్రీధర్‌ను సస్పెండ్‌ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 54వ డివిజన్‌లో మొక్కలను వృథాగా రోడ్లపై పడేయడంతో కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులను డివిజన్‌ స్పెషల్‌ అఫీసర్‌, ఏఈ శ్రీకాంత్‌ నుంచి రికవరీ చేయాలని సీహెచ్‌వోను ఆదేశించారు. భవిష్యత్‌లో మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌ చేస్తానని స్పష్టం చేశారు. మొక్కలకు తప్పనిసరిగా ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, వంద శాతం బతికేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి మొక్కనూ జియో ట్యాగింగ్‌ చేయాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీ చేస్తానని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌, సీహెచ్‌వో సునీత, హరితహారం స్పెషల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు  పాల్గొన్నారు.

13 వరకు మరుగుదొడ్లు పూర్తి చేయాలి

 గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వెయ్యి సీటర్ల సామర్థ్యం కలిగిన ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలను ఈనెల 13 వరకు పూర్తి చేయాలని కమిషనర్‌ పమేలా సత్పతి ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆమె ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. కలెక్టరేట్‌ దగ్గర, జులై వాడ, కుడా కార్యాలయం, పాత బస్‌ డిపో, ఐటీడీఏ కార్యాలయం, టీబీ ఆస్పత్రి, పెద్దమ్మగడ్డ, ఇన్‌కం ట్యాక్స్‌ కార్యాలయం అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతాల్లో పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిషనర్‌ వెంట బల్దియా ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఈఈ లక్ష్మారెడ్డి, డీఈలు రవికుమార్‌, సంతోశ్‌బాబు తదితరులు ఉన్నారు.logo