మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 08, 2020 , 02:25:36

రైల్వే కార్మికుల సంక్షేమమే లక్ష్యం

రైల్వే కార్మికుల సంక్షేమమే లక్ష్యం

కాజీపేట, ఆగస్టు 7 : రైల్వే కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేస్తున్నదని సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ అన్నా రు. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశానుసారం కాజీపేట రైల్వే జంక్షన్‌లో రైల్వే కొవిడ్‌-19 ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేందుకు  భవనాల పరిశీలనకు శుక్రవారం రైల్వే ఉన్నతాధికారుల బృందం సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు ప్రత్యేక రైలులో వచ్చింది. జంక్షన్‌ పరిధిలోని రైల్వే దవాఖాన, కమ్యూనిటీహాల్‌, పాఠశాల, జూనియర్‌ కళాశాల, ట్రాక్షన్‌ డ్రైవర్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ శిక్షణ కేంద్రాలు, వసతి గృహాలను  పరిశీలించారు. అనంతరం డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బారిన రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్నారన్నారు. కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైల్వే కార్మికుల కోసం కొవిడ్‌-19 ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసేందుకు భవనాలను పరిశీలించామన్నారు. రిపోర్టులను ఉన్నతాధికారు లకు అందజేస్తామన్నారు. కాజీపేట జంక్షన్‌ ప రిధిలో త్వరలోనే ఐసొలేషన్‌ వార్డులు ఏర్పా టు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన వెంట ఏడీఆర్‌ఎం (జీ) బాలసుబ్రమణ్యం,  సీఎంఎస్‌  డాక్టర్‌ రవీందర్‌శర్మ, సీనియర్‌ డీఎంవో డాక్టర్‌ నిరంజన్‌, డీఎస్‌టీఈ శివకుమార్‌ కశ్యప్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌కుమార్‌ బెహార్‌, స్టేషన్‌ ఏరియా మేనేజర్‌ పూర్ణచందర్‌రావు తదితరులు ఉన్నారు.

వినతుల వెల్లువ..

జంక్షన్‌ పరిధిలోని రైల్వే కార్మికులు, వారి కుటుంబాలు, విశ్రాంత కార్మికుల కోసం కాజీపేటలోనే కొవిడ్‌ దవాఖానను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ పీసీఎండీ అధికారుల బృందానికి రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. అందజేసిన వారిలో యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు కాలు వ శ్రీనివాస్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్రటరీ పీ రవీందర్‌, ఏడీఎస్‌ పీవీలు, కోఆర్డినేటర్‌ సదానందం, మాజీ అధ్యక్షుడు కర్రె యాదవరెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్‌, రవీందర్‌, వేదప్రకాశ్‌, రాజేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు. 

పరీక్షలు నిర్వహించాలి..

కాజీపేట రైల్వే జంక్షన్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు, విశ్రాంత కార్మికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలంటూ పీసీఎండీకి తెలంగాణ రైల్వే జాక్‌, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ నాయకులు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. సబ్‌ డివిజన్‌లో వివిధ శాఖల్లో పని చేస్తున్న చాలా మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కొందరు ప్రభుత్వ, సికింద్రాబాద్‌ రైల్వే దవాఖాన, హోం క్వారంటైన్‌లో చికిత్సలు పొందుతున్నారని అధికారులకు తెలిపారు.  వినతిపత్రం అందజేసిన వారిలో రైల్వే జేఏసీ కన్వీనర్‌ దేవులపల్లి రాఘవేందర్‌, చైర్మన్‌ కొండ్ర నర్సింగరావు, ఓబీసీ జోనల్‌ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, జాక్‌ కోకన్వీనర్‌ రమేశ్‌, రఘునాథ్‌, సురేశ్‌కుమార్‌, తిరుపతి, సమ్మయ్య, అభిలాశ్‌ తదితరులు ఉన్నారు.


logo